పీఎస్‌యూల ఆదాయాలు పెంచుతాం

27 Sep, 2021 04:08 IST|Sakshi

ఆర్థిక శాఖ సహాయమంత్రి భగవత్‌

ముంబై: ప్రభుత్వ రంగ కంపెనీ(పీఎస్‌యూ)ల ఆదాయాలు పెంచేందుకు ప్రణాళికలు వేసినట్లు ఆర్థిక శాఖ సహాయమంత్రి భగవత్‌ కె.కరాద్‌ తాజాగా స్పష్టం చేశారు. అంతేకాకుండా డిజిన్వెస్ట్‌మెంట్‌ ప్రక్రియ ద్వారా ఉద్యోగాల సృష్టి జరుగుతున్నట్లు పేర్కొన్నారు. దేశీయంగా పీఎస్‌యూలు 14 లక్షల మందికి ఉపాధి కలి్పంచినట్లు తెలియజేశారు. డిజిన్వెస్ట్‌మెంట్‌ అంటే కంపెనీలు నష్టాలు నమోదు చేస్తున్నట్లుకాదని వ్యాఖ్యానించారు.

పీఎస్‌యూల ఆదాయం పెంపు, ఉద్యోగాల కల్పనకు ప్రభుత్వం విభిన్నతరహా ప్రణాళికలు అమలు చేస్తున్నట్లు డన్‌ అండ్‌ బ్రాడ్‌స్ట్రీట్‌ ఇండియా నిర్వహించిన వర్చువల్‌ సదస్సులో తెలియజేశారు. ఇటీవల మానిటైజేషన్‌ ప్రక్రియ ద్వారా ప్రభుత్వం రూ. 6 లక్షల కోట్ల పెట్టుబడులకు ప్రణాళికలు ప్రకటించినట్లు ప్రస్తావించారు. గత నెలలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ రోడ్లు, విద్యుత్, రైల్వేలుసహా పలు రంగాలకు చెందిన మౌలిక ఆస్తులకు సంబంధించి జాతీయ మానిటైజేషన్‌ పైప్‌లైన్‌(ఎన్‌ఎంపీ)ను ప్రకటించిన విషయం విదితమే.  

సంపద సృష్టి
పెట్రోలియం, సహజవాయు శాఖ సెక్రటరీ తరుణ్‌ కపూర్‌ సైతం పీఎస్‌యూలు ఉద్యోగ కల్పన చేస్తున్నట్లు సదస్సులో పేర్కొన్నారు. దేశానికి సంపదను సృష్టించడమే కాకుండా వాటాదారులకు డివిడెండ్లను పంచుతున్నట్లు ప్రస్తావించారు. దేశాభివృద్ధిలో ప్రభుత్వ రంగ కంపెనీలు కీలక పాత్ర పోషిస్తున్నాయని తెలియజేశారు. ఇది కొనసాగుతుందని చెప్పారు. మానవ వనరుల శిక్షణకు పీఎస్‌యూలు ఉపయోగపడుతున్నట్లు పేర్కొన్నారు. ఉదాహరణకు ఓఎన్‌జీసీలో పనిచేసిన నిపుణులు తదుపరి కంపెనీని వీడి ప్రైవేట్‌ రంగంలో ఉపాధి పొందుతున్నట్లు వెల్లడించారు.

మరిన్ని వార్తలు