‘విల్లు’ ఎక్కుపెట్టారా..?

7 Dec, 2020 03:03 IST|Sakshi

వీలునామాతో ఆస్తుల పంపకం ఎంతో సులభం

అనవసర వివాదాలకు చోటు ఉండదు

కోర్టుల చుట్టూ తిరగాల్సిన అవస్థ తప్పుతుంది

ఎవరికి ఏది ఇవ్వాలన్నది రాసేవారి అభీష్టం

అవసరమైతే విల్లుకు సవరణలూ చేసుకోవచ్చు

‘విల్లు’ (వీలునామా) ప్రాధాన్యం తెలిసిన వారు చాలా తక్కువ మందే ఉంటారు. ముఖ్యంగా కరోనా మహమ్మారి ఎంతో మందిని బలితీసుకుంటున్న విపత్కర పరిస్థితుల్లో ‘వీలునామా’కు ప్రాధాన్యం ఎంతో ఉంది. తమ ఆస్తులను తదనంతరం తమ వారికి న్యాయబద్ధంగా పంచడమే విల్లులోని ముఖ్య లక్ష్యం. దీనివల్ల ఆస్తుల కోసం వారసులు గొడవపడాల్సిన అవసరం ఏర్పడదు. అవి వారసులకు సులభంగా బదిలీ అవుతాయి.
ఇటీవలి కాలంలో వీలునామా పట్ల అవగాహన పెరుగుతోంది. దీనికి ఉన్న ప్రాధాన్యాన్ని తెలుసుకుంటున్నారు. విల్లును డ్రాఫ్ట్‌ చేయించేందుకు ఎక్కువ మంది ముందుకు వస్తున్నారు. అయినప్పటికీ వీలునామా గురించి సరైన అవగాహన ఉన్నది కొద్ది మందికే అన్నది వాస్తవం.  మరణానంతరం ఆస్తుల పంపకం విషయమై ఎంతో సాయపడే విల్లు గురించి, అందులోని సౌకర్యాల గురించి, విల్లు రాసే విషయంలో తప్పులకు అవకాశం ఇవ్వకుండా ఎలా వ్యవహరించాలన్నది అవగాహన కల్పించే కథనమే ఇది..

వీలునామా అంటే..?
‘వీలునామా’ అంటే చట్టపరమైన డాక్యుమెంట్‌. ఒక వ్యక్తి తన మరణం తర్వాత తన వారికి ఆస్తులను ఏ విధంగా పంపిణీ చేయాలన్న ధ్రువీకరణ. ‘‘విల్లుకు ఓ నిర్దిష్ట రూపం అంటూ లేదు. ఓ సాధారణ తెల్లని పేపర్‌పై పెన్నుతో స్పష్టంగా రాసి సంతకం చేసినా అది విల్లుగా మారుతుంది. దీనికి స్టాంప్‌ డ్యూటీ చెల్లించాల్సిన అవసరం లేదు. రిజిస్ట్రేషన్‌ కూడా చేసుకోవక్కర్లేదు’’అని ‘ఇండియా లా పార్ట్‌నర్స్‌’ మేనేజింగ్‌ పార్ట్‌నర్‌ గోపికా పంత్‌ తెలిపారు. అయితే అంత సులభమే అయినా కానీ అవగాహన లేకపోతే తప్పులకు ఆస్కారం ఏర్పడుతుంది. ‘‘ఏదైనా ఒక్క తప్పు చోటు చేసుకుంటే వీలునామా లక్ష్యమే నీరుగారిపోతుంది. మీ వారసుల గుర్తింపును స్పష్టంగా పేర్కొనాలి. ఏ ఆస్తులను ఇవ్వాలనుకున్నదీ వివరంగా రాయాలి’’ అని సిరిల్‌ అమర్‌చంద్‌ మంగళ్‌దాస్‌ పార్ట్‌నర్‌ అయిన రిషబ్‌ ష్రాఫ్‌ తెలిపారు.

