వివాదంలో అశ్లీల ఏఐ సాంకేతికత.. నిషేధానికి డిమాండ్‌

6 Aug, 2021 12:00 IST|Sakshi

రోజుకో కొత్త టూల్‌, కొత్త ఫీచర్స్‌ యూజర్లకు అందుబాటులోకి వస్తున్నాయి. సోషల్‌ మీడియా సంచార జీవులు.. ఈ ఫీచర్స్‌ను కచ్చితంగా ట్రై చేస్తుంటారు కూడా. అయితే వీళ్ల బలహీనతలను క్యాష్‌ చేసుకునేందుకు ‘అతి’ పోకడలు ప్రదర్శిస్తున్నాయి కొన్ని కంపెనీలు. టెక్నాలజీ వల్ల ఎన్ని ఉపయోగాలు ఉంటాయో.. అదే స్థాయిలో నష్టాలుంటాయని మరోసారి రుజువైంది. సరదా పేరుతో పుట్టుకొచ్చిన చెండాలపు టూల్‌ ‘న్యూడీఫైయింగ్‌’.. ఇప్పుడు అంతర్జాతీయ సమాజంలో పెద్ద చర్చకే దారితీసింది.

సాక్షి, వెబ్‌డెస్క్‌: యూకే ఎంపీ మరియా మిల్లర్‌(57).. ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్స్‌ టూల్‌ ‘న్యూడీఫైయింగ్‌’ మీద పార్లమెంట్‌ చర్చకు పట్టుబట్టడం ఈ చర్చకు ఆజ్యం పోసింది. న్యూఢీఫైయింగ్‌ టూల్‌ అంటే.. నగ్నంగా మార్చేసే టూల్‌. ఈ టూల్‌ సాయంతో బట్టల్లేకుండా చేయొచ్చు. ఫొటోగానీ, వీడియోగానీ ఈ టూల్‌ ద్వారా అప్‌డేట్‌ చేస్తే..  స్కానింగ్‌ చేసుకుని నగ్నంగా మార్చేసి చూపిస్తుంది. డీప్‌సుకెబే అనే వెబ్‌సైట్‌ కిందటి ఏడాది ఈ టూల్‌ను తీసుకురావడం, ఇప్పటికే కోట్ల మంది ఆ టూల్‌ను ఉపయోగించడం జరిగిపోయింది . ఒక్క జూన్‌ నెలలోనే యాభై లక్షల మంది ఈ సైట్‌ను సందర్శించారంటే.. ఈ టూల్‌ క్రేజ్‌ ఏంటో అర్థం చేసుకోవచ్చు.

ఆడవాళ్లే లక్క్ష్యంగా.. 
డీప్‌సుక్‌బే వెబ్‌సైట్‌ వెనుక ఎవరు ఉన్నదనేది తెలియదు. కానీ, న్యూడీఫైయింగ్‌ టూల్‌ను(ఏఐ-లెవెరేజ్డ్‌ న్యూడిఫైయ్యర్‌) దరిద్రమైన ప్రచారంతో ప్రజల్లోకి తీసుకొచ్చింది మాత్రం ఇదే. కేవలం ఆడవాళ్లను మాత్రమే చూపిస్తాం అంటూ ప్రచారం చేసుకుంది ఈ వెబ్‌సైట్‌. ‘బట్టల వెనుక దాగున్న నగ్న సత్యాలను చూపిస్తాం.. మగవాళ్ల కలలను నిజం చేస్తాం’ అంటూ ప్రమోషన్‌ చేసుకోవడంతో డీప్‌సుక్‌బే వెబ్‌సైట్‌కు విపరీతమైన పబ్లిసిటీ దక్కింది. పే అండ్‌ యూజ్‌ సౌకర్యం కావడంతో ప్రపంచం వ్యాప్తంగా చాలామంది, మరికొందరు వీపీఎన్‌(వర్చువల్‌ ప్రైవేట్‌ నెట్‌వర్క్‌) సర్వీసుల ద్వారా ఈ టూల్‌ను ఉపయోగించుకుంటున్నారు.

