ప్రత్యక్ష పన్ను వసూళ్లు 30 శాతం అప్‌

19 Sep, 2022 04:49 IST|Sakshi

సెప్టెంబర్‌ 17నాటికి రూ.8.36 లక్షల కోట్లు

న్యూఢిల్లీ: ప్రత్యక్ష పన్ను వసూళ్లు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం సెప్టెంబర్‌ 17తో ముగిసిన కాలానికి స్థూలంగా 30 శాతం పురోగతితో రూ.8.36 లక్షల కోట్లకు చేరాయి. మహమ్మారి తర్వాత వేగంగా పుంజుకుంటున్న ఎకానమీ,  ముందస్తు పన్ను చెల్లింపులు దీనికి కారణమని ఆర్థిక మంత్రిత్వశాఖ ఒక ప్రకటనలో పేర్కొంది. వార్షిక ప్రాతిపదికన చూస్తే, విలువ రూ.6,42,2876 కోట్ల నుంచి రూ.8,36,225 కోట్లకు చేరినట్లు ప్రకటన వివరించింది. మొత్తం వసూళ్లలో కార్పొరేట్‌ రంగం వాటా రూ.4.36 లక్షల కోట్లుకాగా, వ్యక్తిగత పన్ను విభాగం వాటా రూ.3.98 లక్షల కోట్లు. ఒక్క అడ్వాన్స్‌ పన్ను విసూళ్లు 17 శాతం వృద్ధితో రూ.2.29 లక్షల కోట్ల నుంచి రూ.2.95 లక్షల కోట్లకు చేరాయి.  

రిఫండ్స్‌ రూ.1.36 లక్షల కోట్లు
ఇక మొత్తం వసూళ్లలో రిఫండ్స్‌ విలువ రూ.1.36 లక్షల కోట్లు. దీనితో నికరంగా ప్రత్యక్ష పన్ను వసూళ్లు 23 శాతం వృద్ధితో రూ.7 లక్షల కోట్లుగా నమోదయ్యాయి.  గడచిన ఆర్థిక సంవత్సరం ప్రత్యక్ష పన్ను వసూళ్లు రూ.14.10 లక్షల కోట్లు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఈ పరిమాణాన్ని రూ.14.20 లక్షల కోట్లుగా కేంద్ర బడ్జెట్‌ అంచనా వేస్తోంది. ఇందులో కార్పొరేట్‌ పన్ను వసూళ్ల అంచనా రూ.7.20 లక్షలుకాగా, వ్యక్తిగత పన్ను వసూళ్ల అంచనా రూ.7 లక్షల కోట్లు.

మరిన్ని వార్తలు