ఏమేమి ఉండాలి?
వీలునామాలో నిర్దేశించిన విధంగా ఆస్తుల పంపిణీని చూసే వ్యక్తి పేరును కూడా అందులోనే పేర్కొనాల్సి ఉంటుంది. తన ఆకాంక్షలకు అనుగుణంగా ఆస్తులను వారసుల మధ్య పరిష్కరించే బాధ్యతలను నిర్వహించే సామర్థ్యాలు ఉన్నవారిని ఇందుకోసం ఎంచుకోవాలి. ఆస్తుల వివరాలతోపాటు, వాటిని ఏ రీతిలో పంచాలన్న వివరాలనూ విల్లులో పేర్కొనాలని పంత్‌ సూచించారు. ఒకవేళ తగినంత అనుభవం లేని లేదా పక్షపాతంగా వ్యవహరించే వ్యక్తిని నియమించుకుంటే అది సమస్యలకు దారితీస్తుందని హెచ్చరించారు.

‘‘విల్లు రాయడానికి ముందే ఆ విల్లు అమలు బాధ్యతలను చూసే వ్యక్తి విషయమై చర్చించడం మంచిది. జీవిత భాగస్వామి లేదా పెద్ద కుమారుడు లేదా కుమార్తె సాధారణ ఆప్షన్‌ అవుతుంది’’ అని రిషబ్‌ ష్రాఫ్‌ పేర్కొన్నారు. ప్రతీ కుటుంబానికి, పరిస్థితులనేవి భిన్నంగా ఉండొచ్చన్నారు. వీలునామా రాసే వ్యక్తి (టెస్టేటర్‌) పూర్తి ఆరోగ్యంతో, మానసిక ఆరోగ్యం కూడా సరిగ్గానే ఉండాలన్న నియమాన్ని తప్పకుండా గుర్తుంచుకోవాలి. స్వచ్ఛందంగా, ఎవరి బలవంతం లేకుండా విల్లును రాస్తున్నట్టు కూడా అందులో పేర్కొనాలి. రాసిన విల్లును ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మంది స్వతంత్ర వ్యక్తులు ధ్రువీకరించడం (అటెస్టేషన్‌) తప్పనిసరి. అప్పుడే దానికి విలువ చేకూరుతుంది.

వీలునామాలో ఆస్తులకు లబ్ధిదారులుగా ఉన్నవారు విల్లు నిర్వాహకులుగానూ ఉండొచ్చని పంత్‌ తెలిపారు. కాకపోతే వారసుల సాక్ష్యాన్ని (విట్‌నెస్‌) తీసుకోవడం లోపంగా పంత్‌ పేర్కొన్నారు. వారసులను సాక్షులుగా పేర్కొంటే ఉద్దేశం నెరవేరదన్న విషయాన్ని ఆమె గుర్తు చేశారు. ‘‘వీలునామాలో ‘రెసిడ్యుయరీ క్లాజ్‌’ అన్నది తప్పకుండా ఉండాలి. విల్లును రాసే నాటికి తన ఆస్తుల్లో కొన్నింటికి వారసులుగా ప్రత్యేకంగా ఎవరినీ సూచించలేకుంటే ఆ వివరాలను ఇందులో పొందుపరుస్తారు. ఈ భాగంలోనే ఆయా ఆస్తులకు ఒక వారసుడిని పేర్కొనాల్సి ఉంటుంది. మిగిలిన వారసుల అభీష్టానికి అనుగుణంగా వీటి అమలుపై నిర్ణయం తీసుకోవాలి’’అని పంత్‌ వివరించారు.