ఎవరినీ వదలకుండా.. 
దాదాపు అన్ని దేశాలకు చెందిన బాధితులు లక్షల్లో .. డీప్‌సుక్‌బే న్యూఢీఫైయింగ్‌ టూల్‌ బారిన పడ్డారనే విషయం వెలుగులోకి వచ్చింది. సామాన్యులతో పాటు సెలబ్రిటీలు, ఒలింపిక్‌ అథ్లెట్లు కూడా బాధిత జాబితాలో ఉండడం విశేషం. అందుకే ఈ టూల్‌ వ్యవహార శైలిపై అందరిలో ఆగ్రవేశాలు రగులుతున్నాయి. వాస్తవానికి న్యూడీఫైయర్‌ టూల్స్‌ కొత్తేం కాదు. ‘న్యూడ్‌ యువర్‌ ఫ్రెండ్‌’ సపోర్టింగ్‌ ఫీచర్‌ పేరుతో కొన్ని ఫొటో, వీడియో యాప్‌ల ద్వారా ఇలాంటి ఆమధ్య బాగా వైరల్‌ అయ్యాయి కూడా. అయితే డీప్‌న్యూడ్‌ అనే వెబ్‌సైట్‌ 2019లో ఈ టూల్‌ను తొలిసారిగా ఓన్‌ వెర్షన్‌తో లాంఛ్‌ చేసింది. ఆ టైంలో తీవ్ర విమర్శలు వెల్లువెత్తడంతో..  వెంటనే ఆ టెక్నాలజీని వెనక్కి తీసేసుకుంది. ఇక ఇలాంటి డిజిటల్‌ టెక్నాలజీ పట్ల ప్రపంచంలో ఎక్కడా న్యాయపరమైన చర్యలకు ఎలాంటి చట్టాలు లేవు. దీంతో యూకేలో ప్రత్యేక బిల్లు కోసం పోరాడాలని మరియా మిల్లర్‌ ప్రయత్నిస్తోంది. 

ఒక లెక్క ఉంటదా?
న్యూఢీఫైయింగ్‌ టూల్‌.. ఇది హేతుబద్ధమైంది కాదు. కానీ, అడల్ట్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌లో భాగంగా నడుస్తూ వస్తోంది. వివాదాలు-విమర్శలు-కేసులు ఏదేమైనా సరే.. న్యూడీఫైయింగ్‌ ఏఐ టూల్‌ సోర్స్‌ కోడ్‌ల అమ్మకం మాత్రం జోరుగా నడుస్తూనే ఉంది. ఏఐ టెక్నాలజీ ఏదైనా సరే.. లీగల్‌ అండ్‌ ఎథికల్‌గా ఉండాలనే నిబంధనను పాటించడం వల్లే చట్టాలూ కూడా ఇలాంటి టూల్స్‌ను అడ్డుకోలేకపోతున్నాయి. అయితే ఏదిఏమైనా అశ్లీలతను.. అదీ అవతలివాళ్ల అనుమతి లేకుండా డిజిటల్‌గా ప్రోత్సహించడం తీవ్ర నేరంగా పరిగణించాలని, ప్రత్యేక చట్టాల ద్వారా అడ్డుకోవాలని పలువురు కోరుతున్నారు.

ఇప్పటికే రివెంజ్‌ పోర్న్‌(ప్రతీకారంలో భాగంగా కోపంతో అవతలివాళ్ల మీద అశ్లీలతను ప్రమోట్‌ చేయడం) కేసులు చూస్తూ వస్తున్నాం. ఆన్‌లైన్‌ భద్రతా చట్టాలు కూడా కాపాడలేని స్టేజ్‌లో ఇలాంటి టెక్నాలజీ గనుక పేట్రేగిపోతే.. రివెంజ్‌ పోర్న్‌ లాంటి నేరాలను అడ్డుకోవడం కష్టమవుతుందనేది సైబర్‌ నిపుణులు చెప్తున్న మాట.

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు