‘మరమ్మతు హక్కుల’ నిబంధనలపై కసరత్తు

19 Jul, 2022 06:30 IST|Sakshi

ప్రత్యేక కమిటీ భేటీ

న్యూఢిల్లీ: వినియోగదారులకు ఉత్పత్తులను స్వయంగా లేదా థర్డ్‌ పార్టీల ద్వారా మరమ్మతు చేయించుకునే హక్కులను (రైట్‌ టు రిపేర్‌) కల్పించడంపై కేంద్రం దృష్టి సారించింది. ఇందుకు సంబంధించిన నిబంధనలను రూపొందించేందుకు ఏర్పాటైన ప్రత్యేక కమిటీ జులై 13న తొలిసారిగా భేటీ అయింది. వినియోగదారుల వ్యవహారాల శాఖ ఈ విషయాలు తెలిపింది.

రిపేర్లు, విడిభాగాల విషయంలో కంపెనీలు ఏ విధంగా గుత్తాధిపత్యం చలాయిస్తున్నాయనేది కమిటీ .. సమావేశంలో చర్చించింది. ప్రధానంగా వ్యవసాయ పరికరాలు, మొబైల్‌ ఫోన్లు/ట్యాబ్లెట్లు, వినియోగ వస్తువులు, కార్ల వంటి ఆటోమొబైల్స్‌/ఆటోమొబైల్‌ పరికరాల రంగాల్లో ఇలాంటి ధోరణులను పరిశీలించింది.

సాధారణంగా కంపెనీలు తమ ఉత్పత్తుల మరమ్మతుకు తాము తయారు చేసే పరికరాలే వాడాలని, తమ దగ్గరే రిపేరు చేయించుకోవాలని .. థర్డ్‌ పార్టీలు లేదా సొంతంగా మరమ్మతు చేసుకుంటే వారంటీలు పనిచేయవంటూ షరతులు పెడుతుంటాయి. అలాగే పలు సంస్థలు ఉద్దేశపూర్వకంగా .. కొంత కాలానికి మాత్రమే పనిచేసేలా ఉత్పత్తులను తయారు చేస్తున్నాయి. ఆ తర్వాత అవి రిపేరుకు కూడా పనికి రాకుండా పోవడం వల్ల కస్టమర్లు మళ్లీ కొత్తవి కొనుక్కోవాల్సి వస్తోంది. ఫలితంగా పాతవి వ్యర్ధాల కింద మారుతున్నాయి. 

ఇలాంటి నియంత్రణలు, గుత్తాధిపత్య ధోరణులు .. వినియోగదారుల హక్కులకు భంగం కలిగించేవేనని ప్రభుత్వ కమిటీ అభిప్రాయపడింది. సమస్యలు వస్తే ఎలా రిపేరు చేసుకోవాలి, వేటిని ఉపయోగించాలి లాంటి విషయాల గురించి కస్టమర్లకు కంపెనీలు తెలియజేయాల్సిన అవసరం ఉందని పేర్కొంది. ఇందుకోసం థర్డ్‌ పార్టీలు, వ్యక్తులకు ఆయా సాధనాలను అందుబాటులో ఉంచాలని కమిటీ సభ్యులు అభిప్రాయపడ్డారు. రైట్‌ టు రిపేర్‌ వల్ల వ్యర్ధాలను కూడా తగ్గించవచ్చని పేర్కొన్నారు.ప్రస్తుతం అమెరికా, బ్రిటన్‌ సహా యూరోపియన్‌ యూనియన్‌లోని పలు దేశాలు’ రైట్‌ టు రిపేర్‌’ని గుర్తించాయి. 

మరిన్ని వార్తలు