వ్యాపారంలో సొంత ఖర్చులా? అయితే చిక్కులు తప్పవు!

15 Nov, 2021 11:02 IST|Sakshi
కేసీహెచ్‌ ఏవీఎస్‌ఎన్‌ మూర్తి, కేవీఎన్‌ లావణ్య

నేను చిరు వ్యాపారం చేస్తున్నాను. జీఎస్‌టీ నంబర్‌ ఉంది. స్వంత ఇంట్లోనే వ్యాపారం. నా స్వంత ఖర్చులను కూడా వ్యాపారపు ఖర్చుల్లో కలిపివేయవచ్చా. అలా కలపడం వల్ల లాభం తగ్గుతుంది కదా – ఆర్‌ చిట్టిబాబు, శ్రీకాకుళం 
చిరు వ్యాపారం అంటున్నారు.. కానీ జీఎస్‌టీ నంబరు ఉందంటున్నారు. సరే, సరిగ్గా అన్ని రికార్డులు నిర్వహించండి. స్వంత ఇంట్లోనే వ్యాపారం అన్నారు. ఇల్లు మీ పేరు మీదే ఉంటే అద్దె నిమిత్తం ఏ ఖర్చూ రాయకండి. ఇల్లు ఇతర కుటుంబ సభ్యుల పేరు మీద ఉంటే అద్దె ఖర్చుగా రాయవచ్చు. అది కూడా మొత్తం ఇంట్లో ఎంత భాగం అయితే వ్యాపారానికి కేటాయిస్తున్నారో, అంతకు మాత్రమే ఖర్చు చేయండి. అలాగే కరెంటు, నీరు ఖర్చు కూడా . ఇక వ్యాపార నిర్వహణలో కేవలం వ్యాపారానికి సంబంధించిన ఖర్చును మాత్రమే పరిగణిస్తారు. వ్యక్తిగత ఖర్చులు, సొంత వాడకాలు, ఇతర ఖర్చులు, క్యాపిటల్‌ ఖర్చులు మొదలైనవి పరిగణించరు. ఇటువంటి ఖర్చులను వ్యాపార ఖాతాలో రాయకండి. సొంత వాడకాలని కూడా విడిగా రాయాలి. ఖర్చుల విషయంలో ‘‘సమంజసం’’, ‘‘ఉచితం’’, ‘‘సంబంధం’’ అన్న సూత్రాలు వర్తిస్తాయి. పుస్తకాలు సరిగ్గా రాయండి. ఆడిట్‌ అవసరం కాకపోతే ఖర్చులు రాయకుండా అమ్మకాల మీద 8 శాతం కన్నా ఎక్కువ లాభం చూపించవచ్చు. అప్పుడు లెక్కల బెడద ఉండదు. ఏది ఏమైనా సొంత ఖర్చులు కలపకూడదు.  
నేను ప్రభుత్వ సంస్థలో పని చేస్తున్నాను. ఒక కోర్టు కేసు వల్ల గతంలో జీతం చెల్లించలేదు. 3 సంవత్సరాలకు సంబంధించిన బకాయీలు ఈ సంవత్సరం ఇస్తారు. దీని వల్ల నాకు పన్ను భారం పెరుగుతుందా? – యం. నాగమణి, రాజమండ్రి 
ఇలాంటి బకాయీలను ‘‘ఎరియర్స్‌’’ అంటారు. వీటిని ట్యాక్సబుల్‌ ఇన్‌కంగా పరిగణిస్తారు. అంటే ఈ అదాయం మీద పన్ను భారం ఉంది. అయితే, ఒక వెసులుబాటు కూడా ఉంది. ఏ సంవత్సరానికి తత్సంబంధమైన ఆదాయం మాత్రమే పరిగణనలోకి తీసుకుంటే, మీరు తక్కువ/చిన్న శ్లాబులో ఉండే అవకాశం ఉంటుంది. ఆ సంవత్సరానికి సంబంధించిన రాయితీలు, మినహాయింపులు తీసుకోవచ్చు. పన్నుభారం తక్కువ కావచ్చు. మీకు రెండు సదుపాయాలు ఉన్నాయి. మొత్తం ఎరియర్స్‌ని ప్రస్తుత సంవత్సరం ఆదాయంతో బాటు కలిపి పన్ను భారం లెక్కించండి. రెండో పద్ధతి ప్రకారంలో ఈ ఎరియర్స్‌.. ఆర్థిక సంవత్సరం ప్రకారం సర్దుబాటు చేయండి. గతంలో వచ్చిన జీతానికి ఈ ‘ఎరియర్స్‌’ భాగం కలిపి పన్ను భారం లెక్కించండి. అలా ఎన్ని సంవత్సరాలు వర్తిస్తుందో.. అన్ని సంవత్సరాలకు పన్నుభారం లెక్కించండి. ఆ తర్వాత అలా అన్ని సంవత్సరాల పన్ను భారం కలిపి మొత్తం పన్నుభారాన్ని కనుక్కోండి. ఇలా వచ్చిన మొత్తం పన్ను భారాన్ని ముందు/మొదట్లో లెక్కించిన పన్నుభారంతో పోల్చి చూడండి. ఏది తక్కువ ఉందో, అంతే చెల్లించండి. ఇలా తక్కువ చెల్లించడాన్ని 89 (1) రిలీఫ్‌ అంటారు. మీరే ఒక స్టేట్‌మెంట్‌ చేసుకుని ఫారం 10 ఉలో సమాచారాన్ని పొందుపర్చి, మీ యజమానికి ఇవ్వండి. రిలీఫ్‌ ఇస్తారు. ఒకవేళ ప్రస్తుత సంవత్సరంలోనే పన్నుభారం తక్కువగా ఉందనుకోండి. 10 ఉ ఇవ్వనవసరం లేదు. అన్ని రికార్డులు జాగ్రత్తగా భద్రపర్చుకోండి. 
- కె.సీహెచ్‌.ఎ.వి.ఎస్‌.ఎన్‌ మూరి, కె.వి.ఎన్‌ లావణ్య (ట్యాక్సేషన్‌ నిపుణులు)
 

మరిన్ని వార్తలు