వ్యాల్యూ డిస్కవరీ ఫండ్‌... పెట్టుబడులకు విలువ తెచ్చిపెట్టేది..!

30 Aug, 2021 08:44 IST|Sakshi

ఐసీఐసీఐ ప్రుడెన్షియల్‌ ఫండ్‌ రివ్యూ

మోస్తరు రాబడులు చాలు.. రిస్క్‌ తక్కువగా ఉండాలని కోరుకునే ఇన్వెస్టర్లకు వ్యాల్యూ డిస్కవరీ ఫండ్స్‌ విభాగం చక్కగా నప్పుతుంది. కంపెనీ వ్యాపారం, ఆర్థిక బలాల ఆధారంగా వాస్తవ విలువ షేరులో ప్రతిఫలించని సందర్భాలు కొన్ని వస్తుంటాయి. అటువంటి సందర్భాలను వ్యాల్యూ డిస్కవరీ పథకాలు అనుకూలంగా మలుచుకుని, మంచి కంపెనీలను ఎంపిక చేసుకుని ఇన్వెస్ట్‌ చేస్తుంటాయి. ఈ విభాగంలో 17 ఏళ్ల సుదీర్ఘ చరిత్ర కలిగిన పథకం ఐసీఐసీఐ ప్రుడెన్షియల్‌ వ్యాల్యూ డిస్కవరీ ఫండ్‌. పదేళ్లు, అంతకుమించిన కాలానికి ఈ పథకాన్ని ఇన్వెస్టర్లు ఎంపిక చేసుకోవచ్చు.  
రాబడులు 
ఈ పథకం నిర్వహణలో ఈ ఏడాది జూలై నాటికి రూ.21,195 కోట్ల ఆస్తులున్నాయి. వ్యాల్యూ ఫండ్స్‌ విభాగంలో అతిపెద్ద పథకం ఇది. మొత్తం వ్యాల్యూ ఫండ్స్‌ పరిధిలోని ఇన్వెస్టర్ల పెట్టుబడుల్లో 30 శాతం ఒక్క ఈ పథకంలోనే ఉన్నాయి. గడిచిన ఏడాది కాలంలో ఇన్వెస్టర్లకు 48 శాతం రాబడులను ఇచ్చింది. మూడేళ్ల కాలంలో 13.49 శాతం, ఐదేళ్లలో 12.66 శాతం, ఏడేళ్లలో 12.69 శాతం, పదేళ్లలో 18.16 శాతం చొప్పున వార్షిక రాబడులను అందించింది. 2004 ఆగస్ట్‌లో ఈ పథకం మొదలు కాగా.. నాటి నుంచి చూసుకుంటే వార్షిక రాబడులు 20 శాతంగా ఉన్నాయి. ఇదే కాలంలో నిఫ్టీ50టీఆర్‌ఐ కాంపౌండెడ్‌ వార్షిక రాబడి రేటు 15.91 శాతంగానే ఉంది. ఈ ప్రకారం సూచీల కంటే మెరుగైన పనితీరును చూపించిందని అర్థమవుతోంది. ఈక్విటీ విభాగంలో వీటిని మెరుగైన రాబడులుగా చూడొచ్చు. మూడేళ్ల క్రితం ఈ పథకంలో రూ.లక్ష ఇన్వెస్ట్‌ చేసి ఉంటే రూ.1.46 లక్షలు అయి ఉండేది. ఈ పథకంలో కనీసం రూ.1,000 నుంచి ఇన్వెస్ట్‌ చేసుకోవచ్చు. సిస్టమ్యాటిక్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ప్లాన్‌ (సిప్‌) రూపంలో రూ.100 చొప్పున కూడా పెట్టుబడులకు ఈ పథకం అనుమతిస్తోంది. పెట్టుబడులు పెట్టిన ఏడాదిలోపు వైదొలిగితే 1 శాతం ఎగ్జిట్‌లోడ్‌ను చెల్లించుకోవాల్సి వస్తుంది. ఈ పథకం ఆరంభంలో రూ.లక్షను ఇన్వెస్ట్‌ చేసి (17 ఏళ్ల క్రితం) అలాగే కొనసాగించి ఉంటే నేటికి .22.13లక్షలు అయి ఉండేది.  
పెట్టుబడుల విధానం 
కంపెనీ వాస్తవ విలువతో పోలిస్తే తక్కువలో లభిస్తున్న కంపెనీలను, వివిధ రంగాల వారీగా ఎంపిక చేసుకుంటుంది. ఎప్పటికప్పుడు ఆర్థిక వ్యవస్థలో మార్పులకు అనుగుణంగా అవసరమైతే స్వల్ప మార్పులను కూడా తీసుకుంటుంది. దీర్ఘకాల లక్ష్యాల కోసం ఇన్వెస్ట్‌ చేసుకునేందుకు తగినంత సమయం ఉన్న వారికి వ్యాల్యూ డిస్కవరీ ఫండ్స్‌ అనుకూలంగా ఉంటాయి. పెట్టుబడుల పరంగా ఈ పథకం లార్జ్‌క్యాప్‌ స్టాక్స్‌కు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తుంది. ప్రస్తుతానికి మొత్తం పెట్టుబడుల్లో 92 శాతాన్నే ఈక్విటీలకు కేటాయించింది. డెట్‌లో 2 శాతం పెట్టుబడులు ఉన్నాయి. మిగిలిన మేర నగదు నిల్వలను కలిగి ఉంది. పోర్ట్‌ఫోలియోలో 69 స్టాక్స్‌ ఉన్నాయి. 82 శాతం పెట్టుబడులను లార్జ్‌క్యాప్‌నకే కేటాయించింది. మిడ్‌క్యాప్‌లో 13 శాతం, మిగిలిన మొత్తాన్ని స్మాల్‌క్యాప్‌ స్టాక్స్‌లో ఇన్వెస్ట్‌ చేసి ఉంది. ఇంధనం, ఫైనాన్షియల్, హెల్త్‌కేర్, ఆటోమొబైల్, కమ్యూనికేషన్‌ రంగాలకు ఎక్కువ కేటాయింపులు చేయడాన్ని గమినించొచ్చు. ధర్మేష్‌ కక్కాడ్‌ ఫండ్‌ మేనేజర్‌గా వ్యవహరిస్తున్నారు. 

ఈక్విటీ టాప్‌ హోల్డింగ్స్‌ 

కంపెనీ                     పెట్టుబడుల శాతం
సన్‌ఫార్మా                   10.05 
భారతీ ఎయిర్‌టెల్‌      6.96 
ఎన్‌టీపీసీ                    6.90 
ఎంఅండ్‌ఎం               6.72 
ఐటీసీ                          5.33 
యాక్సిస్‌బ్యాంకు          5.02 
ఓఎన్‌జీసీ                    4.32 
హిందాల్కో                  4.24 
ఇన్ఫోసిస్‌                    4.08 
బీపీసీఎల్‌                   3.61 

చదవండి:  స్టాక్స్‌, మ్యూచువల్‌ ఫండ్స్‌.. పెట్టుబడికి ఏదీ మంచిది ?

మరిన్ని వార్తలు