డిజిటల్‌ చెల్లింపులతో చిన్న దుకాణాలకు ఊతం

23 Nov, 2021 09:07 IST|Sakshi

సకాలంలో బాకీలు తీర్చేస్తున్న వినియోగదారులు 

న్యూఢిల్లీ: డిజిటల్‌ చెల్లింపుల విధానం ప్రాచుర్యంలోకి వస్తున్న నేపథ్యంలో చిన్న దుకాణాదారుల భారీగా ఊరట లభిస్తోంది. వారి దగ్గర అరువుగా (బీఎన్‌పీఎల్‌– ఇప్పుడు కొనుక్కోవడం, తర్వాత చెల్లించడం విధానం) తీసుకున్న వాటికి వినియోగదారులు సకాలంలో చెల్లింపులు చేస్తున్నారు. దీపావళి తర్వాత దేశీయంగా అసంఘటిత రంగంలోని చిన్న స్థాయి దుకాణాదారులకు బీఎన్‌పీఎల్‌ విధానంలో చెల్లింపులు గణనీయంగా పెరిగాయి. సగటుతో పోలిస్తే 12 శాతం అధికంగా నమోదయ్యాయి. అలాగే పండుగ సీజన్‌ సందర్భంగా రెండు వారాల్లో దుకాణాదారుల వ్యాపారం 15 శాతం వృద్ధి చెందింది. డిజిటల్‌ బుక్‌ కీపింగ్‌ యాప్‌ ఓకేక్రెడిట్‌ నిర్వహించిన ఒక అధ్యయనంలో ఈ అంశాలు వెల్లడయ్యాయి.  

సత్వర చెల్లింపులు
వినియోగదారులు రుణంపై షాపింగ్‌ చేయడం పెరిగిన్నప్పటికీ వారు సత్వరం చెల్లింపులు జరిపే ధోరణి కూడా పెరిగిందని నివేదిక పేర్కొంది. కిరాణా షాపులు, ఆభరణాలు, తినుబండారాల దుకాణాదారులు మొదలైన వారు గతంలో తమ బాకీలను వసూలు చేసుకునేందుకు చాలా ఇబ్బందులు పడాల్సి వచ్చేదని తెలిపింది. కానీ ఈసారి పండుగ సీజన్‌లో 30 లక్షల మంది పైగా కస్టమర్లు తమ బాకీలను సకాలంలో కట్టేశారని పేర్కొంది. మరోవైపు, రిటైల్‌ చిన్న, మధ్య తరహా సంస్థలు తమ ఖాతాల నిర్వహణకు డిజిటల్‌ సొల్యూషన్స్‌ వినియోగించడం 70 శాతం పెరిగిందని ఓకేక్రెడిట్‌ తెలిపింది. దాదాపు 1.1 లక్షల కోట్ల దేశీ రిటైల్‌ మార్కెట్లో దాదాపు 95 శాతం వాటా 6 కోట్ల పైచిలుకు స్థానిక వ్యాపారాలదే ఉంటోందని వివరించింది.   
 

మరిన్ని వార్తలు