వ్యక్తిగతమా.. గ్రూప్‌ పాలసీనా...

7 Mar, 2022 06:22 IST|Sakshi

ఆరోగ్య బీమా పాలసీల్లో వివిధ రకాలు

కోవిడ్‌–19 రాకతో ఆరోగ్య సంరక్షణ ప్రాధాన్యత గురించి అవగాహన పెరిగింది. హెల్త్‌ ఇన్సూరెన్స్‌ పాలసీల అవసరాన్ని గుర్తించి, కొనుగోలు చేసే వారి సంఖ్య కూడా పెరుగుతోంది. ప్రస్తుతం రకరకాల హెల్త్‌ పాలసీలు ఉన్నాయి. వీటిలో వ్యక్తిగత ఆరోగ్య బీమా పాలసీ, గ్రూప్‌ హెల్త్‌ ఇన్సూరెన్స్‌ పాలసీ అనేవి ఎక్కువగా ప్రాచుర్యంలో కనిపిస్తుంటాయి. వీటి గురించి వివరించేదే ఈ కథనం.

గ్రూప్‌ హెల్త్‌ ఇన్సూరెన్స్‌..
సాధారణంగా ఒక గ్రూప్‌గా ఉండే వ్యక్తుల కోసం ఈ తరహా పాలసీలను కంపెనీలు రూపొందిస్తుంటాయి. ఉదాహరణకు ఒకే కంపెనీలో పనిచేసే వ్యక్తుల కోసం ఇలాంటి పాలసీలు ఉంటాయి. పాలసీదారు కుటుంబ సభ్యులకు కూడా చాలా సందర్భాల్లో పాలసీ ప్రయోజనాలను వర్తింపచేసినా .. ఒక్కో సభ్యుడికి ఒక్కో రకమైన కవరేజ్‌ అంటూ ఉండదు. ప్రాథమికంగా గ్రూప్‌ హెల్త్‌ ఇన్సూరెన్స్‌ అనేది.. పాలసీదారులు ప్రమాదం కారణంగానైనా లేదా కోవిడ్‌–19 సహా ఇతరత్రా ఏదైనా అనారోగ్యంతోనైనా ఆస్పత్రిలో చేరితే కవరేజ్‌ ఇస్తుంది. ఇలాంటి పాలసీల కోసం బీమా కంపెనీలు మెడికల్‌ చెకప్‌ గురించి అడగవు. వ్యక్తిగత పాలసీలతో పోలిస్తే వీటి ప్రీమియంలు తక్కువగానే ఉంటాయి. గ్రూప్‌ అంగీకరించే కొటేషన్‌ను బట్టి ప్రతీ ఏడాది కవరేజీ మారవచ్చు. ఈ పాలసీల ప్రీమియాన్ని కంపెనీయే భరించవచ్చు లేదా సభ్యుడి నుంచి వసూలు చేయవచ్చు. గ్రూప్‌లో అందరికీ ఒకే రకమైన ప్రయోజనాలు ఉంటాయి.

వ్యక్తిగత ఆరోగ్య బీమా..
ఈ పాలసీలను వ్యక్తులు నేరుగా కొనుగోలు చేస్తారు. వివిధ రకాల అస్వస్థతలు, ఆస్పత్రిలో చేరితే అయ్యే ఖర్చులు, ఇతరత్రా చికిత్సాపరమైన ఖర్చుల నుంచి రక్షణ పొందేందుకు .. పాలసీదారు తన అవసరాలకు అనుగుణంగా ఈ పాలసీల కవరేజీని ఎంచుకోవడానికి వీలు ఉంటుంది. జీవిత భాగస్వామి, పిల్లలు, తల్లిదండ్రులు, అత్త మామలు వంటి మీ మీద ఆధారపడిన వారికి కూడా కవరేజీ లభించేలా దీన్ని కస్టమైజ్‌ చేసుకోవచ్చు. పాలసీ తీసుకున్న వ్యక్తి నేరుగా ప్రీమియంను కట్టాల్సి ఉంటుంది. సకాలంలో పునరుద్ధరించుకోకపోతే పాలసీ గడువు ముగిసిపోతుంది. పాలసీ తీసుకునే వ్యక్తికి సంబంధించిన ప్రస్తుత ఆరోగ్య పరిస్థితిని పరిగణనలోకి తీసుకుంటారు. అవసరమైతే వైద్య పరీక్షలు చేయించుకోవాలని కూడా బీమా కంపెనీ అడగవచ్చు.  

ఎవరికి ఏవి అనువైనవంటే..
ప్రీమియంలు చౌకగా ఉండటంతో పాటు యజమానే కడతారు కాబట్టి యుక్తవయస్కులకు గ్రూప్‌ హెల్త్‌ ఇన్సూరెన్స్‌ అర్థవంతంగానే ఉంటుంది. కానీ కుటుంబ బాధ్యతలు ఉన్నవారు.. తగినంత కవరేజీతో కూడిన వ్యక్తిగత ఆరోగ్య బీమా పాలసీ తీసుకోవడం శ్రేయస్కరం. ఒకవేళ సంస్థ నుంచి గ్రూప్‌ ఇన్సూరెన్స్‌ కవరేజీ భారీగానే ఉన్నట్లయితే.. గ్రూప్‌ ఇన్సూరెన్స్‌ సమ్‌ ఇన్సూర్డ్‌తో సరిపోయే టాప్‌–అప్‌ కవర్‌ని తీసుకోవచ్చు. ఇది చౌకగానే రావడంతో పాటు మీకు తగినంత స్థాయిలో కవరేజీనీ అందిస్తుంది. కొన్ని కంపెనీలు భవిష్యత్తులో అవసరమైతే టాప్‌–అప్‌ను బేస్‌ కవర్‌గా మార్చుకునేందుకు కూడా అవకాశమిస్తున్నాయి. కాబట్టి హెల్త్‌ పాలసీని తీసుకునేటప్పుడు ఇవన్నీ పరిగణనలోకి తీసుకోవడం   మంచిది.

 సుధా రెడ్డి, హెడ్‌ (హెల్త్‌ విభాగం)  డిజిట్‌ ఇన్సూరెన్స్‌ 

మరిన్ని వార్తలు