జేమ్స్‌ వెబ్‌ టెలిస్కోప్‌ ప్రయోగం విజయవంతం..!విశ్వం పుట్టుక.. గుట్టు వీడేనా!

25 Dec, 2021 18:40 IST|Sakshi

నాసా సైంటిస్ట్‌ల 25 ఏళ్ల శ్రమ.. 20 దేశాల సహకారంతో రూపకల్పన. సుమారు 76 వేల కోట్ల రూపాయలు వ్యయం. వెరసీ అంతర్జాతీయ పరిశోదనా కేంద్రం నాసా 25 ఏళ్ల పాటు నిర్విరామంగా తయారు చేసిన జేమ్స్‌ వెబ్‌ స్పేస్‌ టెలిస్కోప్‌(జేడబ్ల్యూఎస్‌టీ) ప్రయోగం విజయవంతమైంది. భారత కాలమానం ప్రకారం శనివారం సాయంత్రం 5.50 గంటలకు ఫ్రెంచ్ గయానా నుంచి యూరోపియన్ అరియాన్ రాకెట్ ద్వారా ఈ జేడబ్యూఎస్‌టీని నింగిలోకి ఎగిసింది. ఈ టెలిస్కోప్‌ భూమి నుంచి సుమారు 1.5 మైళ్ల దూరంలో ఉండనుంది. ఎలాంటి అవాంతరాలు లేకుండా టెలిస్కోప్‌ గ్రౌండ్‌ కంట్రోలర్స్‌తో కమ్యూనికేట్‌ చేస్తోందని నాసా వెల్లడించింది.

జేమ్స్‌ వెబ్‌ స్పేస్‌ టెలిస్కోప్‌తో పాటు
జేమ్స్‌ వెబ్‌ స్పేస్‌ టెలిస్కోప్‌తో పాటు నాలుగు రకాలైన నియర్‌ ఇన్‌ ఫ్రా రెడ్‌ కెమెరా, నియర్‌ ఇన్‌ ఫ్రా రెడ్‌ స్పెక్ట్రోగ్రాఫ్‌, మిడ్‌ - ఇన్‌ ఫ్రా రెడ్‌  ఇన్‌స్ట్రుమెంట్‌, నియర్‌ ఇన్‌ ఫ్రా రెడ్‌  ఇమేజర్‌ అండ్‌ శాటిలైట్‌ స్పెక్ట్రో గ్రాఫ్‌ వంటి అత్యాధునికి సైన్స్‌ పరికరాల్ని పంపిస్తున్నారు. నాసా తెలిపిన వివరాల ప్రకారం..ఈ నాలుగు అత్యాధునిక ఇన్‌స్ట్రుమెంట్స్‌  గెలాక్సీల పుట్టుపూర్వత్రాలు వాటి నిర్మాణం, గ్రహ వ్యవస్థలు, నక్షత్రాల గురించి తెలుసుకుంటాయని తెలిపింది. 

కెమెరాల్ని ఎందుకు పంపిస్తున్నారు?

1380 కోట్ల సంవత్సరాల కిందట దట్టమైన కణాలతో బిగ్ బ్యాంగ్ అనే విస్పోటనం ఏర్పడిందని సైంటిస్ట్‌లు నమ్ముతారు. ఆ బిగ్‌ బ్యాంగ్‌ ఏర్పడిన తర్వాత 150-200 మిలియన్ సంవత్సరాల తర్వాత మొదటి నక్షత్రాలు ఏర్పడ్డాయని అధ్యయనాలు సూచిస్తున్నాయి. కాబట్టి విశ్వం యొక్క మొదటి కాంతి లేదా నక్షత్రాలు ఎలా ఉన్నాయనే' అంశాలతో పాటు గెలాక్సీల పుట్టుక, విశ్వ ఆవిర్భవ అంశాలను లోతుగా పరిశీలించేందుకు, అనేక అంతుచిక్కని ప్రశ్నలకు సమాధానం తెలుసుకునేందుకు ఈ ఇన్‌ఫ్రారెడ్ కెమెరాలను జేమ్స్‌ వెబ్‌ స్పేస్‌ టెలిస్కోప్‌తో పంపిస్తున్నారు.

ఇక ఈ ప్రయోగంలో జేడబ్ల్యూఎస్‌టీ టెలిస్కోప్‌ మన సౌర వ్యవస్థ యొక్క గ్రహాలైన మార్స్, బృహస్పతి, శని, యురేనస్, నెప్ట్యూన్, వాటి ఉపగ్రహాలను అధ్యయనం చేయడానికి కూడా రూపొందించబడింది. ఇది తోకచుక్కలు, గ్రహశకలాలు, అంగారక కక్ష్యలో లేదా వెలుపల ఉన్న చిన్న గ్రహాలను కూడా అధ్యయనం చేస్తుందని నాసా సైంటిస్ట్‌లు చెబుతున్నారు. 

డేటా సేకరించడం ఎలా?
గెలాక్సీ, నక్షత్రాలు గుట్టు తెలుసుకునేందుకు నాసా పంపిస్తున్న ఈ టెలిస్కోప్‌ సాయంతో అంతరిక్షం నుంచి హై ఫ్రీక్వెన్సీ రేడియో ట్రాన్స్‌ మీటర్‌ ద్వారా భూమి మీద ఉన్న నాసా డీప్‌ స్పేస్‌ నెట్‌ వర్క్‌కు పంపనుంది. తద్వారా అక్కడి వింతలు, విశేషాలు తెలుసుకోవడం మరింత ఈజీ అవుతుంది. 

చదవండి: అంతరిక్షంలో పెట్రోల్‌ బంకులు, గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చిన నాసా

>
మరిన్ని వార్తలు