Types Of Electric Vehicles : ఎలక్ట్రిక్‌ వెహికల్స్‌లో ఎన్నిరకాలున్నాయో మీకు తెలుసా?

7 Nov, 2021 16:43 IST|Sakshi

ప్రపంచ దేశాల్లో ఎలక్ట్రిక్‌ వెహికల్స్‌ హవా కొనసాగుతుంది. అయితే వాటిలో పలు రకాలైన ఈ ఎలక్ట్రిక్‌ వెహికల్స్‌ ఉన్నాయి. వాటి టెక్నాలజీ సంగతేంటో తెలుసుకుందాం. 

పూర్తి ఎలక్ట్రిక్‌ వాహనం...
బ్యాటరీ ఎలక్ట్రిక్‌ వాహనం (బీఈవీ)గా దీన్ని పిలుస్తారు. లిథియం అయాన్‌ బ్యాటరీ నుంచి వచ్చే విద్యుత్‌... మోటార్‌ను (ఇంజిన్‌) రన్‌ చేయడం ద్వారా ఇవి నడుస్తాయి. ప్రస్తుతం అనేక ఈవీల రేంజ్‌ (ఒకసారి పూర్తిగా చార్జ్‌ చేస్తే ఎంత దూరం ప్రయాణిస్తుంది అనేది) 150–480 కిలోమీటర్ల వరకు ఉంది. బీఈవీలకు ప్రభుత్వ రాయితీలన్నీ లభిస్తాయి. ఇంట్లో లేదా పబ్లిక్‌ చార్జింగ్‌ స్టేషన్లలో వీటిని చార్జింగ్‌ చేసుకోవచ్చు.

ప్లగ్‌–ఇన్‌ హైబ్రిడ్‌ వాహనం...
ప్లగ్‌–ఇన్‌ హైబ్రిడ్‌ ఎలక్ట్రిక్‌ వాహనం (పీహెచ్‌ఈవీ) లో పెట్రోలు/డీజిల్‌ ఇంకా ఎలక్ట్రిక్‌ ఇంజిన్‌ రెండూ ఉంటాయి. దీనిలోని లిథియం అయాన్‌ బ్యాటరీని రీచార్జ్‌ చేసుకోవచ్చు. చార్జింగ్‌ అయిపోతే, పెట్రోలు/డీజిల్‌ ఇంజిన్‌కు మారిపోవచ్చు. బ్రేకులు వేసేటప్పుడు విడుదలయ్యే శక్తితో కూడా బ్యాటరీ రీచార్జ్‌ అవుతుంది. అయితే, దీని బ్యాటరీ రేంజ్‌ తక్కువగా ఉంటుంది. ఈవీలకు వర్తించే రాయితీలు అనేక దేశాల్లో పీహెచ్‌ఈవీలకు కూడా లభిస్తున్నాయి.

ఫ్యూయల్‌ సెల్‌ ఎలక్ట్రిక్‌ వాహనం...
హైడ్రోజన్‌తో నడిచే వాటిని ఫ్యూయల్‌ సెల్‌ ఎలక్ట్రిక్‌ వాహనాలు (ఎఫ్‌సీఈవీ)గా పేర్కొంటారు. దీనిలో హైడ్రోజన్‌ ట్యాంక్, ఫ్యూయల్‌ సెల్, బ్యాటరీ, ఎలక్ట్రిక్‌ మోటార్‌ ఉంటాయి. గాలిలోని ఆక్సిజన్‌తో హైడ్రోజన్‌ రియాక్షన్‌ వల్ల ఉత్పత్తి అయ్యే విద్యుత్, ఎలక్ట్రిక్‌ మోటారుకు శక్తిని అందించి వాహనం నడిచేందుకు తోడ్పడుతుంది. పర్యావరణానికి హాని చేయని నీటి ఆవిరి, వేడి గాలి మాత్రమే వాతావరణంలోకి విడుదల చేస్తుంది. అయితే, హైడ్రోజన్‌ ఉత్పత్తికి పెద్దమొత్తంలో విద్యుత్, లేదా శిలాజ ఇంధనాలను ఉపయోగించాల్సి రావడం, ద్రవ హైడ్రోజన్‌ను తరలించడం, ప్రత్యేక బంకుల ఏర్పాటు, అధిక హైడ్రోజన్‌ రేటు వంటివి ప్రతికూలాంశాలు.

