Deloitte Global Automotive: ప్రతీ ముగ్గురిలో ఒకరి ఓటు వీటికే

10 Feb, 2022 08:23 IST|Sakshi

ఎలక్ట్రిక్, హైబ్రిడ్‌ వాహనాల పట్ల ఆసక్తి

వాహన మార్కెట్‌పై డెలాయిట్‌ అధ్యయనం  

న్యూఢిల్లీ: భారత్‌లో రవాణా పరంగా వినియోగ ధోరణులు మారిపోతున్నట్టు డెలాయిట్‌ గ్లోబల్‌ ఆటోమోటివ్‌ కన్జూమర్‌ స్టడీ 2022 తెలిపింది. మరింత మంది ఎలక్ట్రికల్‌ (ఈవీ), హైబ్రిడ్‌ (ఒకటికంటే ఎక్కువ ఇంధనాలతో పనిచేసేవి) వాహనాల పట్ల ఆసక్తి చూపిస్తున్నారని పేర్కొంది. తన అధ్యయనంలో భాగంగా వాహనదారుల అభిరుచులు, ఆసక్తులు, ఇష్టాలను ఈ సంస్థ తెలుసుకుని ఒక నివేదిక విడుదల చేసింది. పర్యావరణ అనుకూల వాహనాలపై ప్రభుత్వం దృష్టి సారించడం ఇందుకు మద్దతునిస్తున్నట్టు తెలిపింది. 

నివేదికలోని అంశాలు..  
► భారత్‌లో 59 శాతం మంది వినియోగదారులు వాతావరణ మార్పులు, కాలుష్యం స్థాయి, డీజిల్‌ వాహనాలు విడుదల చేస్తున్న కర్బన ఉద్గారాల పట్ల ఆందోళన వ్యక్తం చేశారు. 
► ఇంధన వ్యయాలు తక్కువగా ఉండడం, పర్యావరణ పట్ల స్పృహ, వాహనం నడిపే విషయంలో మెరుగైన అనుభవం తదితర అంశాలు ఈవీల పట్ల ఆసక్తికి కారణాలు.   
► బ్యాటరీ స్వాపింగ్‌ (బ్యాటరీ మార్పిడి), చార్జింగ్‌ సదుపాయాలపై బడ్జెట్‌లో దృష్టి సారించడం అన్నది పర్యావరణ అనుకూల వాహన వినియోగాని మద్దతునివ్వడమే. 
►69 శాతం మంది ప్రీఓన్డ్‌ (అప్పటికే మరొకరు వినియోగించిన) వాహనాల పట్ల ఆసక్తిగా ఉన్నారు. 
► ఈవీలను సబ్‌స్క్రిప్షన్‌ విధానంలో తీసుకునేందుకు 70 శాతం మంది ఆసక్తితో ఉన్నారు.  

వృద్ధి కొత్త పుంతలు   
‘‘కస్టమర్ల అవసరాలు, అద్భుతమైన ఆవిష్కరణలతో భారత ఆటోమోటివ్‌ పరిశ్రమ కొత్త తరం వృద్ధిని చూడబోతోంది. వినియోగదారులు ప్రత్యామ్నాయ పవర్‌ ట్రెయిన్‌ ఆప్షన్లను పరిశీలిస్తున్నట్టు మా అధ్యయనంలో తెలిసింది. ఇది ఈవీ వృద్ధికి మద్దతుగా నిలుస్తుంది’’ అని డెలాయిట్‌ ఇండియా పార్ట్‌నర్‌ రాజీవ్‌సింగ్‌ తెలిపారు.
 

మరిన్ని వార్తలు