సాగర్‌మాల.. 1,537 ప్రాజెక్టులు.. రూ.6.5 లక్షల కోట్ల పెట్టుబడులు

7 May, 2022 10:51 IST|Sakshi

202 ప్రాజెక్టులు ఇప్పటికే పూర్తి 

కేంద్ర మంత్రి సర్బానంద సోనోవాల్‌  

న్యూఢిల్లీ: సాగర్‌మాల కార్యక్రమం కింద రూ.6.5 లక్షల కోట్ల విలువైన 1,537 ప్రాజెక్టులను అమలు చేయనున్నట్టు కేంద్ర మంత్రి సర్బానంద సోనోవాల్‌ ప్రకటించారు. తీరప్రాంత జిల్లాలను అన్ని రకాలుగా అభివృద్ధి చేయాలన్న లక్ష్యంతో రూ.58,700 కోట్ల వ్యయ అంచనాలతో 567 ప్రాజెక్టులను గుర్తించినట్టు మంత్రి వెల్లడించారు.

సాగర్‌మాల
దేశవ్యాప్తంగా 7,500 కిలోమీటర్ల పొడవున ఉన్న సాగర తీరాన్ని ఉపయోగించుకుంటూ, పోర్టుల ఆధారిత అభివృద్ధి కార్యక్రమాల కోసం కేంద్ర సర్కారు సాగర్‌మాల కార్యక్రమాన్ని తలపెట్టింది. అలాగే, 14,500 కిలోమీటర్ల పొడవునా జలమార్గాలను కూడా ఉపయోగించుకోవాలన్నది ఈ కార్యక్రమంలో భాగంగా ఉంది. శుక్రవారం ఢిల్లీలో నేషనల్‌ సాగర్‌మాల అపెక్స్‌ కమిటీ (ఎన్‌సాక్‌) సమావేశం అనంతరం మంత్రి మీడియాకు వివరాలు వెల్లడించారు. సాగర్‌మాల ప్రాజెక్టుల పురోగతిపై చర్చించినట్టు చెప్పారు.  

అమలు దశలో..  
2035 నాటికి రూ.5.5 లక్షల కోట్లతో 802 ప్రాజెక్టులను పూర్తి చేయాలన్న లక్ష్యాన్ని పెట్టుకున్నట్టు మంత్రి సోనోవాల్‌ తెలిపారు. వీటిల్లో రూ.99,281 కోట్లతో 202 ప్రాజెక్టులను ఇప్పటికే పూర్తి చేసినట్టు వెల్లడించారు. మరో 29 ప్రాజెక్టులను (రూ.45,000 కోట్లు) ప్రభుత్వం, ప్రైవేటు భాగస్వామ్యం (పీపీపీ) కింద విజయవంతంగా అమలు చేసినట్టు తెలిపారు. రూ.51,000 కోట్ల విలువ చేసే మరో 32 ప్రాజెక్టులు పీపీపీ అమలు దశలో ఉన్నట్టు పేర్కొన్నారు. రూ.2.12 లక్షల కోట్ల విలువ చేసే 200 ప్రాజెక్టులు నిర్మాణ దశలో ఉన్నాయని, ఇవి రెండేళ్లలో పూర్తవుతాయని తెలిపారు.  

లాజిస్టిక్స్‌ వ్యయాలు తగ్గాలి.. 
ఈ సందర్భంగా కేంద్ర రవాణా మంత్రి నితిన్‌ గడ్కరీ మాట్లాడారు. రవాణా వ్యయాలను తగ్గించాల్సిన అవసరం ఉందన్నారు. చైనాలో లాజిస్టిక్స్‌ వ్యయాలు 8 శాతమే ఉంటే, మన దగ్గర 14–16 శాతం మధ్యలో ఉన్నట్టు చెప్పారు. ఇక్కడా 8 శాతానికి తగ్గిస్తే ఆర్థిక వృద్ధి వేగవంతం అవుతుందని అభిప్రాయపడ్డారు.

చదవండి: జూలై నాటికి డిజిటల్‌ బ్యాంకింగ్‌ యూనిట్లు

మరిన్ని వార్తలు