ధన్‌తేరాస్‌కు ‘డబుల్‌’ ధమాకా

13 Nov, 2020 05:06 IST|Sakshi

పుంజుకుంటున్న విక్రయాలు

న్యూఢిల్లీ/ముంబై: ఈసారి ధన్‌తేరాస్‌ రెండు రోజులు రావడం పసిడి అమ్మకాలకు కలిసి రానుంది. ప్రస్తుతం బంగారం ధర కాస్త తగ్గడం కూడా ఇందుకు తోడ్పడనుందని, దీనితో ధన్‌తేరాస్‌ సందర్భంగా కొనుగోళ్లు మెరుగ్గానే ఉండగలవని పరిశ్రమవర్గాలు భావిస్తున్నాయి. క్రమంగా అమ్మకాలు పుంజుకుంటున్నాయని వెల్లడించాయి. పసిడి, వెండి మొదలైన వాటి కొనుగోలుకు శుభకరమైన రోజుగా దీపావళికి ముందు వచ్చే ధన్‌తేరాస్‌ (ధన త్రయోదశి)ని పరిగణిస్తారు. ఈసారి ధన్‌తేరాస్‌ రెండు రోజులు (గురు, శుక్రవారం) వచ్చింది. ఇప్పటిదాకా పేరుకుపోయిన డిమాండ్‌ అంతా అమ్మకాల రూపం దాల్చగలదని, శుక్రవారం విక్రయాలు మరింత పుంజుకోగలవని ఆలిండియా జెమ్‌ అండ్‌ జ్యుయలరీ డొమెస్టిక్‌ కౌన్సిల్‌ చైర్మన్‌ అనంత పద్మనాభన్‌ తెలిపారు.

‘కొనుగోలుదారులు నెమ్మదిగా ముందుకొస్తున్నారు. అమ్మకాలు మెరుగుపడుతున్నాయి. అయినప్పటికీ గతేడాది స్థాయిలో మాత్రం ఈసారి ధన్‌తేరాస్‌ అమ్మకాలు ఉండకపోవచ్చు’ అని వరల్డ్‌ గోల్డ్‌ కౌన్సిల్‌ ఎండీ (ఇండియా) సోమసుందరం పీఆర్‌ అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం పసిడి ధర తగ్గటమనేది డిమాండ్‌కు కొంత ఊతమివ్వగలదని పేర్కొన్నారు. అయితే పరిమాణంపరంగా అమ్మకాలు 15–20 శాతం తగ్గినా.. విలువపరంగా చూస్తే గతేడాది స్థాయిని అందుకునే అవకాశం ఉందని సెన్‌కో గోల్డ్‌ అండ్‌ డైమండ్స్‌ సీఈవో సువంకర్‌ సేన్‌ చెప్పారు. కరోనా కేసుల కారణంగా చాలా మంది ఆన్‌లైన్‌ జ్యుయలరీ సంస్థల నుంచి కూడా కొనుగోళ్లు జరుపుతున్నారని పరిశ్రమ వర్గాలు తెలిపాయి. 

మరిన్ని వార్తలు