లక్ష్యానికి మించి ప్రత్యక్ష పన్ను వసూళ్లు

16 Nov, 2022 08:28 IST|Sakshi

న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి ప్రత్యక్ష పన్నుల ఆదాయం బడ్జెట్‌ అంచనా రూ.14.20 లక్షల కోట్ల కంటే, 30 శాతం అధికంగా వసూలు అవుతుందని ప్రత్యక్ష పన్నుల కేంద్ర మండలి (సీబీడీటీ) చైర్మన్‌ నితిన్‌ గుప్తా తెలిపారు. దీని ఆధారంగా వచ్చే ఆర్థిక సంవత్సరానికి సైతం పన్నుల లక్ష్యం మరింత పెద్దగా ఉండొచ్చన్నారు. పన్నుల ఎగువేతకు చెక్‌ పెట్టేందుకు వీలుగా ఆన్‌లైన్‌ గేమింగ్‌కు సంబంధించి టీడీఎస్‌ నిబంధనల్లో మార్పులు ఉంటాయని చెప్పారు.

తదుపరి ఆర్థిక సంవత్సరం బడ్జెట్‌లో వీటికి చోటు కల్పించే అవకాశం ఉందన్నారు. ‘‘ఆన్‌లైన్‌ గేమింగ్‌పై ప్రస్తుతం టీడీఎస్‌ మినహాయింపు నిబంధన ఉంది.దీన్ని సవరించడమా లేక ప్రస్తుత రూపంలోనే ఉంచడమా అన్నది చూడాలి’’అని ఇండియా ఇంటర్నేషనల్‌ ట్రేడ్‌ ఫెయిర్‌లో భాగంగా తెలిపారు. ఆన్‌లైన్‌ గేమింగ్‌ ఆదాయంపై 10 శాతం టీడీఎస్‌ తగ్గించిన తర్వాతే ఇన్వెస్టర్‌కు చెల్లింపులు చేసే విధానం ప్రస్తుతం అమల్లో ఉంది.

మొత్తం మీద పస్త్రుత ఆర్థిక సంవత్సరానికి ప్రత్యక్ష పన్నుల ఆదాయం రూ.17.75–18.46 లక్షల కోట్ల మధ్య ఉండొచ్చని గుప్తా చెప్పారు. ఇక ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్‌ నుంచి నవంబర్‌ 10 వరకు వసూలైన ఆదాయం రూ.10.54 లక్షల కోట్లుగా ఉంది. ఇది అంచనాల కంటే 30 శాతం ఎక్కువ కావడం గమనార్హం. రిఫండ్‌లను తీసేసి చూస్తే నికరంగా రూ.8.71 లక్షల కోట్లు ఉంటుంది. బడ్జెట్‌ లక్ష్యంలో ఇది 61.31 శాతానికి సమానం.

చదవండి: భారత్‌లో ట్విటర్‌ చాలా స్లో, మరీ దారుణం: ఎలాన్‌ మస్క్‌ షాకింగ్‌ కామెంట్స్‌!

మరిన్ని వార్తలు