గోల్డ్‌ బాండ్‌! ... అందుబాటులో ఉండేది ఐదు రోజులే?

27 Nov, 2021 13:18 IST|Sakshi

- గ్రాము ధర రూ.4,791  

- నవంబరు 29 నుంచి ప్రారంభం 

ముంబై: సావరిన్‌ గోల్డ్‌ బాండ్‌ స్కీమ్‌ 2021–22 ఎనిమిదవ విడత సబ్‌స్క్రిప్షన్‌ ఈ నెల 29వ తేదీ నుంచి అందుబాటులోకి రానుంది. ఐదు రోజుల పాటు అంటే డిసెంబర్‌ 3వ తేదీ వరకూ ఈ స్కీమ్‌ అందుబాటులో ఉంటుంది. గ్రాము ధర రూ.4,791గా నిర్ణయించినట్లు రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) ఒక ప్రకటనలో పేర్కొంది. అన్‌లైన్‌లో దరఖాస్తు చేసేవారికి రూ.50 రిబేట్, అంటే రూ.4,741కే గ్రాము లభిస్తుంది. ఏడవ విడత స్కీమ్‌ ధర రూ.4,761గా ఉంది.

దేశంలో ఫిజికల్‌గా బంగారానికి డిమాండ్‌ తగ్గించి, ఆ మొత్తాన్ని దేశానికి ఉపయోగపడే పొదుపు మార్గంలోకి మళ్లించడానికి 2015 నవంబర్‌లో కేంద్రం ఈ స్కీమ్‌ను ప్రారంభించిన సంగతి తెలిసిందే. డీమాట్‌ ఎకౌంట్‌ ఉన్నవారు సహా నిర్దిష్ట బ్యాంకులు, పోస్టాఫీసుల్లోనూ బాండ్‌ను కొనుగోలు చేసే వీలుంది. బాండ్‌ మెచ్యూరిటీ కాలవ్యవధి ఎనిమిదేళ్లు. ఐదేళ్ల తర్వాత ఎగ్జిట్‌ అవకాశం కూడా ఉంటుంది. 2 శాతం వార్షిక వడ్డీ  ఈ స్కీమ్‌ ప్రత్యేకత.  

చదవండి: హైదరాబాద్‌లో ముత్తూట్‌ గోల్డ్‌ పాయింట్‌

మరిన్ని వార్తలు