ఈ అపోహలు వాస్తవమేనా..?

19 Oct, 2020 05:09 IST|Sakshi

ఆర్థిక, జీవన ప్రణాళికల విషయంలో ఎన్నో దురభిప్రాయాలు

కొన్ని కొంత వరకే నిజం.. కొన్ని పూర్తిగా తప్పు

మధ్యతరగతి రిస్క్‌కు దూరంగా ఉండాలన్నది సరికాదు

కొంతయినా రిస్క్‌తోనే అధిక రాబడులు

రిస్క్‌ లేని చోట ఆకర్షణీయ రాబడులు ఉండవు

అది జీవిత లక్ష్యాలపై ప్రభావం చూపుతుంది

ఇన్వెస్టర్లు గతంతో పోలిస్తే నేడు కాస్త అవగాహనతోనే ఉంటున్నారు. విస్తృత మీడియా కవరేజీ, డిజిటల్‌ సాధనాలు, డేటా అందుబాటు, టెక్నాలజీ పట్ల అవగాహన ఇవన్నీ కూడా ఇన్వెస్టర్లలో అవగాహనను పెంచుతున్నాయి. కానీ, అదే సమయంలో ఆర్థిక ప్రణాళిక, పెట్టుబడులకు సంబంధించి కొన్ని తప్పుడు అభిప్రాయాలు, అపనమ్మకాలు చాలా మందిలోనే ఉంటున్నాయి. ఇవి వారి ఆర్థిక ప్రణాళిక, పెట్టుబడులపై ప్రతికూల ప్రభావం చూపించే ప్రమాదం లేకపోలేదు. కనుక ఈ తరహా దురభిప్రాయాలు, నమ్మకాల్లో వాస్తవమెంతన్నది ప్రతి ఒక్కరూ తెలుసుకోవడం ఎంతో అవసరం.  

దీర్ఘకాల రుణాలను ముందుగా తీర్చేయాలి..
దీర్ఘకాల రుణాలను ముందుగా తీర్చివేయడం ద్వారా వడ్డీని ఆదా చేసుకోవాలన్న సలహా సాధారణంగా వినిపిస్తుంటుంది. దీన్ని నమ్మి దీర్ఘకాలంపై తీసుకున్న గృహ రుణాన్ని ముందుగా తీర్చివేసి, స్వల్ప కాలం కోసం తీసుకున్న పర్సనల్‌ లోన్‌ను కొనసాగించడం చేయవచ్చు. కానీ, ఇది ఫండమెంటల్‌గా తప్పిదమే అవుతుంది. ఎందుకంటే పర్సనల్‌ లోన్‌పై వడ్డీ రేటు అధికం. గృహ రుణంపై వడ్డీ రేటు తక్కువ. పైగా దీనిపై ఆదాయపన్ను ప్రయోజనాలు కూడా ఉన్నాయి. ‘‘పన్ను ప్రయోజనాలను పరిగణనలోకి తీసుకుంటే, గృహ రుణం అసలు వ్యయం 30 శాతం పన్ను పరిధిలో ఉన్న వారికి 6 శాతం లోపే ఉంటుంది. దీంతో అధిక ఖర్చుతో కూడిన పర్సనల్‌ లోన్‌ కాకుండా గృహ రుణాన్ని ముందస్తుగా తీర్చివేయడం తప్పిదమే అవుతుంది’’ అని ఫిన్‌కార్ట్‌ సీఈవో తన్వీర్‌ఆలమ్‌ సూచించారు.

ఆర్థిక సలహాదారే చూసుకుంటారు..
ఆర్థిక పరిజ్ఞానం అంతగా లేని వారు, ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల సాయం తీసుకోవడం మంచి నిర్ణయమే. ఒక్కసారి ఇలా ఆర్థిక సలహాదారుని కలిస్తే చాలు తమ పెట్టుబడుల ప్రణాళికలన్నీ వారే చూసుకుంటారని భావించడం పొరపాటే అవుతుంది. ప్రణాళిక అన్నది ఆరంభమే కానీ, అంతం కాదని అర్థం చేసుకోవాలి. అలాగే, అడ్వైజర్లను గుడ్డిగా నమ్మేయడం కూడా అన్ని సంద ర్భాల్లోనూ సరైనది అనిపించుకోదు. ‘‘ఆర్థిక లెక్కలకు సంబంధించి అంశాలను అడ్వైజర్లకు అప్పగించడం మం చిదే. కాకపోతే నిర్ణయం తీసుకునే బాధ్యత ఇన్వెస్టర్లపైనే ఉంచుకోవాలి’’ అని ప్లాన్‌రూపీ ఇన్వెస్ట్‌మెంట్‌ సర్వీసెస్‌ వ్యవస్థాపకుడు అమోల్‌ జోషి  సూచించారు. పెట్టుబడి నిర్ణయాలకు మీరే బాధ్యులు కానీ, ఫైనాన్షియల్‌ అడ్వైజర్లు కాదు.

