Dish TV: ఛైర్మన్‌ బై..బై! షేర్లు రయ్‌ రయ్‌..!

20 Sep, 2022 11:00 IST|Sakshi

 సాక్షి,ముంబై: డైరెక్ట్-టు-హోమ్ ఆపరేటర్ డిష్ టీవీ ఛైర్మన్ జవహర్ లాల్ గోయల్ కంపెనీ బోర్డు నుండి రాజీనామా చేశారు. ఈ విషయాన్ని డిష్ టీవీ సోమవారంనాటి రెగ్యులేటరీ ఫైలింగ్‌లో తెలిపింది. కంపెనీ అతిపెద్ద వాటాదారు యెస్ బ్యాంక్.. ఛైర్మన్ జవహర్ లాల్ గోయెల్ నేతృత్వంలోని ప్రమోటర్ కుటుంబం డిష్ టీవీ బోర్డు ప్రాతినిధ్యంపై  వివాదం, లీగల్‌ ఫైట్‌ నేపథ్యంలో ఈ రాజీనామా చోటు చేసుకుంది. 

 24 శాతానికి పైగా వాటా ఉన్న వైబీఎల్‌ డిష్ టీవీ బోర్డుని పునర్నిర్మించాలని, గోయెల్‌తో పాటు మరికొందరు వ్యక్తులను తొలగించాలని ఒత్తిడి చేస్తోంది. ఈ నెల ప్రారంభంలో, యెస్ బ్యాంక్ ప్రతిపాదించిన ఏడుగురు స్వతంత్ర డైరెక్టర్లలో ముగ్గురిని నియమించడానికి డిష్ టీవీ అంగీకరించింది. మరోవైపు జూన్‌లో జరిగిన కంపెనీ అసాధారణ సాధారణ సమావేశంలో గోయల్‌ను మేనేజింగ్ డైరెక్టర్‌గా, అనిల్ కుమార్ దువాను కంపెనీ హోల్‌టైమ్ డైరెక్టర్‌గా పునః నియమించాలనే ప్రతిపాదనను 75 శాతం షేర్‌హోల్డర్లు  తిరస్కరించారు. 

కాగా ఆగస్టు 30 నాటి కంపెనీ డిష్ టీవీ, రెగ్యులేటరీ ఫైలింగ్‌లో,  ఛైర్మన్ జవహర్ లాల్ గోయెల్ సెప్టెంబర్ 26, 2022న జరగనున్న కంపెనీ ఏజీఎంలో పదవినుంచి వైదొలుగుతారని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ పరిణామాల నేపథ్యంలో డీష్‌ టీవీ షేరు సోమవారం 10శాతం లాభపడగా, మంగళవారం మరో 6శాతం ఎగిసి 17.80 వద్ద కొనసాగుతోంది. 
 

మరిన్ని వార్తలు