ఎల్‌ఐసీ షేరు ధర ఆకర్షణీయం...

30 Apr, 2022 20:50 IST|Sakshi

వృద్ధికి అపార అవకాశాలు సంస్థ చైర్మన్‌ ఎంఆర్‌ కుమార్‌

న్యూఢిల్లీ: ఎల్‌ఐసీ ఐపీవో ధర ఎంతో ఆక్షణీయంగా ఉన్నట్టు ఆ సంస్థ చైర్మన్‌ ఎంఆర్‌ కుమార్‌ అన్నారు. కంపెనీ వృద్ధికి అపార అవకాశాలున్నాయని, ఇన్వెస్టర్లు రానున్న సంవత్సరాల్లో రాబడులను ఆశించొచ్చని అభిప్రాయపడ్డారు. ఎంబెడెడ్‌ వ్యాల్యూ కంటే.. నూతన వ్యాపార విలువ (వీఎన్‌బీ) రాబోయే కాలంలో ఎలా ఉంటుందో చూడాలని సూచించారు. భవిష్యత్తులో ఇది 12–13 శాతానికి చేరుకుంటుందని చెప్పారు. ప్రస్తుతం ఇది 9 శాతంగా ఉంది. ఐపీవోలో ఇన్వెస్టర్లు పాల్గొనడం ద్వారా లాభాలకు ఏమైనా అవకాశం ఉందా? అన్న ప్రశ్నకు కుమార్‌ స్పందించారు. ‘‘ఇది మార్కెట్‌ అవగాహనపై ఆధారపడి ఉంటుంది. ఎల్‌ఐసీ తక్కువ వీఎన్‌బీతో ఆరంభమవుతోంది. కనుక వృద్ధికి అవకాశాలున్నాయి’’అని చెప్పారు. కొత్త పాలసీలపై భవిష్యత్తులో ఆర్జించే రాబడులకు సంబంధించి ప్రస్తుత విలువే వీఎన్‌బీగా పేర్కొంటారు. ఎల్‌ఐసీ 1.11 రెట్ల ఎంబెడెడ్‌ వ్యాల్యూతో ఐపీవోకు వస్తోంది. గతంలో ప్రభుత్వరంగ బీమా సంస్థలైన న్యూ ఇండియా అష్యూరెన్స్, జీఐసీ ఆర్‌ఈ ఇన్వెస్టర్లకు రాబడులు ఇవ్వని అంశాన్ని ప్రస్తావించగా.. అవి భిన్నమైన వ్యాపారంలో ఉన్నాయని, అక్కడ లాభాల మార్జిన్లు చాలా తక్కువగా ఉంటాయని కుమార్‌ బదులిచ్చారు.

మే 17న లిస్టింగ్‌
ఎల్ఐ‌సీ ఐపీవో ధరను ఒక్కో షేరుకు రూ.902–949గా నిర్ణయించడం గమనార్హం. కేంద్ర ప్రభుత్వం 3.5 శాతం వాటాను (22.13 కోట్ల షేర్లను) ఆఫర్‌ ఫర్‌ సేల్‌ (ఓఎఫ్‌ఎస్‌) రూపంలో విక్రయిస్తోంది. మే 4న ఐపీవో ప్రారంభమై 9న ముగియనుంది. మే 17న స్టాక్‌ ఎక్సేంజ్‌ల్లో లిస్ట్‌ కానుంది. ఐపీవో రూపంలో కేంద్రానికి రూ.21,000 కోట్లు సమకూరనున్నాయి. రూ.40 లక్షల కోట్ల నిర్వహణ ఆస్తులతో (ఏయూఎం) ఎల్‌ఐసీ దేశంలోనే అతిపెద్ద బీమా సంస్థగా కొనసాగుతోంది.