సిప్‌తో రిస్క్‌ ఉండదు
క్రమానుగత పెట్టుబడుల విధానం (సిప్‌/సిస్టమ్యాటిక్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ప్లాన్‌)లో ఇన్వెస్ట్‌ చేయడం వల్ల ఈక్విటీ కొనుగోలు సగటు ధర తగ్గుతుందని (అధిక ధర, తక్కువ ధరలో కొనుగోలు వల్ల), దాంతో రిస్క్‌ తగ్గుతుందని ఆర్థిక నిపుణులు సాధారణంగా చెబుతుంటారు. కొందరు అయితే రిస్క్‌ను పూర్తిగా దూరం పెట్టేందుకు సిప్‌ చక్కని సాధనంగా పేర్కొంటారు. ‘‘సిప్‌ అన్నది రిస్క్‌ను తీసివేయలేదు. ఇదొక పరికరం మాత్రమే, సాధనం కాదు’’ అని ప్లాన్‌రూపీ ఇన్వెస్ట్‌మెంట్‌ సర్వీసెస్‌ వ్యవస్థాపకుడు అమోల్‌ జోషి సూచించారు. సిప్‌ కారణంగా కొన్ని సంవత్సరాల్లో రాబడులు పేలవంగా ఉన్నప్పటికీ, కొన్ని సంవత్సరాల్లో మంచి పనితీరు కారణంగా మొత్తం మీద మంచి రాబడులకు అవకాశం ఉంటుందని అర్థం చేసుకోవాలి. మరో ముఖ్య విషయం.. సిప్‌ మార్గంలో ఇన్వెస్ట్‌ చేస్తున్నప్పటికీ.. స్టాక్‌ మార్కెట్లు ఏళ్ల తరబడి బేర్స్‌ గుప్పిట్లో ఉండిపోతే అప్పుడు నష్టాలు చవిచూడాల్సి ఉంటుందని తెలుసుకోవాలి.  

బడ్జెట్‌ సవివరంగా ఉండాలి..
ప్రతీ కుటుంబానికి సవివరమైన ఆర్థిక ప్రణాళిక ఉండాలన్న దురభిప్రాయం కూడా ఒకటి ఉంది. ‘‘బడ్జెట్‌ అంటే ప్రతీ ఒక్కటి రాయాలని ఏమీ లేదు. ఖర్చులను మూడు రకాల బకెట్లుగా వర్గీకరించాలి. ఖర్చులు, చెల్లింపులు, పొదుపు’’ అని అమోల్‌ జోషి సూచించారు. వ్యక్తుల ఆదాయ స్థాయిలు, జీవితంలో వారు ఏ దశలో ఉన్నారన్నదాని ఆధారంగా ప్రతీ బకెట్‌లో ఏవి ఉండాలన్నది ఆధారపడి ఉంటుంది. ఉదాహరణకు అధిక ఆదాయం ఉన్న వారికి ఖర్చులు మూడింట ఒక వంతు మించకూడదు. అలాగే, ఎటువంటి రుణాలు లేని వారికి చెల్లింపుల విభాగం అవసరం లేదు. ప్రతీ విభాగంలో ఎంత, ఏవి ఉండాలన్నది వారి అవసరాలు, ఖర్చులను బట్టే ఉంటుంది. ‘‘భార్యా భర్తలు కూర్చుని చర్చించుకుంటే తమ ఖర్చులపై 15–20 నిమిషాల్లోపే స్పష్టతకు రావచ్చు.

విచక్షణారహిత ఖర్చులైన రెస్టారెంట్లో విందు, సినిమాలు.. అలాగే, ప్రయాణ ఖర్చులపై స్పష్టతకు రావాలి’’ అని పేర్కొన్నారు సెడగోపన్‌. ఇక రూపొందించుకున్న బడ్జెట్‌ను దాటిపోతున్నారేమో కూడా చూసుకోవాలి. అలా జరిగితే దీర్ఘకాల లక్ష్యాలు ప్రభావితం అవుతాయి. ఏ విభాగంలో అధికంగా ఖర్చులు వస్తున్నదీ పరిశీలించాలి. ఉదాహరణకు స్మార్ట్‌ఫోన్‌ దెబ్బతినడం వల్ల వెంటనే ఫోన్‌ కొనుగోలు చేయాల్సి వచ్చిందనుకుంటే.. అప్పుడు వార్షిక పర్యటన కోసం పక్కన పెట్టిన పొదుపును వినియోగించుకుంటే నష్టం లేదు. దీనికి బదులు ముఖ్యమైన మీ పిల్లల ఫీజులు లేదా రిటైర్మెంట్‌ జీవితం కోసం చేస్తున్న పొదుపులను త్యాగం చేస్తే ప్రతికూల ఫలితాలు ఎదురవుతాయి..  

