ప్రత్యక్ష పన్ను వసూళ్లు 24 శాతం అప్‌

10 Oct, 2022 06:12 IST|Sakshi

సెప్టెంబర్‌ 8 నాటికి  రూ.8.98 లక్షల కోట్లు  

న్యూఢిల్లీ: ప్రత్యక్ష పన్ను వసూళ్లు స్థూలంగా సెప్టెంబర్‌ 8వ తేదీ నాటికి 24 శాతం పెరిగి రూ.8.98 లక్షల కోట్లుగా నమోదయ్యాయి. రిఫండ్స్‌ మినహాయింస్తే, నికర వసూళ్లు 16.25 శాతం ఎగసి రూ.7.45 లక్షల కోట్లుగా ఉన్నాయి. ఏప్రిల్‌–అక్టోబర్‌ 8 మధ్య రిఫండ్స్‌ గత ఏడాది ఇదే కాలంతో పోల్చితే 81 శాతం పెరిగి రూ.1.53 లక్షల కోట్లుగా నమోదయినట్లు అధికారిక గణాంకాలు వెల్లడించాయి. మొత్తం వసూళ్లలో వ్యక్తిగత ఆదాయపు పన్ను ( సెక్యూరిటీస్‌ ట్రాన్జాక్షన్‌ పన్నుసహా) 32 శాతం పెరగ్గా, కార్పొరేట్‌ పన్ను ఆదాయాలు 17 శాతం ఎగశాయని అధికారిక గణాంకాలు వెల్లడించాయి.

గత ఆర్థిక సంవత్సరం (2021–22) ప్రత్యక్ష పన్ను వసూళ్లు రూ.14.10 లక్షల కోట్లు. 2022–23లో ఈ వసూళ్ల లక్ష్యం రూ.14.20 లక్షల కోట్లు.  ఇందులో కార్పొరేట్‌ పన్ను వసూళ్ల అంచనా రూ.7.20 లక్షలుకాగా, వ్యక్తిగత పన్ను వసూళ్ల అంచనా రూ.7 లక్షల కోట్లు. తాజా గణాంకాల ప్రకారం, నికర వసూళ్లు (రూ.7.45 లక్షల కోట్లు) బడ్జెట్‌ అంచనాల్లో దాదాపు 52 శాతం దాటడం గమనార్హం. దేశంలో పలు రంగాలు మందగమనంలో ఉన్నప్పటికీ, ఎకానమీ పురోగతికి సంకేతమైన ప్రత్యక్ష పన్ను వసూళ్లు భారీగా పురోగమిస్తుండడం శుభ సూచికమని నిపుణులు పేర్కొంటున్నారు. వస్తు, సేవల పన్ను (జీఎస్‌టీ) వసూళ్లు  ప్రతినెలా దాదా పు రూ.1.45 లక్షల కోట్లుగా నమోదవుతున్నాయి. 

మరిన్ని వార్తలు