డిజిటల్‌ లెండింగ్‌ హవా

15 Feb, 2023 04:24 IST|Sakshi

2030 నాటికి భారీ వృద్ధి

ఎక్స్‌పీరియన్‌ ఇండియా నివేదిక  

ముంబై: ఈ దశాబ్దంలో డిజిటల్‌ లెండింగ్‌ దూసుకుపోతుందని, ఫిన్‌టెక్‌ సంస్థలు ఈ సేవలను మరింతగా వినియోగదారుల చెంతకు తీసుకెళతాయని క్రెడిట్‌ సమాచార సంస్థ ఎక్స్‌పీరియన్స్‌ తెలిపింది. 2030 నాటికి అన్‌సెక్యూర్డ్‌ రుణాల్లో సంప్రదాయ రుణవితరణతో పోలిస్తే డిజిటల్‌ రుణాలదే పైచేయి అవుతుందని ఈ సంస్థ అంచనా వేసింది. అన్‌సెక్యూర్డ్‌ చిన్న సైజు రుణాలతోపాటు, సెక్యూర్డ్‌ అధిక సైజు రుణాల్లో డిజిటల్‌ లెండింగ్‌ మరింత విస్తరిస్తుందని పేర్కొంది.

‘‘సంప్రదాయ రుణదాతలు సాధారణంగా ఆస్తుల తనఖాపై రుణాల్లో (సెక్యూర్డ్‌) అధిక వాటా కలిగి ఉంటారు. డిజిటైజేషన్‌ పెరుగుతున్న కొద్దీ ఈ విభాగంలోకి సైతం ఫిన్‌టెక్‌ సంస్థలు చొచ్చుకుపోతాయి. దీంతో అవి చెప్పుకోతగ్గ మార్కెట్‌ వాటాను సొంతం చేసుకోగలవు’’అని ఎక్స్‌పీరియన్స్‌ క్రెడిట్‌ ఇన్ఫర్మేషన్‌ కంపెనీ ఇండియా ఎండీ సాయికృష్ణన్‌ శ్రీనివాసన్‌ తెలిపారు. డిజిటల్‌గా సౌకర్యవంతమైన అనుభవాన్ని కస్టమర్లకు అందిస్తున్నప్పటికీ డిజిటల్‌ లెండింగ్‌ సంస్థలకు తదుపరి దశ వృద్ధి అన్నది సవాలుగా ఈ నివేదిక పేర్కొంది. డిజిటల్‌ లెండింగ్‌ విభాగంలో బడా టెక్నాలజీ సంస్థలు కూడా కీలక పాత్ర పోషిస్తాయని అంచనా వేసింది.  

రికవరీ ఏజెంట్లపై ముందే చెప్పాలి: ఆర్‌బీఐ
డిజిటల్‌ లెండింగ్‌ సంస్థలు (డిజిటల్‌ వేదికల రూపంలో రుణాలిచ్చేవి) కస్టమర్లకు రికవరీ ఏజెంట్ల వివరాలను ముందే వెల్లడించాలని ఆర్‌బీఐ ఆదేశించింది. ‘‘ఏదైనా రుణం చెల్లింపుల్లేకుండా ఆగిపోతే, ఆ రుణం వసూలుకు ఏజెంట్‌ను నియమించినట్టయితే.. సంబంధిత ఏజెంట్‌ పేరు, ఫోన్‌ నంబర్‌ తదితర వివరాలను కస్టమర్‌కు ఎస్‌ఎంఎస్‌ లేదా ఈమెయిల్‌ రూపంలో తెలియజేయాలి’’అని తాజా ఆదేశాల్లో ఆర్‌బీఐ పేర్కొంది. డిజిటల్‌ లెండింగ్, రుణాల రికవరీకి సంబంధించిన నిబంధనలను ఆర్‌బీఐ గతేడాది చివర్లో కఠినతరం చేయడం తెలిసిందే. 

మరిన్ని వార్తలు