మైలేజీ రావట్లేదా ? అయితే బండి వెనక్కి తీసుకుంటాం! మహీంద్రా సంచలన ఆఫర్‌

25 Jan, 2022 11:14 IST|Sakshi

దేశీ ఆటోమొబైల్‌ కంపెనీల్లో మహీంద్రాకి ప్రత్యేక స్థానం ఉంది. ముఖ్యంగా ఎస్‌యూవీ కేటరిగిలో ఇప్పటికే పాతుకుపోయిన మహీంద్రా తాజాగా హెవీ వెహికల్స్‌, కమర్షియల్‌ వెహికల్స్‌ మార్కెట్‌పై కన్నేసింది. దీంతో కస్టమర్లను ఆకట్టుకునేందుకు సంచలన ఆఫర్‌ ప్రకటించింది. 

మహీంద్రా గ్రూపులో భాగమైన మహీంద్రా ట్రక్‌ బస్‌ (ఎంటీబీ) ఇటీవల ప్రకటించిన ఆఫర్‌ ఆటోమొబైల్‌ సెక్టార్‌లో సంచలనంగా మారింది. ఎంబీటీ నుంచి వచ్చే కమర్షియల్‌ వెహికల్స్‌లో 3.50 టన్నుల నుంచి 55 టన్నుల లోడు వరకు ఉండే లైట్‌, మీడియం, హెవీవెహికల్స్‌ మైలేజీపై ఛాలెంజ్‌ విసిరింది. బీఎస్‌ 6 టెక్నాలజీతో వస్తున్న ఈ వాహనాలు అధిక మైలేజీని అందిస్తాయని హామీ ఇస్తోంది. ఎవరైన మైలేజీపై అసంతృప్తి చెందితే వాహనాన్ని వెనక్కి తీసుకుంటామంటూ ప్రకటించింది.

ఎంబీటీ కమర్షియల్‌ వెహికల్‌ సెగ్మెంట్లో హెచ్‌సీవీ బ్లాజో ఎక్స్‌, ఐవీసీ ఫురియో, ఎస్‌సీవీ ఫురియో 7 , జయో రేంజ్‌ వాహనాలు ఉన్నాయి. అధిక మైలేజీ వచ్చేందుకు వీలుగా ఈ వాహనాల్లో 7.2ఎల్‌ ఎం పవర్‌ ఇంజన్‌, ఎండీఐ టెక్‌ ఇంజన్‌, ఫ్యూయల్‌ స్మార్ట్‌ టెక్నాలజీ, కటిండ్‌ ఎడ్జ్‌ ఐమాక్స్‌ టెలిమాటిక్‌ సొల్యూషన్‌ తదితర సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగిస్తున్నారు. 

కమర్షియల్‌ వాహనాలకు సంబంధించి 60 శాతం ఖర్చు ఫ్యూయల్‌కే అవుతుంది. తాజాగా పెరిగిన ధరలు మరింత ఇబ్బందిగా మారాయి. దీంతో అధిక మైలేజీకి మహీంద్రా ప్రాధాన్యత ఇస్తోంది. గతంలో గెట్‌ మోర్‌ మైలేజ్‌ ఆర్‌ గీవ్‌ బ్యాక్‌ ట్రక్‌ పాలసీని హెచ్‌సీవీ బ్లాజో ట్రక్‌ విషయంలో మహీంద్రా ప్రకటించింది. 2016లో ఈ ఆఫర్‌ తేగా ఒక్క వాహనం కూడా వెనక్కి రాలేదు. దీంతో ఇప్పుడు కమర్షియల్‌ సెగ్మెంట్‌లో బీఎస్‌ 6 ఇంజన్లు అన్నింటికీ దీన్ని వర్తింప చేయాలని మహీంద్రా నిర్ణయం తీసుకుంది.  
 

మరిన్ని వార్తలు