హ్యుందాయ్‌ నుంచి ఎలక్ట్రిక్‌ కారు.. మైలేజ్‌, మ్యాగ్జిమమ్‌ స్పీడ్‌ ఎంతంటే?

2 May, 2022 16:20 IST|Sakshi

ఎలక్ట్రిక్‌ వెహికల్‌ మార్కెట్‌లో టూ వీలర్‌ సెగ్మెంట్‌పై పెద్దగా దృష్టి పెట్టని బడా కంపెనీలు కార్ల మార్కెట్‌లో మాత్రం నువ్వా నేనా అన్నట్టుగా పోటీ పడుతున్నాయి. ఇప్పటికే ఈ సెగ్మెంట్‌లో టాటా దూసుకుపోతుండగా కియా నేను వస్తున్నా అంటూ ప్రకటించింది. తాజాగా ఈవీ పోటీకి రెడీ అంటోంది హ్యుందాయ్‌.

దేశీయంగా కార్ల అమ్మకాల్లో రెండో పెద్ద కంపెనీగా ఉన్న హ్యుందాయ్‌ తన అభిమానులకు శుభవార్త చెప్పింది. ఈ ఏడాది మూడో త్రైమాసికంలో ఎలక్ట్రిక్‌ కారును రిలీజ్‌ చేయబోతుంది. ఐయోనిక్‌ 5 పేరుతో ఈ ఎలక్ట్రిక్‌ కారుని రిలీజ్‌ చేయబోతుంది. 

ఇండస్ట్రీ ఇన్‌సైడ్‌ వర్గాల నుంచి అందిన సమచారం ప్రకారం ఐయోనిక్‌ 5 కారు 58 కిలోవాట్‌ ప్యాక్‌, 77.4 కిలోవాట్‌ బ్యాటరీ సామర్యంతో రెండు వేరియంట్లలో లభించనుంది. డ్యూయల్‌ మోటార్‌ కాన్ఫిగిరేషన్‌తో ఈ కార్లు రానున్నాయి. సింగిల్‌ ఛార్జ్‌తో 481 కిలోమీటర్ల మైలేజ్‌ అందివ్వనుంది. గరిష్టంగా గంటకు 260 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగలదు. 5.2 సెకన్లలో వంది కిలోమీటర్ల స్పీడ్‌ టచ్‌ చేయగలదు.

ఇందులో 800వీ ఎలక్ట్రిక్‌ ఆర్కిటెక్చర్‌ సిస్టమ్‌ అమర్చారు. దీంతో 350 కిలో వాట్స్‌ ఛార్జర్‌ సాయంతో 18 నిమిషాల వ్యవధిలో 10 నుంచి 80 శాతం వరకు బ్యాటరీ ఛార్జ్‌ అవుతుంది. 50 కిలోవాట్ల ఛార్జర్‌ సాయంతో 56 నిమిషాల్లో 10 నుంచి 80 శాతం వరకు బ్యాటరీ ఛార్జ్‌ అవుతుంది.

పొడవు, వెడల్పు, వీల్‌బేస్‌ తదితర విషయాల్లో హ్యుందాయ్‌ టక్సన్‌ కంటే ఒక ఇంచు ఎక్కువే ఉండవచ్చని సమాచారం. ఎంట్రీ నుంచి హై ఎండ్‌ వరకు మొత్తం ఆరు ఈవీలను ఇండియాలో పరిచయం చేయాలని హ్యుందాయ్‌ ప్రణాళికలో ఉంది. కాగా ఇందులో మొదటి వాహనంగా ఐయోనిక్‌ 5 రిలీజ్‌ కానుంది. దక్షిణ కొరియాలో తయారైన కార్లను ఇండియాలో అసెంబ్లింగ్‌ చేయనున్నట్టు సమాచారం.

చదవండి: ఈలాన్‌మస్క్‌ ఎక్కడ.. చైనా అప్పుడే మొదలెట్టింది!

మరిన్ని వార్తలు