మధ్యతరగతికి రిస్క్‌ సరికాదు..
మధ్యాదాయ వర్గాల వారు రిస్క్‌ తీసుకోకూడదన్నది మరొక తప్పుడు నిర్వచనం. అన్ని విషయాల్లోనూ కాకుండా కేవలం కొన్నింటికే ఇది వర్తిస్తుందని చెప్పుకోవాల్సి ఉంటుంది. అవగాహనలేమితో రిస్క్‌కు పూర్తి దూరంగా ఉండిపోవడం వల్ల కావాల్సిన ఫలాలను అందుకోలేకపోవచ్చు. ఈ వర్గం వారికి ఆదాయం మధ్యస్థంగా ఉంటుంది. రిస్క్‌కు వెరసి తమ జీవిత లక్ష్యాల కోసం తక్కువ రిస్క్‌ ఉండే సాధనాల్లో ఇన్వెస్ట్‌ చేస్తే... తక్కువ రిస్క్‌ ఉండే సాధనాల్లో పెట్టుబడులు ఏ మాత్రం ఆశాజనకంగా ఉండవు. చాలా తక్కువ రాబడి వల్ల తమ లక్ష్యాలను చేరుకునే స్థాయిలో నిధిని సమకూర్చుకోలేకుండా ఉండిపోవాల్సి వస్తుంది. నిజానికి ఈ తరహా వర్గీయులు తప్పకుండా కొంత మొత్తాన్ని ఈక్విటీల్లో ఇన్వెస్ట్‌ చేసుకోవాలి. తద్వారా దీర్ఘకాలంలో అధిక రాబడులను సమకూర్చుకోవచ్చు. ‘‘పరిమిత ఆదాయ వనరులు ఉన్న వారు ఈక్విటీలను విస్మరించకూడదు. అదే జరిగితే వారి పెట్టుబడిని ద్రవ్యోల్బణం మింగేస్తుంది. అయితే, ఈక్విటీలకు ఎంత కేటాయించుకోవాలన్నది ప్రశ్నించుకోవాలి’’ అని లాడర్‌7 ఫైనాన్షియల్‌ అడ్వైజరీస్‌ వ్యవస్థాపకుడు సురేష్‌ సెడగోపన్‌ సూచించారు.

రిటైర్మెంట్‌ ప్రణాళిక అంటే డబ్బు గురించే..
పదవీ విరమణ తర్వాతి జీవితానికి ప్రణాళిక వేసుకోవడం అంటే పొదుపు చేయడం ఒక్కటేనన్న దురభిప్రాయంతో కొందరు ఉంటుంటారు. విశ్రాంత జీవన ప్రణాళికలో నిధితో పాటు ఇతర అంశాలకు కూడా చోటు ఉండాలి. ‘‘రిటైర్మెంట్‌ జీవితం అన్నది 30–40 సంవత్సరాల వరకు ఉంటుంది. డబ్బు, ఇతర కార్యకలాపాల మధ్య సమన్వయం అవసరం. ఖాళీ సమయాన్ని తమ హాబీల కోసం, స్నేహితులతో సంబంధాల పునరుద్ధరణకు వెచ్చించాలి. సామాజిక బాధ్యతపై కొంత సమయం వెచ్చించడం కూడా ఆనందాన్నిస్తుంది’’ అని అమోల్‌ జోషి సూచించారు. రిటైర్మెంట్‌ ప్రణాళికను రెండు విభాగాలుగా రూపొందించుకోవాలి. మొదటిది మీరు ఆరోగ్యంగా ఉండే కాలానికి సంబంధించినది. రెండోది ఆ తర్వాత కాలానికి ఉద్దేశించినది. రెండో విభాగంలో మరొకరి సాయం మీకు అవసరపడొచ్చు. పిల్లల సహకారం ఉంటుందన్న భరోసా లేని వారు ఆ సమయంలో ఎలా వ్యవహరించాలో ముందుగానే ప్లాన్‌ చేసుకోవడం మంచిదని నిపుణుల సూచన. 

మరిన్ని వార్తలు