వేలానికి 8 ఆయిల్, గ్యాస్‌ బ్లాకులు

18 Dec, 2021 11:19 IST|Sakshi

న్యూఢిల్లీ: ఓపెన్‌ ఎక్రేజ్‌ లైసెన్సింగ్‌ విధానం (ఓఏఎల్‌పీ) కింద నిర్వహించే ఏడో విడత వేలంలో 8 చమురు, గ్యాస్‌ బ్లాకులను విక్రయానికి ఉంచుతున్నట్లు డైరెక్టరేట్‌ జనరల్‌ ఆఫ్‌ హైడ్రోకార్బన్స్‌ (డీజీహెచ్‌) వెల్లడించింది. బిడ్లను ఆహ్వానిస్తూ జారీ చేసిన ప్రకటనలో ఈ విషయం తెలిపింది. వేలం వేస్తున్న బ్లాకులు.. మొత్తం అయిదు రాష్ట్రాల్లో విస్తరించి ఉండగా, సింహభాగం బ్లాకులు అస్సాంలో ఉండనున్నాయి. వచ్చే ఏడాది ఫిబ్రవరి 15 నాటికి బిడ్లు దాఖలు చేయాల్సి ఉంటుంది. అక్టోబర్‌ 6తో ముగిసిన ఆరో విడత వేలంలో 21 బ్లాకులు విక్రయానికి ఉంచగా మూడు కంపెనీలు మాత్రమే బిడ్లు దాఖలు చేశాయి. ప్రభుత్వ రంగ ఓఎన్‌జీసీ, ఆయిల్‌ ఇండియాతో పాటు ప్రైవేట్‌ రంగ సన్‌ పెట్రోకెమికల్స్‌ వేలంలో పాల్గొన్నాయి. 21 బ్లాకుల్లో 18 బ్లాకులకు ఒక్కొక్కటి చొప్పున, 3 బ్లాకులకు రెండు బిడ్లు చొప్పున వచ్చాయి.  


దేశీయంగా మరింత విస్తీర్ణంలో చమురు, గ్యాస్‌ ఉత్పత్తిని ప్రోత్సహించడం ద్వారా  చమురు దిగుమతుల బిల్లుల భారాన్ని తగ్గించుకునే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోన్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా గత విధానాలకు భిన్నంగా .. ఆసక్తి గల సంస్థలే చమురు, గ్యాస్‌ వెలికితీతతకు అనువైన నిర్దిష్ట ఏరియాలను గుర్తించే స్వేచ్ఛ కల్పిస్తూ 2016 నుంచి ఓపెన్‌ ఎక్రేజ్‌ విధానాన్ని ప్రవేశపెట్టింది. అటువంటి ప్రాంతాలను ఒక దగ్గర చేర్చి ఏటా రెండు సార్లు వేలం నిర్వహిస్తోంది. సదరు ఏరియాను గుర్తించిన సంస్థకు బిడ్డింగ్‌లో అదనంగా 5 పాయింట్లు కేటాయిస్తోంది. అలాగే రాయల్టీ రేట్ల తగ్గింపు, మార్కెటింగ్‌.. ధరలపరమైన స్వేచ్ఛనివ్వడం మొదలైన వెసులుబాటు కల్పిస్తోంది. ఈ విధానంలో నిర్వహించిన తొలి విడత వేలంలో మినహా మిగతా రౌండ్లలో ప్రైవేట్‌ కంపెనీలు అంతగా పాల్గొనలేదు.  
 

మరిన్ని వార్తలు