ఆహార పదార్ధాల్ని ఎక్కువ రోజులు నిల్వ ఉంచే వాక్యూమ్‌ ఫుడ్‌ ప్రిజర్వర్‌

23 Oct, 2022 08:28 IST|Sakshi

ఆహార వృథా ప్రపంచవ్యాప్త సమస్య. ఏటా దాదాపు వందకోట్ల టన్నుల ఆహారం వృథా అవుతున్నట్లు అంతర్జాతీయ సంస్థల అంచనా. ఆహారాన్ని తగిన విధంగా ఎక్కువకాలం నిల్వ చేసుకోగల వసతులు అందుబాటులో లేకపోవడమే ఇందుకు ప్రధాన కారణం. సాధారణంగా వంటిళ్లల్లో ఆహారం వృథా అయ్యే పరిస్థితులను అరికట్టడానికి టర్కీకి చెందిన యువ డిజైనర్‌ గోఖన్‌ సెతింకయా వాక్యూమ్‌ ఫుడ్‌ ప్రిజర్వర్‌కు రూపకల్పన చేశాడు. 

ఇళ్లల్లో వాడుకునే ఆహార పదార్థాలు మరింత ఎక్కువకాలం నిల్వ ఉండేలా ఇది దోహదపడుతుంది. ఆహార పదార్థాలను నిల్వచేసుకునే ప్లాస్టిక్‌ డబ్బాలను మూతలతో సహా ఈ వాక్యూమ్‌ ఫుడ్‌ ప్రిజర్వర్‌లో పెడితే, డబ్బాల్లోని గాలిని తొలగించేసి, మూతలను దృఢంగా బిగించేస్తుంది. అంతేకాదు, దీనిని ఆన్‌ చేయగానే, ఇందులోంచి వెలువడే అల్ట్రావయొలెట్‌ కిరణాలు డబ్బాల్లోని సూక్ష్మజీవులను పూర్తిగా నిర్మూలిస్తాయి. 

అప్పటికే ఉన్న సూక్ష్మజీవులు నశించడంతో పాటు, గాలిని తొలగించడం వల్ల కొత్తగా సూక్ష్మజీవులు చేరే అవకాశం ఉండదు. దానివల్ల డబ్బాల్లోని ఆహార పదార్థాలు దాదాపు రెట్టింపు కాలం పాడైపోకుండా నిల్వ ఉంటాయి. ఇది స్మార్ట్‌ఫోన్‌ యాప్‌కు అనుసంధానమై పనిచేస్తుంది. ఆహారం ఇంకెన్నాళ్లు నిల్వ ఉండేదీ ఎప్పటికప్పుడు సమాచారం అందిస్తుంది. దీని ధర 989 డాలర్లు (రూ. 81,313). 

మరిన్ని వార్తలు