25 యాంకర్‌ ఇన్వెస్టర్లు
ఎల్‌ఐసీ ఐపీవోలో పాల్గొనేందుకు 25 మంది యాంకర్‌ ఇన్వెస్టర్లు ఆసక్తి చూపించారు. ఇందులో దేశ, విదేశీ ఇన్వెస్టర్లు ఉన్నట్టు లీడ్‌ మేనేజర్‌ వర్గాలు తెలిపాయి. మే 2న యాంకర్‌ బుక్‌ ప్రారంభం కానుంది. మొత్తం ఇష్యూలో క్యూఐపీలకు 50 శాతం కోటా కేటాయించగా.. ఇందులో 30 శాతాన్ని యాంకర్‌ ఇన్వెస్టర్లకు పక్కన పెట్టనున్నారు.

ప్రభుత్వ  హామీ కొనసాగుతుంది
ఐపీవో తర్వాత కూడా ఎల్‌ఐసీ పాలసీలకు సంబంధించి ప్రభుత్వ హామీ సెక్షన్‌ 37 కింద కొనసాగుతుందని సంస్థ ఎండీ సిద్ధార్థ్‌ మొహంతి తెలిపారు. ఎల్‌ఐసీలో ప్రభుత్వ వాటా 51 శాతానికంటే దిగువకు పడిపోదని చెప్పారు.

కనీస పబ్లిక్‌ వాటా నిబంధన సడలింపు
కనీస ప్రజల వాటా నిబంధన నుంచి ఎల్‌ఐసీ ఐపీవోకు సడలింపు ఇవ్వాలని సెబీతో ఆర్థిక శాఖ చర్చలు నిర్వహిస్తోందని పెట్టుబడులు, ప్రజా ఆస్తుల నిర్వహణ విభాగం (దీపమ్‌) కార్యదర్శి తుహిన్‌ కాంత పాండే తెలిపారు. ఈ సమయంలో ఎల్‌ఐసీలో 5 శాతం వాటాలను కూడా మార్కెట్‌ సర్దుబాటు చేసుకునే పరిస్థితిలో లేదన్న విషయాన్ని గుర్తు చేశారు. లిస్ట్‌ అయిన ఏడాదిలోపు ఎల్‌ఐసీలో కేంద్ర ప్రభుత్వం తన వాటాలను తగ్గించుకోబోదని పాండే స్పష్టం చేశారు. సెబీ నిబంధనల ప్రకారం రూ.లక్ష కోట్లకుపైగా విలువైన కంపెనీలు ఐపీవోలో కనీసం 5 శాతానికి తక్కువ కాకుండా విక్రయించడానికి లేదు. అలాగే, లిస్ట్‌ అయిన ఐదేళ్లలోపు కంపెనీలో ప్రజల వాటా కనీసం 25 శాతానికి తక్కువ ఉండకూడదు.

ఐపీవోలో రూ.5లక్షలకు పేటీఎం అనుమతి
పేటీఎం మనీ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని ఇన్వెస్టర్లు ఎల్‌ఐసీ ఐపీవోలో యూపీ ఐ ద్వారా రూ.5లక్షల వరకు పెట్టుబడి పెట్టుకునే అవకాశం కల్పిస్తున్నట్టు ప్రకటించింది. ఈ విషయాన్ని పేటీఎం మనీ సీఈవో వరుణ్‌ శ్రీధర్‌ తెలిపారు. ఇన్వెస్టర్లు పేటీఎం మనీ యాప్‌ హోమ్‌ పేజీలో ఐపీవో సెక్షన్‌కు వెళ్లాలి. అక్కడ ఇన్వెస్టర్‌ కేటగిరీని ఎంచుకుని బిడ్‌ను దాఖలు చేసుకోవచ్చు. రూ.5లక్షల వరకు బిడ్‌ వేయాలనుకుంటే హెచ్‌ఎన్‌ఐ కేటగిరీని ఎంపిక చేసుకోవాలి.

చదవండిఎల్‌ఐసీ పబ్లిక్‌ ఇష్యూ షురూ..పాలసీదారులకు, రిటైల్‌ ఇన్వెస్టర్లకు బంపరాఫర్‌..!

మరిన్ని వార్తలు