డివ్‌జీ టార్క్‌ ఇష్యూ @ రూ. 560–590

28 Feb, 2023 00:40 IST|Sakshi

మార్చి 1–3 మధ్య పబ్లిక్‌ ఇష్యూ

న్యూఢిల్లీ: ఆటోమోటివ్‌ విడిభాగాల కంపెనీ డివ్‌జీ టార్క్‌ట్రాన్స్‌ఫర్‌ సిస్టమ్స్‌ పబ్లిక్‌ ఇష్యూ మార్చి 1న ప్రారంభంకానుంది. 3న ముగియనున్న ఇష్యూకి ధరల శ్రేణి షేరుకి రూ. 560–590గా నిర్ణయించింది. తద్వారా రూ. 412 కోట్లు సమీకరించే యోచనలో ఉంది. యాంకర్‌ ఇన్వెస్టర్ల బిడ్డింగ్‌ నేడు(28న) ప్రారంభంకానుంది. ఐపీవోలో భాగంగా రూ. 180 కోట్ల ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది. వీటికి జతగా మరో 39.34 లక్షల షేర్లను ప్రస్తుత ఇన్వెస్టర్లు, వాటాదారులు విక్రయానికి ఉంచనున్నారు.

ఈక్విటీ జారీ నిధులను పెట్టుబడి వ్యయాలు, తయారీ సౌకర్యాల పరికరాల కొనుగోలు, సాధారణ కార్పొరేట్‌ అవసరాలకు వినియోగించనుంది. రిటైల్‌ ఇన్వెస్టర్లు కనీసం 25 షేర్లకు(ఒక లాట్‌) దరఖాస్తు చేయవలసి ఉంటుంది. కంపెనీ ప్రధానంగా సిస్టమ్‌ లెవెల్‌ ట్రాన్స్‌ఫర్‌ కేస్, టార్క్‌ కప్లర్, డ్యూయల్‌ క్లచ్‌ ఆటోమేటిక్‌ ట్రాన్స్‌మిషన్‌ సొల్యూషన్లు అందిస్తోంది. క్లయింట్ల జాబితాలో ఎంఅండ్‌ఎం, టాటా మోటార్స్, టయోటా కిర్లోస్కర్‌ ఆటో పార్ట్స్‌ తదితరాలున్నాయి. మార్చి 14న కంపెనీ షేర్లు బీఎస్‌ఈ, ఎన్‌ఎస్‌ఈలలో లిస్ట్‌ అయ్యే వీలుంది.

మరిన్ని వార్తలు