ఆ బ్యాంకు కూడా ప్రైవేటు పరం ఖాయం!b

30 Apr, 2022 20:14 IST|Sakshi

ఐడీబీఐ బ్యాంక్‌

ప్రైవేటీకరణ ప్రక్రియ యథాతథం

దీపం కార్యదర్శి తుహిన్‌ కాంత పాండే 

న్యూఢిల్లీ: ఐడీబీఐ బ్యాంక్‌ ప్రైవేటీకరణ ప్రక్రియ యధాతథంగానే కొనసాగుతోందని ప్రభుత్వ ఆస్తుల నిర్వహణ, పెట్టుబడుల విభాగం (దీపం) కార్యదర్శి తుహిన్‌ కాంత పాండే తెలిపారు. రోడ్‌షో పూర్తయిన తర్వాత వాటాల విక్రయ పరిమాణంపై నిర్ణయం తీసుకోనున్నట్లు ఆయన వివరించారు. అయితే, ప్రస్తుతం ఎల్‌ఐసీ చేతిలో ఉన్న మేనేజ్‌మెంట్‌ హక్కులను కచ్చితంగా కొత్త కొనుగోలుదారుకు బదలాయించే అవకాశం ఉందని పాండే వివరించారు. ఐడీబీఐ బ్యాంకులో ప్రభుత్వం తనకున్న వాటాలను, ఇన్వెస్టర్ల స్పందనను బట్టి, ఏకమొత్తంగా విక్రయించాలా లేక విడతలవారీగా విక్రయించాలా అన్న దానిపై నిర్ణయం తీసుకుంటుందని పేర్కొన్నారు.

ఐడీబీఐ బ్యాంకులో ప్రభుత్వానికి 45.48 శాతం, ఎల్‌ఐసీకి 49.24 శాతం వాటాలు ఉన్నాయి. బ్యాంకులో వ్యూహాత్మక డిజిన్వెస్ట్‌మెంట్, మేనేజ్‌మెంట్‌ హక్కుల బదలాయింపునకు ఆర్థిక వ్యవహారాల క్యాబినెట్‌ కమిటీ గతేడాది మేలో సూత్రప్రాయంగా ఆమోదముద్ర వేసింది. మరోవైపు, ఎల్‌ఐసీని లిస్ట్‌ చేయడమనేది కేంద్ర ప్రభుత్వ దీర్ఘకాలిక వ్యూహాల్లో భాగమని పాండే చెప్పారు. ముందుగా 5 శాతం వాటాలు విక్రయించాలని భావించినా, ప్రస్తుత మార్కెట్‌ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని 3.5 శాతానికి పరిమితం చేస్తున్నట్లు వివరించారు.

చదవండి: మా 25వేల కోట్లను ఇన్వెస్టర్లకు ఇవ్వండి, లేదంటే తిరిగి మాకే ఇచ్చేయండి!

మరిన్ని వార్తలు