డిజిటల్‌ లావాదేవీల జోరు!!

1 Apr, 2021 04:57 IST|Sakshi

2025 నాటికి మొత్తం చెల్లింపుల్లో సుమారు 72% వాటా

నగదు, చెక్కులు ఇతర ప్రత్యామ్నాయాల వాటా 28 శాతమే

ఏసీఐ వరల్డ్‌వైడ్‌ నివేదిక

ముంబై: రాబోయే రోజుల్లో డిజిటల్‌ పేమెంట్స్‌ లావాదేవీలు గణనీయంగా పెరగనున్నాయి. 2025 నాటికి దేశీయంగా వివిధ సాధనాల ద్వారా జరిగే మొత్తం చెల్లింపు లావాదేవీల్లో వీటి వాటా 71.7 శాతానికి చేరనుంది. నగదు, చెక్కులతో పాటు ఇతరత్రా ప్రత్యామ్నాయాల వాటా 28.3 శాతానికి పరిమితం కానుంది. పేమెంట్‌ సేవల సంస్థ ఏసీఐ వరల్డ్‌వైడ్‌ రూపొందించిన నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. దీని ప్రకారం 2020లో 2,550 కోట్ల రియల్‌ టైమ్‌ పేమెంట్స్‌ లావాదేవీలతో చైనాను భారత్‌ అధిగమించింది.

చైనాలో ఈ తరహా లావాదేవీల సంఖ్య 1,570 కోట్లకు పరిమితమైంది. ఇక గతేడాది మొత్తం చెల్లింపుల్లో ఇన్‌స్టంట్‌ పేమెంట్స్‌ వాటా 15.6 శాతంగాను, ఎలక్ట్రానిక్‌ చెల్లింపుల వాటా 22.9 శాతంగాను ఉండగా.. పేపర్‌ ఆధారిత చెల్లింపుల విధానాల వాటా 61.4 శాతంగా నమోదైంది. 2025 నాటికి ఇది పూర్తిగా మారిపోనుందని నివేదిక తెలిపింది. అప్పటికి ఇన్‌స్టంట్‌ పేమెంట్స్‌ వాటా 37.1 శాతం, ఎలక్ట్రానిక్‌ చెల్లింపుల వాటా 34.6 శాతానికి చేరుతుందని, నగదు ఇతరత్రా పేపర్‌ ఆధారిత చెల్లింపు విధానాల వాటా 28.3 శాతానికి తగ్గుతుందని వివరించింది.

అన్ని వర్గాల మధ్య సమన్వయం..
అందరినీ ఆర్థిక సేవల పరిధిలోకి తీసుకురావాలన్న లక్ష్యం దిశగా భారత్‌ వేగంగా ముందుకు సాగేందుకు .. ప్రభుత్వం, నియంత్రణ సంస్థ, బ్యాంకులు, ఫిన్‌టెక్‌ సంస్థలు వంటి అన్ని వర్గాల మధ్య సమన్వయం తోడ్పడుతోందని ఏసీఐ వరల్డ్‌వైడ్‌ వైస్‌–ప్రెసిడెంట్‌ కౌశిక్‌ రాయ్‌ తెలిపారు. కరోనా వైరస్‌ మహమ్మారి కారణంగా వినియోగదారులు, వ్యాపార విధానాలు మారే కొద్దీ పేమెంట్స్‌ వ్యవస్థలోని బ్యాంకులు, వ్యాపారులు, మధ్యవర్తిత్వ సంస్థలు కూడా తదనుగుణమైన మార్పులు, చేర్పులను వేగంగా చేపడుతున్నాయని పేర్కొన్నారు. నివేదిక ప్రకారం 2020లో రియల్‌ టైమ్‌ లావాదేవీల నిర్వహణలో భారత్‌ అగ్రస్థానంలో ఉండగా, చైనా, దక్షిణ కొరియా, థాయ్‌లాండ్, బ్రిటన్‌ టాప్‌–5 దేశాల జాబితాలో నిల్చాయి. గతేడాది మొబైల్‌ వాలెట్ల వినియోగం చారిత్రక గరిష్ట స్థాయి 46 శాతానికి ఎగిసింది. 2018లో ఇది 19 శాతంగాను, 2019లో 40.6 శాతంగాను నమోదైంది. ఎక్కువగా నగదు లావాదేవీలకు ప్రాధాన్యమిచ్చే బ్రెజిల్, మెక్సికో, మలేసియా తదితర దేశాల ప్రజలు వేగంగా మొబైల్‌ వాలెట్ల వైపు మళ్లినట్లు నివేదిక తెలిపింది.

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు