దివీస్ జూమ్- గ్లెన్ మార్క్ బోర్లా

9 Nov, 2020 10:29 IST|Sakshi

క్యూ2(జులై- సెప్టెంబర్) ఫలితాల ఎఫెక్ట్

6.5 శాతం పతనమైన గ్లెన్ మార్క్ ఫార్మా

6 శాతం జంప్ చేసిన దివీస్ ల్యాబ్స్

52 వారాల గరిష్టానికి చేరిన దివీస్ ల్యాబ్స్

ముంబై : ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2020-21) రెండో త్రైమాసికంలో హెల్త్ కేర్ రంగ దిగ్గజాలు దివీస్ ల్యాబొరేటరీస్, గ్లెన్ మార్క్ ఫార్మాస్యూటికల్స్ సాధించిన ఫలితాలు ఈ కౌంటర్లపై విభిన్న ప్రభావాన్ని చూపుతున్నాయ. ఈ ఏడాది క్యూ2(జులై- సెప్టెంబర్)లో దివీస్ ల్యాబ్స్ ప్రోత్సాహకర ఫలితాలు సాధించగా.. గ్లెన్ మార్క్ పనితీరు నిరాశపరచింది. దీంతో దివీస్ కౌంటర్ కు డిమాండ్ నెలకొనగా.. గ్లెన్ మార్క్ కౌంటర్లో అమ్మకాలు పెరిగాయి. వెరసి దివీస్ షేరు లాభాలతో సందడి చేస్తుంటే.. గ్లెన్ మార్క్ నష్టాలతో కళ తప్పింది. వివరాలు చూద్దాం..

దివీస్ ల్యాబ్స్
ఈ ఏడాది క్యూ2(జులై- సెప్టెంబర్)లో దివీస్ ల్యాబ్స్ నికర లాభం 45 శాతానికిపైగా జంప్ చేసింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన రూ. 519.6 కోట్లను తాకింది. నికర అమ్మకాలు సైతం 21 శాతం పెరిగి రూ. 1,749 కోట్లను అధిగమించాయి. క్యూ2లో పన్నుకు ముందు లాభం 42 శాతం ఎగసి రూ. 693 కోట్లను దాటింది. మొత్తం పన్ను వ్యయాలు దాదాపు 33 శాతం అధికంగా రూ. 174 కోట్లకు చేరాయి. ఈ కాలంలో రూ. 16 కోట్లమేర ఫారెక్స్ నష్టాలు నమోదైనట్లు దివీస్ వెల్లడించింది. ప్రస్తుత పెట్టుబడుల వ్యయ ప్రణాళికలు కొనసాగుతున్న నేపథ్యంలో తాజాగా మరో రూ. 400 కోట్లను వెచ్చించనున్నట్లు తెలియజేసింది. ఫలితాల నేపథ్యంలో ప్రస్తుతం దివీస్ ల్యాబ్స్ షేరు ఎన్ఎస్ఈలో 4.6 శాతం జంప్ చేసి రూ. 3,386 వద్ద ట్రేడవుతోంది. తొలుత 6 శాతం పురోగమించి రూ. 3,435ను తాకింది. ఇది 52 వారాల గరిష్టంకావడం గమనార్హం.

గ్లెన్ మార్క్ ఫార్మా
ఈ ఏడాది క్యూ2(జులై- సెప్టెంబర్)లో గ్లెన్ మార్క్ ఫార్మాస్యూటికల్స్ నికర లాభం 8.4 శాతం క్షీణించి రూ. 234 కోట్లకు పరిమితమైంది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన నికర అమ్మకాలు మాత్రం 5.2 శాతం పెరిగి రూ. 2,908 కోట్లను అధిగమించాయి. క్యూ2లో పన్నుకు ముందు లాభం 2 శాతం నీరసించి రూ. 339 కోట్లను తాకింది. మొత్తం పన్ను వ్యయాలు దాదాపు 33 శాతం అధికంగా రూ. 137 కోట్లకు చేరాయి. ఫలితాల నేపథ్యంలో ప్రస్తుతం దివీస్ ల్యాబ్స్ షేరు ఎన్ఎస్ఈలో 5 శాతం పతనమై రూ. 486 వద్ద ట్రేడవుతోంది. తొలుత 6.5 శాతం వెనకడుగుతో రూ. 479ను తాకింది.

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా