దివీస్ ల్యాబ్స్ Q2 భళా

7 Nov, 2020 15:55 IST|Sakshi

జులై- సెప్టెంబర్ ఫలితాలు విడుదల

45 శాతం జంప్ చేసిన నికర లాభం

నికర అమ్మకాలు 21 శాతం అప్

విస్తరణపై రూ. 400 కోట్ల పెట్టుబడులు

ముంబై: ఫార్మా రంగ హైదరాబాద్ కంపెనీ దివీస్ ల్యాబొరేటరీస్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2020-21) రెండో త్రైమాసిక ఫలితాలు విడుదల చేసింది. ఈ ఏడాది క్యూ2(జులై- సెప్టెంబర్)లో కంపెనీ నికర లాభం 45 శాతానికిపైగా జంప్ చేసింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన రూ. 519.6 కోట్లను తాకింది. నికర అమ్మకాలు సైతం 21 శాతం పెరిగి రూ. 1,749 కోట్లను అధిగమించాయి. ఈ కాలంలో కంపెనీ కార్యకలాపాలు సాధారణ స్థాయికి చేరినట్లు దివీస్ ల్యాబ్స్ ఫలితాల విడుదల సందర్భంగా తెలియజేసింది. 

పీబీటీ జూమ్
క్యూ2లో దివీస్ ల్యాబ్స్ పన్నుకు ముందు లాభం(పీబీటీ) 42 శాతం ఎగసి రూ. 693 కోట్లను దాటింది. మొత్తం పన్ను వ్యయాలు దాదాపు 33 శాతం అధికంగా రూ. 174 కోట్లకు చేరాయి. ఈ కాలంలో రూ. 16 కోట్లమేర ఫారెక్స్ నష్టాలు నమోదైనట్లు దివీస్ వెల్లడించింది. ప్రస్తుత పెట్టుబడుల వ్యయ ప్రణాళికలు కొనసాగుతున్న నేపథ్యంలో తాజాగా మరో రూ. 400 కోట్లను వెచ్చించనున్నట్లు తెలియజేసింది. తద్వారా కస్టమ్ సింథసిస్ ప్రాజెక్టులలో కొత్త బిజినెస్ అవకాశాలను అందుకోనున్నట్లు పేర్కొంది. వీటిని త్వరితగతిన పూర్తి చేయవలసి ఉన్నట్లు వివరించింది.

షేరు ఇలా
ఏపీఐలు, ఇంటర్మీడియెట్స్ తదితర తయారీ కంపెనీ దివీస్ ల్యాబ్స్.. పలు దేశాలకు ప్రొడక్టులను ఎగుమతి చేస్తోంది. కాగా.. శుక్రవారం బీఎస్ఈలో దివీస్ ల్యాబ్స్ షేరు 1 శాతం బలపడి రూ. 3,238 వద్ద ముగిసింది. ఇంట్రాడేలో రూ. 3,265 వద్ద గరిష్టాన్ని తాకగా.. 3,189 దిగువన కనిష్టానికి చేరింది. ఈ ఏడాది ఇప్పటివరకూ దివీస్ షేరు 75 శాతంపైగా లాభపడటం గమనార్హం. 

మరిన్ని వార్తలు