కిలోమీటరుకు ఎంత ఖర్చవుతుంది...
ఈవీలో ఉపయోగించే బ్యాటరీ సామర్థ్యాన్ని బట్టి చార్జింగ్‌ ఖర్చు అనేది ఆధారపడి ఉంటుంది. సాధారణంగా ఈ టూవీలర్ల సగటు సామర్థ్యం 3 కిలోవాట్‌ అవర్స్‌ (కేడబ్ల్యూహెచ్‌) అదే కార్లలో 60 కేడబ్ల్యూహెచ్‌ వరకు, బస్సులు, ట్రక్కుల్లో 200–300 కేడబ్ల్యూహెచ్‌ వరకు ఉంది.

ఉదాహరణకు ఒక ఫుల్‌ ఈవీ స్కూటర్‌ బ్యాటరీ సామర్థ్యం 5 కేడబ్ల్యూహెచ్‌ అనుకుందాం. మన దేశంలో ఒక యూనిట్‌ విద్యుత్‌ అంటే 1 కేడబ్ల్యూహెచ్‌గా పరిగణిస్తారు. దీన్నిబట్టి 5 కేడబ్ల్యూహెచ్‌ ఈ–స్కూటర్‌ బ్యాటరీ ఫుల్‌చార్జ్‌ అయ్యేందుకు 5 యూనిట్ల విద్యుత్‌ ఖర్చవుతుంది.

యూనిట్‌ విద్యుత్‌ వ్యయం రాష్ట్రాన్ని బట్టి మారుతుంది. సగటున రూ.8 చొప్పున యూనిట్‌ ధర అయితే, ఫుల్‌ చార్జింగ్‌కు రూ.40 వ్యయం అవుతుంది. ఫుల్‌ చార్జింగ్‌తో సగటున 100 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తుందని భావిస్తే ఖర్చు కిలోమీటరుకు 40 పైసలు మాత్రమే. అదే పెట్రోలు స్కూటర్‌ అయితే సగటున 40 కిలోమీటర్ల మైలేజీని లెక్కిస్తే కిలోమీటరుకు రూ.2.6 ఖర్చవుతుంది. ఫాస్ట్‌ చార్జింగ్‌ కోసం పబ్లిక్‌ చార్జర్లను ఉపయోగిస్తే, యూనిట్‌ ధర కాస్త (సర్వీసు చార్జీలన్నీ కలిపి) పెరిగే అవకాశం ఉంటుంది.

నార్వే.. టాప్‌గేర్‌
పర్యావరణం పట్ల అత్యంత శ్రద్ధ వహిస్తున్న దేశాల్లో నార్వేదే అగ్ర స్థానం. ఇప్పటికే తమ దేశ విద్యుత్‌ అవసరాల్లో దాదాపు 100 శాతం పునరుత్పాదక ఇంధన వనరుల (సౌర, జల, పవన) ద్వారా పొందుతున్న నార్వే.. వాహన కాలుష్యాన్ని తగ్గించే విషయంలోనూ వడివడిగా అడుగులేస్తోంది. 2020లో మొత్తం ఎలక్ట్రిక్‌ కార్ల విక్రయాల్లో 75 శాతం ఈవీలే. అంతేకాదు నార్వే రోడ్లపై పెట్రోలు/డీజిల్‌ కార్ల కంటే ఎలక్ట్రిక్‌ కార్లే అధికంగా ఉండటం విశేషం.

చదవండి: మొండి ఘటం.. టెస్లాకి ఆ పేరు ఎలా వచ్చిందో తెలుసా?

మరిన్ని వార్తలు