టికెట్‌ డౌన్‌గ్రేడ్‌ చేస్తే పరిహారం చెల్లించాలి

24 Dec, 2022 06:07 IST|Sakshi

పూర్తి రీఫండ్, ఉచిత ప్రయాణం కల్పించాలి

త్వరలో ఎయిర్‌లైన్స్‌కు కొత్త నిబంధనలు

న్యూఢిల్లీ: విమానయాన సంస్థలు ఇకపై ప్రయాణికుల టికెట్లను ఇష్టానుసారంగా డౌన్‌గ్రేడ్‌ చేస్తే పరిహారం చెల్లించుకోవాల్సి రానుంది. పన్నులు సహా టికెట్‌ పూర్తి విలువను ప్యాసింజర్‌కి తిరిగి ఇవ్వడంతో పాటు సదరు ప్రయాణికులను తదుపరి అందుబాటులో ఉన్న తరగతిలో ఉచితంగా తీసుకెళ్లాల్సి రానుంది. ఇందుకు సంబంధించి ప్రయాణికుల ఫిర్యాదులను పరిష్కరించేందుకు డైరెక్టరేట్‌ జనరల్‌ ఆఫ్‌ సివిల్‌ ఏవియేషన్‌ (డీజీసీఏ) ప్రస్తుత నిబంధనలను సవరించే పనిలో ఉంది. సంబంధిత వర్గాలతో సంప్రదింపులు ముగిశాక తుది నిబంధనలను జారీ చేయనుంది.

వచ్చే ఏడాది ఫిబ్రవరి నుంచి ఇవి అమల్లోకి వచ్చే అవకాశం ఉందని డీజీసీఏ సీనియర్‌ అధికారి ఒకరు తెలిపారు. ఒక తరగతిలో బుక్‌ చేసుకున్న టికెట్లను విమానయాన సంస్థలు ఇష్టారీతిగా కింది తరగతికి డౌన్‌గ్రేడ్‌ చేస్తున్నాయంటూ తరచుగా ప్రయాణికుల నుంచి ఫిర్యాదులు వస్తున్న నేపథ్యంలో డీజీసీఏ ఈ మేరకు చర్యలు చేపట్టింది. విమాన సేవలను వేగవంతంగా విస్తరించాల్సి వస్తుండటం, ప్యాసింజర్‌ ట్రాఫిక్‌ భారీగా పెరిగిపోవడం వంటి అంశాల వల్ల కొన్ని సందర్భాల్లో ఎయిర్‌లైన్స్‌ ఇలా చేయాల్సి వస్తోంది.

‘ఉదాహరణకు ప్రయాణికులు .. ఫస్ట్‌ క్లాస్, బిజినెస్‌ క్లాస్‌ లేదా ప్రీమియం ఎకానమీలో టికెట్‌ బుక్‌ చేసుకుని ఉండవచ్చు. అయితే, సీట్లు అందుబాటులో లేకపోవడం లేదా విమానాన్ని మార్చాల్సి రావడం వంటి కారణాల వల్ల చెకిన్‌ సమయంలో వారి టికెట్లను దిగువ తరగతికి డౌన్‌గ్రేడ్‌ చేసే పరిస్థితి ఉంటోంది. అయితే, ఇలా డౌన్‌గ్రేడ్‌ చేస్తే ప్రయాణికులకు ఎయిర్‌లైన్‌ టికెట్‌ పూర్తి విలువ రీఫండ్‌ చేయడంతో పాటు తదుపరి అందుబాటులో ఉన్న తరగతిలో ఉచితంగా తీసుకెళ్లేలా ప్రతిపాదిత సవరణ ఉపయోగపడుతుంది‘ అని డీజీసీఏ ఒక ప్రకటనలో తెలిపింది.  

ప్రస్తుత నిబంధనలు ఇలా..
బోర్డింగ్‌ను నిరాకరించినా, ఫ్లయిట్‌ రద్దయినా విమాన ప్రయాణికులకు పరిహారం లభించేలా ప్రస్తుతం నిబంధనలు ఉన్నాయి. బుకింగ్‌ కన్ఫర్మ్‌ అయినా బోర్డింగ్‌ను నిరాకరిస్తే, ప్రత్యామ్నాయంగా సదరు విమానం బైల్దేరే షెడ్యూల్‌ తర్వాత గంట వ్యవధిలోగా మరో ఫ్లయిట్‌లో సీటు కల్పించగలిగితే ఎలాంటి పరిహారం చెల్లించనక్కర్లేదు. అదే 24 గంటల వరకూ పడితే వన్‌ వే ఛార్జీ, ఇంధన చార్జీలకు 200 శాతం అధికంగా పరిహారం చెల్లించాలి. గరిష్టంగా రూ. 10,000 పరిమితి ఉంటుంది. ఒకవేళ 24 గంటలు దాటేశాక సీటు కల్పిస్తే రూ. 20,000 గరిష్ట పరిమితికి లోబడి 400 శాతం వరకూ పరిహారం చెల్లించాలి. వీటితో పాటు ఫ్లయిట్‌ రద్దవడం తదితర అంశాలకు సంబంధించి వివిధ మార్గదర్శకాలు ఉన్నాయి.

మరిన్ని వార్తలు