వివాదాలకు ఆస్కారం
వీలునామా స్పష్టంగా లేకపోతే వివాదాలు మొదలవుతాయి. సంరక్షకుణ్ణి నియమించకుండా ఆస్తులను మైనర్‌కు ఇవ్వాలని రాయడం వల్ల సదరు వ్యక్తి మేజర్‌ అయ్యే వరకు అమలు ఆగిపోవడం తరచుగా కనిపించే అంశమని ‘ఇండియా లా పార్ట్‌నర్స్‌’ మేనేజింగ్‌ పార్ట్‌నర్‌ గోపికా పంత్‌ పేర్కొన్నారు. అలాగే, వీలునామా రాసిన తర్వాత కాలంలో.. కొత్తగా సమకూర్చుకునే ఆస్తుల వివరాలను అప్‌డేట్‌ చేయకపోవడమూ కనిపించే అంశమని తెలిపారు.

‘‘ఇటీవలే ఓ వ్యక్తి విల్లు రాస్తూ అప్పటికి తన పేరు మీదున్న అన్ని ఆస్తుల వివరాలను పేర్కొన్నారు. ఆ తర్వాత తాను సమకూర్చుకున్న షేర్లు, బాండ్లను ఎవరికి ఇవ్వాలనుకున్నదీ వారసులకు తెలియజేశారు కానీ.. ఆ విషయాన్ని విల్లులో అప్‌డేట్‌ చేయకుండా మరణించారు. దీనివల్ల విల్లులో పేర్కొనని ఆస్తులను వారసులు సమానంగా పంచుకోవాల్సి వచ్చింది. పైగా ఆ ఆస్తులను తమ మధ్య సమానంగా పంచుకునేందుకు కోర్టు ఫీజులు, న్యాయ చార్జీల రూపంలో అదనపు ఖర్చుతోపాటు, సమయం కూడా వెచ్చించాల్సి వచ్చింది’’ అని పంత్‌ వివరించారు.

విల్లును సవరించడం
విల్లును రాసిన తర్వాతి కాలంలో ఆస్తుల పరంగా మార్పులు చోటు చేసుకున్నప్పటికీ.. ఆ వివరాలను తిరిగి విల్లులో పొందుపరచడం అన్నది చాలా మంది చేయడం లేదు. ఎలా చేయాలన్న సందేహమే ఇందుకు కారణం. ‘‘వీలునామాకు స్వల్ప మార్పులు అవసరమనిపిస్తే దాన్ని కోడిసిల్‌ (అనుబంధం) రూపంలో సవరణ చేసుకోవచ్చు. దాంతో అది విల్లులో ఒక భాగంగా మారిపోతుంది. ఒకవేళ గతంలో రాసిన వీలునామాలో పెద్ద ఎత్తున మార్పులు చేయాలనుకుంటే.. అప్పుడు సవరణలు కంటే కూడా తాజాగా విల్లును రూపొందించుకోవడం వల్ల గందరగోళానికి అవకాశం ఉండదు’’ అని పంత్‌ వివరించారు.

ఆస్తుల విలువ తరిగిపోయే కేసుల్లో వీలునామా సవరణ ఎంతో కీలకమవుతుందన్నారు. ‘‘ఒకవేళ ఇద్దరు లబ్ధిదారుల మధ్య ఆస్తులు సమానంగా పంపకం చేయాలని వీలునామా రాసినట్టయితే.. అందులో ఒక వ్యక్తికి చెందాల్సిన ఆర్థిక ఆస్తుల విలువ గణనీయంగా తరిగిపోతే.. అటువంటి సందర్భాల్లో ఆ మేరకు పరిహారం లభించేలా పంపకాలను నిర్దేశించాలి’’ అని కార్వీ ప్రైవేటు వెల్త్‌ ప్రొడక్ట్స్‌ హెడ్‌ శాంతను అవస్తి సూచించారు. ముఖ్యంగా కరోనా వంటి అసాధారణ పరిస్థితులు తలెత్తితే ఎలా వ్యవహరించాలన్నది వీలునామాలో పేర్కొనడం అవసరమని అభిప్రాయపడ్డారు.

మరిన్ని వార్తలు