భారత్‌పేతో జాగ్రత్త! అలాంటి పనులు చేస్తే జైలుకే?

11 May, 2022 10:57 IST|Sakshi

భారీ సంఖ్యలో ఉద్యోగులు, వెండార్లపై వేటు

న్యూఢిల్లీ: అవకతవకలు, దుష్ప్రవర్తన ఆరోపణలపై పలువురు ఉద్యోగులు, వెండార్లను తొలగించినట్లు, వారిపై క్రిమినల్‌ కేసులు నమోదు చేయనున్నట్లు పేమెంట్స్‌ సేవల స్టార్టప్‌ సంస్థ భారత్‌పే వెల్లడించింది. అలాగే మాజీ వ్యవస్థాపకుడు అష్‌నీర్‌ గ్రోవర్‌ పేరు ప్రస్తావించకుండా, ఆయనకు  కేటాయించిన షేర్లను కూడా వెనక్కి తీసుకోవాలని నిర్ణయించినట్లు తెలిపింది. గ్రోవర్‌ ఎండీగా వ్యవహరించినప్పుడు చోటు చేసుకున్న అవకతవకలు, కార్పొరేట్‌ గవర్నెన్స్‌ లోపాలపై కంపెనీ బోర్డు సవివరంగా చర్చించిన మీదట ఈ చర్యలు తీసుకున్నట్లు భారత్‌పే పేర్కొంది. కార్పొరేట్‌ గవర్నెన్స్‌ లోపాలు పునరావృతం కాకుండా సీనియర్‌ మేనేజ్‌మెంట్, ఉద్యోగులకు కొత్త ప్రవర్తనా నియమావళిని, వెండార్లకు సంబంధించి సమగ్రమైన కొనుగోళ్ల విధానాన్ని అమలు చేస్తున్నట్లు వివరించింది. 

‘తప్పుడు లేదా అడ్డగోలు రేట్లతో ఇన్వాయిస్‌లు ఇచ్చిన చాలా మంది వెండార్లు ఇకపై కంపెనీతో వ్యాపార లావాదేవీలు జరపకుండా బ్లాక్‌ చేశాం. జీఎస్‌టీ విచారణలో కూడా వీరి పేర్లు ఉన్నాయి. ఇప్పటికే చెల్లించిన మొత్తాలను రికవర్‌ చేసుకునేందుకు వారికి లీగల్‌ నోటీసులు కూడా జారీ చేశాం. రాబోయే రోజుల్లో వారిపై సివిల్‌ / క్రిమినల్‌ కేసులు కూడా వేయబోతున్నాం‘ అని భారత్‌పే తెలిపింది. కొత్త సీఎఫ్‌వోను ఎంపిక చేసే ప్రక్రియలో ఉన్నామని, తరచుగా అంతర్గత ఆడిట్‌ కూడా నిర్వహిస్తామని పేర్కొంది. 

చదవండి: తప్పు చేస్తే సహించేదేలే..! అష్నీర్‌కు భారత్‌పే ఇన్వెస్టర్ల వార్నింగ్‌!

మరిన్ని వార్తలు