సెబీ ఆదాయం రూ. 826 కోట్లు

21 Jun, 2022 12:37 IST|Sakshi

2020–21లో 2 శాతం అప్‌ 

న్యూఢిల్లీ: క్యాపిటల్‌ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ 2020–21లో రూ. 826 కోట్ల ఆదాయం సాధించింది. ఇది దాదాపు 2 శాతం అధికంకాగా.. ఇందుకు పెట్టుబడులపై ఆర్జన, ఫీజు ఆదాయం సహకరించాయి. అంతక్రితం ఏడాది అంటే 2019–20లో రూ. 813 కోట్ల ఆదాయం నమోదైంది. తాజా వివరాల ప్రకారం ఫీజు ఆదాయం స్వల్ప వృద్ధితో రూ. 610 కోట్లను తాకగా.. పెట్టుబడులపై ఆర్జన రూ. 170 కోట్ల నుంచి రూ. 182 కోట్లకు బలపడింది. ఇతర ఆదాయం రూ. 18 కోట్ల నుంచి రూ. 21 కోట్లకు పుంజుకుంది.

అయితే 2020–21లో మొత్తం వ్యయాలు సైతం రూ. 588 కోట్ల నుంచి రూ. 667 కోట్లకు పెరిగాయి. సెబీ వార్షిక ఖాతాల ప్రకారం ఎస్టాబ్లిష్‌మెంట్‌ ఖర్చులు రూ. 376 కోట్ల నుంచి రూ. 437 కోట్లకు ఎగశాయి. ఇతర పాలనా వ్యయాలు నామమాత్రంగా తగ్గి రూ. 149 కోట్లకు పరిమితమయ్యాయి. ఇక తరుగుదల, తదితర వ్యయాలు రూ. 64.5 కోట్ల నుంచి రూ. 80.5 కోట్లకు పెరిగాయి. 

చదవండి: జియో-ఫేస్‌బుక్ డీల్‌: రిలయన్స్‌కు ఝలక్‌

మరిన్ని వార్తలు