డిజిటల్‌ లోన్లపై అక్రమాలకు చెక్‌: కొత్త రూల్స్‌ నేటి నుంచే!

1 Dec, 2022 14:56 IST|Sakshi

నేటి నుంచి అమల్లోకి

రుణదాతల హక్కులకు మరింత రక్షణ.

న్యూఢిల్లీ: డిజిటల్‌ రుణాలకు ఆర్‌బీఐ ప్రకటించిన కొత్త నిబంధనలు డిసెంబర్‌ 1 నుంచి అమల్లోకి రానున్నాయి. ఇప్పటికే తీసుకున్న రుణాలతో పాటు కొత్తగా మంజూరు చేసే రుణాలకు సైతం ఇవి వర్తిస్తాయి. అసాధారణ స్థాయిలో వడ్డీ రేట్లు, అనవసర చార్జీల రూపంలో వినియోగదారులను దోపిడీ చేయకుండా, రుణాల వసూళ్లకు అనైతిక విధానాలకు పాల్పడ కుండా కఠిన నిబంధనలను ఆర్‌బీఐ ప్రకటించడం గమనార్హం. (అంతా తూచ్‌! యాపిల్‌ ఆఫీస్‌ భలే ఉంది: మస్క్‌ యూటర్న్‌)   

నూతన నిబంధనల కింద రుణ వితరణ, వాటి వసూలు అన్నవి రుణ గ్రహీత ఖాతా, ఆర్‌బీఐ వద్ద నమోదైన బ్యాంకులు లేదా ఎన్‌బీఎఫ్‌సీ సంస్థల మధ్యే నేరుగా ఉండాలి. రుణం మంజూరునకు ముందు వరకే డిజిటల్‌ ప్లాట్‌ఫామ్‌లు పరిమితం కావాల్సి ఉంటుంది. అంతేకానీ, ఎన్‌బీఎఫ్‌సీ సంస్థల నుంచి డిజిటల్‌ ప్లాట్‌ఫామ్‌ల ద్వారా రుణాల జమ, వసూలు ఉండకూడదు. ఇక మధ్యవర్తిత్వ పాత్ర పోషించిన డిజిటల్‌ లెండింగ్‌ ప్లాట్‌ఫామ్‌లకు చార్జీలను బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీలే చెల్లించుకోవాలి. రుణ గ్రహీత నుంచి వసూలు చేయరాదు. (శాంసంగ్‌ మరో గెలాక్సీ 5జీ స్మార్ట్‌ఫోన్‌ వచ్చేస్తోంది: ఫీచర్లు, ధర)

‘‘కరోనా తర్వాత డిజిటల్‌ రుణాలు, చెల్లింపులు పెరిగాయి. కనుక మెరుగైన వ్యవస్థలు, విధానాలు అనేవి డేటా గోప్యత, వ్యక్తిగత సమాచార రక్షణ దృష్ట్యా అవసరం’’అని ఆండ్రోమెడా లోన్స్‌ ఎగ్జిక్యూటివ్‌ చైర్మన్‌ వి.స్వామినాథన్‌ పేర్కొన్నారు. కొత్త నిబంధనల నేపథ్యంలో లైసెన్స్‌ కలిగి, నిబంధనలను పాటించే కంపెనీలు.. ఫిన్‌టెక్‌లు, ఇతర ఎన్‌బీఎఫ్‌సీ బాగస్వామ్య కంపెనీల కంటే పైచేయి చూపిస్తాయని వివిఫి ఫైనాన్సెస్‌ సీఈవో అనిల్‌ పినపాల అభిప్రాయపడ్డారు.

మరిన్ని వార్తలు