1992 Indian Stock Market Scam: హర్షద్‌ మెహతా స్కామ్‌లో రాకేష్‌ ఝున్‌ఝున్‌వాలా పాత్ర!

15 Aug, 2022 07:49 IST|Sakshi

రాజస్తానీ మార్వాడీల కుటుంబానికి చెందిన రాకేశ్‌ ఝున్‌ఝున్‌వాలా.. ముంబైలో పుట్టి పెరిగారు. ఆయన తండ్రి ముంబైలో ఆదాయపు పన్ను శాఖ కమిషనర్‌గా పనిచేసేవారు. స్టాక్‌మార్కెట్లలో తండ్రి ఇన్వెస్ట్‌ చేస్తుండటం,  వాటి గురించి స్నేహితులతో చర్చిస్తుండటం వంటి వాతావరణంలో పెరగడంతో తనకు చిన్నతనం నుంచే పెట్టుబడులపై ఆసక్తి ఏర్పడినట్లు రాకేశ్‌ ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. వార్తల్లో ఉన్న తీరును బట్టి కంపెనీలు పెరుగుతూ, తగ్గుతూ ఉంటాయని తండ్రి వివరించడంతో 15 ఏళ్ల ప్రాయం నుంచే మార్కెట్‌ వార్తల్ని, షేర్లను పరిశీలించడం ప్రారంభించారు. డిగ్రీ తర్వాత స్టాక్‌ మార్కెట్ల వైపు వెళ్తానంటూ తండ్రికి చెప్పారు. కానీ సీఏ చేసి ఆర్థికంగా కాస్త నిలదొక్కుకున్న తర్వాతే ఆ విషయాన్ని ఆలోచించాలని తండ్రి సూచించారు. ఆయన మాట ప్రకారమే సీఏ చదివిన తర్వాత మార్కెట్లోకి అడుగుపెట్టారు. 

తొలి పెట్టుబడి బంపర్‌ హిట్‌..! 
1985లో సోదరుడు రాజేశ్‌ దగ్గర రూ. 5,000 తీసుకుని రాకేశ్‌ మార్కెట్లో ట్రేడింగ్‌ మొదలుపెట్టారు. అప్పట్లో రూ. 5,000తో కొన్న టాటా టీ షేర్లు భారీ లాభాలు తెచ్చి పెట్టాయి. రూ. 43కి కొన్న షేరు మూడు నెలల్లోనే రూ. 143కి ఎగిశాయి. మూడు రెట్లు లాభాలు తెచ్చిపెట్టింది. ఇక ఆ తర్వాత నుంచి సెసా గోవా, టైటాన్‌ వంటి కంపెనీల్లో ఇన్వెస్ట్‌ చేస్తూ ముందుకెళ్లారు. మార్కెట్లోకి రాకేశ్‌ అడుగుపెట్టినప్పుడు సెన్సెక్స్‌ 150 పాయింట్లుగా ఉండేది. ప్రస్తుతం అది 60,000 పాయింట్ల వద్ద ఉంది. ఈ మూడున్నర దశాబ్దాల కాలంలో రాకేశ్‌ సంపద కూడా రాకెట్లా దూసుకెళ్లి సుమారు రూ. 46,000 కోట్ల స్థాయికి చేరింది.  2017లో టైటాన్‌ షేరు జోరు మీద ఉన్నప్పుడు 1 రోజులోనే ఏకంగా రూ. 900 కోట్లు ఆర్జించారు. రాకేశ్‌ కొన్న కంపెనీ షేరు పెరుగుతుంది.. అమ్మితే పడిపోతుంది అనే సెంటిమెంటుతో అసంఖ్యాకంగా ఇన్వెస్టర్లు ఆయన్ను ఫాలో అవుతున్నారు.  

