జీడీపీకి ‘డిజిటల్‌’ వర్కర్ల దన్ను: వారికి డిమాండ్‌ మామూలుగా ఉండదు!

24 Feb, 2023 18:36 IST|Sakshi

రూ. 10.9 లక్షల కోట్ల ఊతం  ఏడబ్ల్యూఎస్‌ అధ్యయనం  

న్యూఢిల్లీ: క్లౌడ్‌ ఇన్‌ఫ్రా లేదా సాఫ్ట్‌వేర్‌ అభివృద్ధికి సంబంధించి అధునాతన డిజిటల్‌ నైపుణ్యాలు గల ఉద్యోగులతో భారత స్థూల దేశీయోత్పత్తికి (జీడీపీ) 10.9 లక్షల కోట్ల మేర ఊతం లభించగలదని ఒక నివేదిక వెల్లడించింది. ఒకే తరహా విద్యార్హతలు ఉన్నప్పటికీ కార్యాలయాల్లో డిజిటల్‌ నైపుణ్యాలను ఉపయోగించని వారితో పోలిస్తే వాటిని ఉపయోగించే ఉద్యోగులు 92 శాతం అధికంగా వేతనాలు పొందగలరని పేర్కొంది. ఏడబ్ల్యూఎస్‌ తరఫున గాలప్‌ సంస్థ ఈ అధ్యయన నివేదికను రూపొందించింది. రెండు దశల్లో నిర్వహించిన ఈ అధ్యయనంలో 2,005 మంది ఉద్యోగులు, 769 సంస్థలు పాల్గొన్నాయి.  

నివేదికలో మరిన్ని విశేషాలు.. 
► ఈ అధ్యయనం కోసం ఈమెయిల్, వర్డ్‌ ప్రాసెసర్లు, ఇతరత్రా ఆఫీస్‌ ఉత్పాదకత పెంచే సాఫ్ట్‌వేర్, సోషల్‌ మీడియాను వినియోగించగలిగే సామర్థ్యాలను ప్రాథమిక డిజిటల్‌ నైపుణ్యాలుగా వర్గీకరించారు. ఇక వెబ్‌సైట్‌ డిజైన్, డేటా అనాలిసిస్‌లాంటి వాటిని మధ్య స్థాయి నైపుణ్యాలుగా.. క్లౌడ్‌ ఆర్కిటెక్చర్, సాఫ్ట్‌వేర్‌ డెవలప్‌మెంట్, కృత్రిమ మేథ మొదలైన వాటిని అడ్వాన్స్‌డ్‌ డిజిటల్‌ నైపుణ్యాలుగా పరిగణించారు. 
 అధునాతన డిజిటల్‌ నైపుణ్యాలు ఉపయోగించే వారిలో 91 శాతం మంది ఉద్యోగంపై సంతృప్తిగా ఉండగా, ప్రాథమిక నైపుణ్యాలు ఉన్న వారిలో ఇది 74 శాతంగా ఉంది. అలాగే, అడ్వాన్స్‌డ్‌ డిజిటల్‌ సామర్థ్యాలు గల ఉద్యోగులున్న సంస్థల్లో 80 శాతం కంపెనీలు అధిక వార్షికాదాయ వృద్ధి నమోదు చేస్తున్నాయి. అయితే ఇలాంటి వాటిల్లో 88 శాతం కంపెనీలు.. హైరింగ్‌పరమైన సమస్యలు ఎదుర్కొంటున్నాయి.  
 తమ వ్యాపారాల్లో సింహభాగాన్ని క్లౌడ్‌పై నిర్వహించే భారతీయ సంస్థల్లో 21 శాతం కంపెనీలు రెట్టింపు ఆదాయాలు నమోదు చేస్తున్నాయి. క్లౌడ్‌ను కొద్దిగా వినియోగించే లేదా అస్సలు వినియోగించని కంపెనీల విషయంలో ఇది 9 శాతంగా ఉంది. క్లౌడ్‌ ఆధారిత సంస్థలు గత రెండేళ్లలో కనీసం ఒక కొత్తదైనా లేక మెరుగుపర్చిన ఉత్పత్తినైనా ప్రవేశపెట్టి ఉంటాయని అంచనాలు నెలకొన్నాయి. 
► వ్యాపారాలు, ప్రభుత్వ విభాగాలు డిజిటల్‌ బాట పట్టడం వేగవంతమవుతున్న నేపథ్యంలో రాబోయే రోజుల్లో అడ్వాన్స్‌డ్‌ డిజిటల్‌ వర్కర్లకు డిమాండ్‌ భారీగా ఉండనుంది     

మరిన్ని వార్తలు