కాల్‌ డ్రాప్స్‌, నెట్‌వర్క్‌ కాల్స్‌ సమస్యపై టెల్కోలతో ట్రాయ్‌ కీలక భేటి

6 Feb, 2023 11:21 IST|Sakshi

న్యూఢిల్లీ: టెలికం సేవల నాణ్యతను మెరుగుపర్చడం, 5జీ సర్వీసుల ప్రమాణాలను నిర్దేశించడం తదితర అంశాలకు సంబంధించిన మార్గదర్శ ప్రణాళికపై చర్చించేందుకు టెలికం రంగ నియంత్రణ సంస్థ ఫిబ్రవరి 17న టెల్కోలతో సమావేశం కానుంది. ఈ సందర్భంగా కాల్‌ డ్రాప్స్, వ్యాపారాలపరమైన అవాంఛిత కాల్స్, సందేశాలు మొదలైన వాటి గురించి కూడా చర్చించనుంది. ట్రాయ్‌ గురువారం ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేసింది.  

తరచుగా సమావేశాల నిర్వహణ, చర్చా పత్రాలు, బహిరంగ చర్చలు మొదలైన మార్గాల్లో సేవల నాణ్యతను సమీక్షిస్తూ ఉంటామని, తగు చర్యలు తీసుకుంటూ ఉంటామని పేర్కొంది. దేశవ్యాప్తంగా అత్యంత వేగవంతమైన 5జీ సర్వీసులను విస్తరిస్తున్న నేపథ్యంలో ఈ భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది. సర్వీసుల నాణ్యతను మెరుగు పర్చేందుకు తీసుకోతగిన చర్యలపై డిసెంబర్‌ 28న టెల్కోలతో టెలికం శాఖ సమావేశమైంది. 2022 నవంబర్‌ డేటా ప్రకారం 114 కోట్ల మొబైల్‌ సబ్‌స్క్రయిబర్స్‌తో భారత్‌ ప్రపంచంలోనే రెండో అతి పెద్ద స్మార్ట్‌ఫోన్‌ మార్కెట్‌గా ఉంది. ఇప్పటివరకూ 200 పైచిలుకు నగరాల్లో 5జీ సర్వీసులు అందుబాటులోకి వచ్చాయి.  

మరిన్ని వార్తలు