ఈ - ఫైలింగ్‌ పోర్టల్‌లో అవాంతరాలు

9 Jun, 2021 09:01 IST|Sakshi

ట్విట్టర్‌లో కేంద్ర ఆర్థిక మంత్రికి ఫిర్యాదులు

ఆవాంతరాలు సరిచేయాలన్న మంత్రి నిర్మలా సీతారామన్‌

న్యూఢిల్లీ: పన్ను రిటర్నుల దాఖలు, రిఫండ్‌ల ప్రక్రియను మరింత వేగంగా, సులభంగా మార్చే ఉద్దేశ్యంతో ఆదాయపన్ను శాఖ ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన నూతన ఈ–ఫైలింగ్‌ పోర్టల్‌లో సాంకేతిక అంతరాలు దర్శనమిచ్చాయి. దీనిపై యూజర్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు ట్విట్టర్‌పై ఫిర్యాదు చేశారు. దీంతో అంతరాయాలను సరిచేయాలంటూ ఇన్ఫోసిస్, ఆ సంస్థ సారథి నందన్‌నీలేకనిని మంత్రి కోరారు. ‘‘అంతరాయాల విషయమై నా టైమ్‌లైన్‌పై ఫిర్యాదులను చూశాను. ఇన్ఫోసిస్, నందన్‌ నీలేకని మన పన్ను చెల్లింపుదారులకు నాణ్యమైన సేవలను అందించే విషయంలో నిరాశపరచదని భావిస్తున్నాను’’ అంటూ మంత్రి ట్వీట్‌ చేశారు. పన్ను చెల్లింపుదారులకు నిబంధనల అమలును సులభంగా మార్చడమే తమ ప్రాధాన్యమని మంత్రి చెప్పారు. 

నూతన ఈ–ఫైలింగ్‌ పోర్టల్‌ ఈ నెల 7న ప్రారంభమైంది. దీన్ని రూపొందించే కాంట్రాక్ట్‌ను 2019లో ఇన్ఫోసిస్‌ సొంతం చేసుకుంది. జీఎస్‌టీ నెట్‌వర్క్‌ పోర్టల్‌ను అభివృద్ధి చేసిందీ ఇన్ఫోసిస్‌ కావడం గమనార్హం.

చదవండి: ప్రముఖ వెబ్‌సైట్ల సర్వర్‌ డౌన్

మరిన్ని వార్తలు