ఆర్థిక శాఖ పరిధిలోకి డీపీఈ

8 Jul, 2021 06:30 IST|Sakshi

ప్రైవేటీకరణ వేగవంతానికి మార్గం

న్యూఢిల్లీ: ప్రభుత్వరంగ సంస్థలను ఆర్థికంగా పటిష్టం చేసి.. త్వరితంగా ప్రైవేటీకరణ చేసేందుకు వీలుగా కేంద్ర సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వరంగ సంస్థల విభాగం (డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ పబ్లిక్‌ ఎంటర్‌ప్రైజెస్‌/డీపీఈ)ను కేంద్ర ఆర్థిక శాఖలో విలీనం చేసింది. దీంతో ప్రభుత్వరంగ సంస్థలపై ఆర్థిక శాఖకు పూర్తి నియంత్రణకు మార్గం ఏర్పడింది. ఈ నిర్ణయంతో ఆర్థిక శాఖ కింద ప్రస్తుతం ఆరు విభాగాలు ఉన్నట్టు అవుతుంది. డీపీఈ ఆర్థిక శాఖ కిందకు రావడం వల్ల మూలధన నిధుల వ్యయాలపై మెరుగైన పర్యవేక్షణకు అవకాశం ఏర్పడుతుంది. ఆస్తుల విక్రయం, ప్రభుత్వరంగ సంస్థలు ఆర్థికంగా బలపడేందుకు వీలుంటుందని విశ్లేషకులు భావిస్తున్నారు. కేంద్ర ఆర్థిక శాఖ పరిధిలోని ఉప విభాగంగా ‘డీపీఈ (లోక్‌ ఉద్యమ్‌ విభాగ్‌)’ను చేర్చినట్టు కేబినెట్‌ కార్యదర్శి నోటిఫికేషన్‌ జారీ చేశారు. కేంద్ర మంత్రివర్గం విస్తరణకు ముందుగా ఈ నిర్ణయం చోటు చేసుకుంది. ప్రస్తుతం కేంద్ర ఆర్థిక శాఖ కింద ఆర్థిక వ్యవహారాలు, రెవెన్యూ, వ్యయాలు, పెట్టుబడులు, ప్రజా ఆస్తుల నిర్వహణ, ఆర్థిక సేవల విభాగాలున్నాయి. గతంలో వాజ్‌పేయి ప్రభుత్వ హయాంలో పెట్టుబడుల ఉపసంహరణ శాఖను ఏర్పాటు చేయగా.. దాన్ని సైతం ఆర్థిక శాఖలో విలీనం చేసిన విషయం విదితమే. దీనికితోడు విదేశీ పెట్టుబడుల నిర్వహణ విభాగాన్ని కూడా ఆర్థిక శాఖ కిందకు తీసుకొచ్చారు.  

భారీ పరిశ్రమల శాఖ కింద 44 సంస్థలు
భారీ పరిశ్రమల శాఖ ప్రధానంగా క్యాపిటల్‌ గూడ్స్‌ రంగానికి సంబంధించి కొనసాగనుంది. బీహెచ్‌ఈఎల్, సిమెంట్‌ కార్పొరేషన్, స్కూటర్స్‌ ఇండియా, హెచ్‌ఎంటీ, మారుతి ఉద్యోగ్‌ లిమిటెడ్‌ తదితర 44 కేంద్ర ప్రభుత్వరంగ సంస్థలు భారీ పరిశ్రమల శాఖ కింద కొనసాగుతాయి. ఈ శాఖ కింద ఉన్న కంపెనీల్లో చాలా వరకు మూతపడి, పెట్టుబడుల ఉపసంహరణ ప్రతిపాదనల్లో ఉన్నవి కావడం గమనార్హం. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వాటాల విక్రయం, పెట్టుబడుల ఉపసంహరణ రూపంలో రూ.1.75 లక్షల కోట్లను సమకూర్చుకోవాలని కేంద్ర ప్రభుత్వరం 2021–22 బడ్జెట్‌లో నిర్దేశించుకున్న విషయం తెలిసిందే. ఎల్‌ఐసీ మెగా ఐపీవోతోపాటు ఐడీబీఐలో వాటాల ఉపసంహరణ, బీపీసీఎల్, బీఈఎంల్, రెండు ప్రభుత్వరంగ బ్యాంకులు, ఒక సాధారణ బీమా సంస్థ ప్రైవేటీకరణ జాబితాలో ఉన్నాయి.

మరిన్ని వార్తలు