మార్క్‌ జుకర్‌బర్గ్‌పై తీవ్ర విమర్శలు.. ఇన్‌స్టాగ్రామ్‌.. టేక్‌ ఏ బ్రేక్‌ !

11 Nov, 2021 19:42 IST|Sakshi

Instagram Take A Break Option : యూజర్లకు మరింత చక్కని ఎక్స్‌పీరియన్స్‌ ఇచ్చేందుకు ఇన్‌స్టాగ్రామ్‌ సరికొత్త ఆప్షన్‌ని అందుబాటులోకి తెచ్చింది. టేక్‌ ఏ బ్రేక్‌ పేరుతో ఇప్పటికే దీని బీటా వెర్షన్‌ని యూజర్లకు అందిస్తోంది. ఇక్కడ వచ్చిన ఫలితాలను పరిశీలించి డిసెంబరు నాటికి యూజర్లందరికీ అందుబాటులోకి తెస్తామంటూ ఇన్‌స్టాగ్రామ్‌ హెడ్‌ ఆడమ్‌ ముస్సోరీ ట్విట్టర్‌లో పోస్ట్‌ చేశారు.

టేక్‌ ఏ బ్రేక్‌
ఇన్‌స్టాగ్రామ్‌ యాప్‌ను ఉపయోగించే యూజర్ల స్క్రీన్‌ టైమ్‌ని కంట్రోల్‌ చేయడం, సలహాలు ఇవ్వడం ఈ టేక్‌ ఏ బ్రేక్‌ ఆప్షన్‌ యొక్క ముఖ్య ఉద్దేశం. ఇన్‌స్టాని యూజ్‌ చేస్తున్నప్పుడు పది , ఇరవై, ముప్పై నిమిషాలు గడిచిన తర్వాత టేక్‌ ఏ బ్రేక్‌ అంటూ పాప్‌ అప్‌ మేసేజ్‌ వస్తుంది. అప్పుడు యూజర్లు కాసేపు ఇన్‌స్టాకి విరామం ఇచ్చి ఇతర పనులు చూసుకోవచ్చు. 

కుదిపేసిన ఆరోపణలు
ఇన్‌స్టాగ్రామ్‌ని మేటా సంస్థ అందిస్తోంది. ఇటీవల మేటా మాజీ ఉద్యోగి విజిల్‌ బ్లోయర్‌ ఫ్రాన్సెస్‌ మేటాపై తీవ్రమైన ఆరోపణలు చేశారు. మేటా యజమాని మార్క్‌ జుకర్‌బర్గ్‌ లాభాలే లక్ష్యంగా సోషల్‌ మీడియా ఫ్లాట్‌ఫామ్స్‌ నడిపిస్తున్నారంటూ ఆరోపించి సంచనలం సృష్టించారు. ముఖ్యంగా ఇన్‌స్టాగ్రామ్‌ కారణంగా టీనేజర్లు పెడదోవ పడుతున్నారంటూ ఆమె బల్లగుద్ది మరీ వాదించారు. అమెరికా సెనెట్‌ను ఈ ఆరోపణలు పట్టి కుదిపేశాయి.

విమర్శల వల్లేనా?
మేటా ఆధ్వర్యంలో నడుస్తున్న సోషల్‌ మీడియా ఫ్లాట్‌ఫామ్స్‌పై నలువైపుల నుంచి వస్తున్న విమర్శల తాకిడి విరుగుడుగా ఈ టేక్‌ ఏ బ్రేక్‌ ఆప్షన్‌ని మేటా అందుబాటులోకి తెచ్చిందని విశ్లేషకులు భావిస్తున్నారు. యూజర్ల సంక్షేమాన్ని, సమయాన్ని దృష్టిలో ఉంచుకునే టేక్‌ ఏ బ్రేక్‌ ఆప్షన్‌ తెచ్చారని చెబుతున్నారు. ముఖ్యంగా టీనేజర్లకు ఇన్‌స్టాలో ఎంత సమయం గడిపామనే విషయం ఇట్టే తెలిసిపోతుందని, దానికి తగ్గట్టుగా నిర్ణయాలు తీసుకుంటారని భావిస్తున్నారు. ఈ టేక్‌ ఏ బ్రేక్‌ ఆప్షన్‌తో యూజర్ల సంక్షేమం కోసం మేటాకి ప్రాధాన్యం అనే సందేశం ఇచ్చినట్టు అవుతుందంటున్నారు.
 

చదవండి: ఇన్‌స్టాగ్రామ్‌, టిక్‌టాక్‌ డేటా లీక్‌.. కిమ్ క‌ర్దాషియ‌న్ తో పాటు

మరిన్ని వార్తలు