డిజిటల్‌ పేమెంట్స్‌ మార్కెట్‌ 2025నాటికి మూడింతలు

24 Aug, 2020 05:34 IST|Sakshi

మరింత పెరగనున్న వాలెట్, మొబైల్‌ చెల్లింపులు

రెడ్‌సీర్‌ కన్సల్టింగ్‌ సర్వే అంచనా

న్యూఢిల్లీ: భారత్‌లో డిజిటల్‌ పేమెంట్స్‌ మార్కెట్‌ 2025నాటికి మూడింతల వృద్ధిని సాధించి రూ.7,092 ట్రిలియన్లకు చేరుకోవచ్చని బెంగళూరు ఆధారిత రీసెర్చ్‌ సంస్థ రెడ్‌సీర్‌ కన్సల్టింగ్‌ అంచనా వేసింది. ప్రభుత్వ ఆర్థిక విధానాల్లో డిజిటల్‌ పేమెంట్స్‌కు పెరుగుతున్న ప్రాధాన్యత, వ్యాపారుల డిజిటలైజేషన్‌ల వృద్ధి దేశంలో డిజిటల్‌ పేమెంట్స్‌ మార్కెట్‌ విస్తరణకు తోడ్పడతాయని రీసెర్చ్‌ పేర్కొంది. ఆర్థిక సంవత్సరం 2019–20లో భారత డిజిటల్‌ పేమెంట్‌ మార్కెట్‌ విలువ దాదాపు రూ.2,162 కోట్లుగా ఉన్నట్లు రీసెర్చ్‌ తెలిపింది. ఈ వృద్ధి అనేక డిమాండ్, సరఫరా అంశాలతో ముడిపడి ఉన్నట్లు కన్సల్టెన్సీ సర్వేలో తెలిపింది.  

డిజిటల్‌ పేమెంట్స్‌ మార్కెట్లో ప్రస్తుతం 1శాతంగా ఉన్న మొబైల్‌ పేమెంట్స్‌ 2025నాటికి 3.5శాతానికి పెరగవచ్చని నివేదిక అంచనా వేసింది. ఇదే సమయంలో 162 మిలియన్లు ఉన్న మొబైల్‌ పేమెంట్‌ యూజర్లు 800 మిలియన్లకు చేరుకొనే అవకాశం ఉందని నివేదిక తెలిపింది. డిజిటల్‌ పేమెంట్స్‌లోకీలకపాత్ర పోషిస్తున్న వాలెట్‌ ఆధారిత పేమెంట్స్‌... ఫ్రీక్వెన్సీ, యూజర్‌ బేస్‌ రెండింటిలో నిరంతర వృద్ధి చెందుతూ రానున్న డిజిటల్‌ మార్కెట్‌ పెరుగుదలలో కీలక పాత్ర పోషిస్తుందని పేర్కొంది. 2025 నాటికి, వాలెట్ల ద్వారా చెల్లింపులు అధికంగా ఉండవచ్చని, చివరికి తక్కువ–ఆదాయ చెల్లింపుగా భావించే మల్టీపుల్‌ స్మాల్‌–టికెట్‌ లావాదేవీలు కూడా వాలెట్ల ద్వారానే జరగవచ్చని రీసెర్చ్‌ సంస్థ భావిస్తోంది.   కరోనా  వ్యాప్తి డిజిటల్‌ పేమెంట్స్‌కు ఒక ఉత్ప్రేరకంగా పనిచేసిందని తెలిపింది. కరోనా భద్రత ఆందోళనలతో ప్రజలు మొబైల్‌ ఫోన్ల ద్వారా చెల్లింపులకు ప్రాధాన్యత ఇవ్వడంతో గ్రాసరీ స్టోర్‌లో డిజిటల్‌ పేమేంట్స్‌ 75% పెరిగినట్లు నివేదిక తెలిపింది.

మరిన్ని వార్తలు