వైఫల్యాలూ ఉన్నాయి.. 
రాకేశ్‌కు నష్టాలు తెచ్చిపెట్టిన సందర్భాలూ ఉన్నాయి. ప్రధానంగా ఇన్‌ఫ్రా విభాగంలో పెట్టుబడులు ఆయనకు కలిసిరాలేదు. రియల్టీ భవిష్యత్‌ బాగుంటుందనే అంచనాలతో 2013లో దివాన్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌లో రూ. 34 కోట్లు పెట్టి 25 లక్షల షేర్లు కొన్నారు. 2018లో కంపెనీ దెబ్బతిన్నప్పటికీ మరికాస్త కొన్నారు. కానీ చివరికి ఆ కంపెనీ దివాలా తీసింది. మంధన రిటైల్‌లోనూ అలాంటి పరిస్థితే ఎదురైంది. 2016లో సంస్థ షేరు రూ. 247గా ఉన్నప్పుడు 12.7% వాటా కొన్నారు. 2021లో రూ. 16కి అమ్మేశారు. అలాగే డీబీ రియల్టీలోనూ, ప్రైవేట్‌ ఈక్విటీ కింద చేసిన పెట్టుబడుల్లో కొన్ని ఇన్వెస్ట్‌మెంట్లూ నష్టాలు తెచ్చిపెట్టాయి.  

వివాదాలూ ఉన్నాయి.. 
బిగ్‌ బుల్‌గా పేరొందినప్పటికీ ఆయన బేర్‌ పాత్ర పోషించిన సందర్భాలు కూడా ఉన్నాయి. 1992 హర్షద్‌ మెహతా స్కామ్‌ సందర్భంలో షార్ట్‌ సెల్లింగ్‌ ద్వారా భారీగా లాభాలు గడించారు. సాధారణంగా షేర్లంటేనే స్కాములనే దురభిప్రాయం కొంత ఉండే మార్కెట్లో హర్షద్‌ మెహతా, కేతన్‌ పరేఖ్‌ లాంటి వారికి భిన్నంగా రాకేశ్‌కి కాస్త క్లీన్‌ ఇమేజే ఉంది. అయినప్పటికీ ఆయనపైనా ఆరోపణలు ఉన్నాయి. ఆప్‌టెక్‌లో ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ కేసును 2021లో ఆయనతో పాటు మరికొందరు రూ. 37 కోట్లతో సెటిల్‌ చేసుకున్నారు. అలాగే సోనీ పిక్చర్స్‌లో విలీనం కావాలని జీ ఎంటర్‌ప్రైజెస్‌ నిర్ణయం తీసుకోవడానికి కొద్ది రోజుల ముందే.. జీ ఎంటర్‌ప్రైజెస్‌లో రాకేశ్‌ ఇన్వెస్ట్‌ చేయడం, స్వల్ప వ్యవధిలోనే రూ. 70 కోట్లు లాభాలు పొందడం, ఆయన వ్యవహారాలపై సందేహాలు రేకెత్తించాయి.

కంపెనీల పోర్ట్‌ఫోలియో.. 
రాకేశ్‌కు 40 పైచిలుకు కంపెనీల్లో పెట్టుబడులు ఉన్నాయి. టాటా గ్రూప్‌లో భాగమైన టైటాన్‌ వీటన్నింటిలోకెల్లా ప్రత్యేకమైనది. వేల కోట్ల లాభాలు తెచ్చిపెట్టింది. టైటాన్‌లో ఆయనకున్న 5.05% వాటాల విలువే రూ. 11,000 కోట్ల మేర ఉంటుంది. స్టార్‌ హెల్త్, ర్యాలీస్, ఎస్కార్ట్స్, కెనరా బ్యాంక్, ఇండియన్‌ హోటల్స్‌ కంపెనీ, టాటా మోటర్స్‌ మొదలైన సంస్థలలోనూ ఆయన ఇన్వెస్ట్‌ చేశారు. హంగామా మీడియా, ఆప్‌టెక్‌ సంస్థలకు చైర్మన్‌గా వ్యవహరించారు. వైస్‌రాయ్‌ హోటల్స్, నాగార్జున కన్‌స్ట్రక్షన్‌ కంపెనీ, కాంకర్డ్‌ బయోటెక్, ప్రొవోగ్‌ ఇండియా, జియోజిత్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ మొదలైన వాటిల్లో డైరెక్టరుగా ఉన్నారు. భార్య రేఖ, తన పేరు కలిసి వచ్చేలా రేర్‌ (RARE) ఎంటర్‌ప్రైజెస్‌  ఏర్పాటు చేసి, కార్యకలాపాలు సాగించేవారు. ఇటీవలే ప్రారంభమైన ఆకాశ ఎయిర్‌లైన్స్‌లో రాకేశ్, ఆయన భార్య రేఖకు 40% వాటాలు ఉన్నాయి. 

మరిన్ని వార్తలు