అవాంతరాలు సర్వసాధారణంగా మారాయి

18 Aug, 2022 06:24 IST|Sakshi

అల్ట్రాటెక్‌ సిమెంటు చైర్మన్‌ బిర్లా వెల్లడి

న్యూఢిల్లీ: వ్యాపారాల నిర్వహణలో వివిధ రకాల అవాంతరాలు ప్రస్తుతం సర్వ సాధారణంగా మారాయని అల్ట్రాటెక్‌ సిమెంట్‌ చైర్మన్‌ కుమార మంగళం బిర్లా వ్యాఖ్యానించారు. అంతర్జాతీయంగా ఆర్థిక అనిశ్చితి నెలకొన్నప్పటికీ వాటిని విజయవంతంగా అధిగమించగలిగేలా భారత్‌ కనిపిస్తోందని తెలిపారు. వార్షిక సర్వ సభ్య సమావేశంలో షేర్‌హోల్డర్లను ఉద్దేశించి వర్చువల్‌గా చేసిన ప్రసంగంలో ఆయన ఈ అంశాలు ప్రస్తావించారు.

ఈ ఏడాది వ్యయాలపరమైన ఒత్తిళ్లు, ఆర్థిక మార్కెట్లలో అస్థిరత విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాల్సి ఉన్నప్పటికీ వ్యాపారాలు మధ్యకాలికంగా చూస్తే వ్యాపారాలు రికవరీ బాటలోనే కొనసాగుతున్నాయని బిర్లా వివరించారు. ‘కోవిడ్‌–19 మహమ్మారి కారణంగా 2020 అసాధారణమైన సంవత్సరంగా గడిచింది. సరఫరా వ్యవస్థలు దెబ్బతినడంతో 2021 కూడా అలాగే గడిచిపోయింది. ఇక ఇప్పుడు రష్యా–ఉక్రెయిన్‌ యుద్ధం, అంతర్జాతీయంగా స్టాగ్‌ఫ్లేషన్‌ (ద్రవ్యోల్బణం, నిరుద్యోగిత పెరిగిపోయి.. డిమాండ్‌ స్తబ్దంగా ఉండటం) వంటి కారణాలతో 2022 కూడా అసాధారణంగానే కొనసాగుతోంది. చూడబోతే అవాంతరాలనేవి సర్వసాధారణంగా మారిపోయినట్లుగా కనిపిస్తోంది‘ అని బిర్లా చెప్పారు.

మరిన్ని వార్తలు