Google For India 2021 Highlights: గూగుల్‌ అసిస్టెంట్‌తో టీకాల బుకింగ్‌

19 Nov, 2021 12:30 IST|Sakshi

డిజిటల్‌ ఆవిష్కరణలపై గూగుల్‌ దృషి

పే యాప్‌లో త్వరలో స్పీచ్‌ టు టెక్ట్స్‌ ఫీచర్‌ 

గూగుల్‌ ఫర్‌ ఇండియా సమావేశంలో వెల్లడి  

Google For India Event 2021 Key Announcements: దేశీయంగా డిజిటల్‌ సర్వీసులను అందరికీ అందుబాటులోకి తెచ్చే దిశగా టెక్నాలజీ దిగ్గజం గూగుల్‌ మరింతగా దృష్టి పెడుతోంది. ఇందులో భాగంగా గురువారం జరిగిన గూగుల్‌ ఫర్‌ ఇండియా ఏడో వార్షిక సమావేశం సందర్భంగా పలు ప్రకటనలు చేసింది. గూగుల్‌ అసిస్టెంట్‌ ఆధారిత టీకా బుకింగ్‌ సేవలు, సిడ్బి భాగస్వామ్యంతో లఘు పరిశ్రమలకు రుణ సదుపాయం కల్పించడం మొదలైనవి వీటిలో ఉన్నాయి. కొత్త ఇంటర్నెట్‌ యూజర్లు భారతీయ భాషల్లో సమాచారాన్ని పొందడానికి, చిన్న వ్యాపారాలు అభివృద్ధి చెందడానికి తోడ్పడే డిజిటల్‌ ఆవిష్కరణలపై కంపెనీకి ఉన్న నిబద్ధతకు ఇవి నిదర్శనమని గూగుల్‌ ఇండియా కంట్రీ హెడ్‌ సంజయ్‌ గుప్తా తెలిపారు. ఇటు వినియోగదారులకు, అటు డిజిటల్‌ ఎకానమీలో పెట్టుబడులు పెట్టే ఇన్వెస్టర్లు సురక్షితంగా ఉండేలా తగు సైబర్‌ చట్టాల తెస్తున్నామని కార్యక్రమంలో పాల్గొన్న కేంద్ర ఐటీ శాఖ సహాయ మంత్రి రాజీవ్‌ చంద్రశేఖర్‌ వివరించారు.  

‘గూగుల్‌ పే’లో హింగ్లీష్‌ 
చెల్లింపు సేవల యాప్‌ గూగుల్‌ పేలో త్వరలో స్పీచ్‌ టు టెక్ట్స్‌ ఫీచర్‌ను ఆవిష్కరించనున్నట్లు గూగుల్‌ పే వైస్‌ ప్రెసిడెంట్‌ (ప్రోడక్ట్‌ మేనేజ్‌మెంట్‌) అంబరీష్‌ కెంగె తెలిపారు. దీనితో చెల్లింపు జరపాల్సిన ఖాతా నంబరును వాయిస్‌తో (చెప్పడం ద్వారా) యాప్‌నకు జోడించవచ్చని చెప్పారు. అలాగే దేశీ యూజర్ల సౌలభ్యం కోసం తమ ప్లాట్‌ఫాంపై హింగ్లీష్‌ (హిందీ, ఇంగ్లీష్‌ కలయిక) ప్రాధాన్య భాషగా ఎంచుకునే సౌకర్యం అందుబాటులోకి తెచ్చినట్లు వివరించారు.  

సిడ్బితో జట్టు.. 
రూ. 110 కోట్ల ఆర్థిక ప్రోగ్రాంతో చిన్న సంస్థలకు రుణాలు ఇచ్చే దిశగా స్మాల్‌ ఇండస్ట్రీస్‌ డెవలప్‌మెంట్‌ బ్యాంక్‌ (సిడ్బి)తో గూగుల్‌ చేతులు కలిపింది. దీని కింద మెరుగైన వడ్డీ రేట్లపై లఘు పరిశ్రమలు రూ. 25 లక్షల నుంచి రూ. 1 కోటి దాకా రుణాలు పొందవచ్చు. మహిళల సారథ్యంలోని సంస్థలు, కరోనా మహమ్మారిపై పోరుకు అవసరమైన వాటిని తయారు చేస్తున్న సంస్థలకు ప్రాధాన్యం లభిస్తుందని సిడ్బి సీఎండీ శివసుబ్రమణియన్‌ రామన్‌ తెలిపారు.  

గూగుల్‌ ఫర్‌ ఇండియాలో మరిన్ని ప్రకటనలు  
- గూగుల్‌ అసిస్టెంట్‌ సహాయంతో కోవిన్‌ వెబ్‌సైట్‌లో టీకాలకు బుకింగ్‌ చేసుకోవచ్చు. 2022 తొలి నాళ్ల నుంచి ఇది అందుబాటులోకి వస్తుంది ఎనిమిది భాషల్లో ఈ సర్వీసు లభ్యమవుతుంది.  
- యూజర్లు ..సినిమాలు, పాటలతో నేరుగా యూట్యూబ్‌ చానెల్స్‌ నుంచి వీడియోలను క్రియేట్‌ చేసేలా కొత్త ఫీచర్‌ను గూగుల్‌ ప్రకటించింది. ఎన్‌హెచ్‌ స్టూడియోజ్‌ యూట్యూబ్‌ ఛానెల్‌ ద్వారా ఈ ఫీచర్‌ ఉపయోగించుకోవచ్చు. 
- వాతావరణ అలర్ట్‌లు అందించడానికి కేంద్రీయ కాలుష్య నియంత్రణ బోర్డు, ఇండియన్‌ మెటిరియోలాజికల్‌ డిపార్ట్‌మెంట్‌ (ఐఎండీ)తో జట్టు. 
- నాస్కామ్‌ ఫౌండేషన్‌ తదితర సంస్థల భాగస్వామ్యంతో గూగుల్‌ కెరియర్‌ సర్టిఫికెట్స్‌కు సంబంధించి ఒక లక్ష స్కాలర్‌షిప్‌లను కంపెనీ ప్రకటించింది.

చదవండి: 
 

మరిన్ని వార్తలు