ఆకాశవీధిలో.. వేసవిలో పెరగనున్న విమానాలు

12 Mar, 2022 08:38 IST|Sakshi

వేసవిలో ఫ్లయిట్స్‌ సంఖ్య 10 శాతం పెంపు 

వెల్లడించిన డీజీసీఏ

న్యూఢిల్లీ: రాబోయే వేసవి షెడ్యూల్‌కు సంబంధించి దేశీ విమానయాన సంస్థలు .. వారంవారీగా ఫ్లయిట్‌ సర్వీసులను 10.1 శాతం మేర పెంచనున్నట్లు డైరెక్టరేట్‌ జనరల్‌ ఆఫ్‌ సివిల్‌ ఏవియేషన్‌ (డీజీసీఏ) తెలిపింది. గత సీజన్‌లో ఈ సంఖ్య 22,980గా ఉండగా ఈ సీజన్‌లో 25,309గా ఉంటుందని పేర్కొంది. ఇండిగో అత్యధికంగా దేశీ రూట్లలో తన ఫ్లయిట్స్‌ సంఖ్యను 10.4 శాతం పెంచి 11,130 వీక్లీ సర్వీసులను నడపనున్నట్లు  వివరించింది. 

ఎయిర్‌పోర్ట్‌ స్లాట్లపై గత నెల జరిగిన వర్చువల్‌ సమావేశం అనంతరం దేశీ విమానయాన సంస్థల వేసవి షెడ్యూల్‌ను ఖరారు చేసినట్లు డీజీసీఏ తెలిపింది. కోవిడ్‌–19 కట్టడిపరమైన ఆంక్షల కారణంగా గత 24 నెలలుగా దేశీ ఏవియేషన్‌ పరిశ్రమపై తీవ్ర ప్రతికూల ప్రభావం పడిన సంగతి తెలిసిందే. అయితే, కేసుల సంఖ్య తగ్గే కొద్దీ.. గత కొద్ది వారాలుగా విమాన ప్రయాణాలు పెరుగుతున్నాయి. వేసవి షెడ్యూల్‌ ప్రకారం వారంవారీగా ఎయిర్‌ఏషియా 1,601 (16 శాతం అధికం), ఎయిరిండియా 2,456  (10 శాతం అధికం) ఫ్లయిట్‌ సర్వీసులు నడపనున్నాయి.  
 

మరిన్ని వార్తలు