Divya Gokulnath: ఫోర్బ్స్‌ లిస్ట్‌లో.. సంపద ఎంతో తెలుసా?

9 Oct, 2021 10:04 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌:  గుర్తుపెట్టుకో. నీకంటే తోపు ఎవడూ లేడిక్కడ.. నీ టార్గెట్‌ పదో మైల్‌ అయితే.. పదకొండో మైల్‌పై గురిపెట్టు అంటాడు బిజినెస్‌ మ్యాన్‌ సినిమా హీరో. సరిగ్గా ఇదే థీరీని తన జీవితానికి అన్వయించుకుందీ యువ మహిళా పారిశ్రామిక వేత్త దివ్య గోకుల్‌ నాథ్‌. తన ధ్యేయం, లక్ష్య సాధన వైపు దివ్యమైన అడుగులు వేస్తూ సంపదలో రివ్వున దూసుకుపోయింది.  ఫలితంగా దేశంలోనే 100 మంది  మహిళా ధనవంతులైన ఫోర్బ్స్ జాబితాలో స్థానం దక్కించుకుంది దివ్యగోకుల్‌నాథ్‌. ప్రముఖ ఆన్‌లైన్‌ ఎడ్యుకేషనల్‌ టెక్‌ కంపెనీ బైజూస్‌ సహ వ్యవస్థాపకురాలైన దివ్య గోకుల్‌నాథ్ కేవలం 35 ఏళ్ల వయసులో ఈ లిస్ట్‌లో ఆరుగురు దిగ్గజ మహిళా పారిశ్రామికవేత్తల సరసన దక్కించుకోవడం విశేషం.  

ముఖ్యంగా కరోనా మహమ్మారి కారణంగా ఆన్‌లైన్‌ చదువులకు ప్రాధాన్యత పెరిగిన నేపథ్యంలో గోకుల్‌నాథ్ సంపద గత సంవత్సరంలో దాదాపు రూ. 7,477 కోట్లు పుంజుకుని ప్రస్తుతం ఏకంగా సుమారు రూ. 3.02 లక్షల కోట్లు పెరిగింది. తద్వారా ధనవంతుల జాబితాలో  47వ ర్యాంక్‌  సొంతం చేసుకుంది.  ఓపీ జిందాల్‌ గ్రూప్‌ అధినేత్రి 71 ఏళ్ల సావిత్రీ జిందాల్‌, హ్యావెల్స్‌ ఇండియా అధినేత్రి  76 ఏళ్ల వినోద్‌ రాయ్‌ గుప్తా,  యూఎస్‌వీ ప్రైవేట్‌ లిమిటెడ్‌ అధినేత్రి లీనా తివారి, బయోకాన్‌ సీఎండీ కిరణ్‌ మజుందార్‌షా,  ట్రాక్టర్స్‌ అండ్‌ ఫార్మ్‌ ఎక్విప్‌మెంట్‌ లిమిటెడ్‌ అధినేత్రి మల్లికా శ్రీనివాసన్‌ లాంటి లెజెండ్స్‌తో  పోటీపడ్డారు. 

దివ్య అంతకుముందు కూడా అనేక అవార్డులను తన ఖాతాలో వేసుకున్నారు. ఉమెన్ అంట్రప్రెన్యూర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు, 2020 ఫెమినా పవర్ లిస్ట్. ఫోర్బ్స్ ఆసియా పవర్ బిజినెస్ ఉమెన్ , ఫార్చ్యూన్ ఇండియా అత్యంత శక్తివంతమైన మహిళ అవార్డుతోపాటు,  2021 మేకర్స్ ఇండియా కాన్ఫరెన్స్, ఎంటర్‌ప్రెన్యూర్ ఆఫ్ ది ఇయర్ అవార్డును దక్కించుకున్నారు. 

1987లో  బెంగళూరులో బెంగళూరులో జన్మించింది  దివ్య.  తండ్రి అపోలో హాస్పిటల్స్‌లో నెఫ్రాలజిస్ట్, ఆమె తల్లి దూరదర్శన్ బ్రాడ్‌కాస్టింగ్ కంపెనీలో ప్రోగ్రామింగ్ ఎగ్జిక్యూటివ్. ఏకైక సంతానమైన దివ్యకు చిన్నతనంనుంచే సైన్స్, గణితం శ్రద్ధగా నేర్పించారు. కష్టపడే తత్వాన్ని, లక్ష్యాల్ని సాధించే కమిట్‌మెంట్‌ను  అమ్మానాన్నల నుంచి అలవర్చుకున్న దివ్య చదువులో బాగా రాణించింది. బయోటెక్నాలజీలో డిగ్రీ చేసి పైచదువులకు విదేశాలకు వెళ్లేందుకు 2007లో జీఆర్‌ఈ కోచింగ్‌ సందర్భంలో బైజూస్‌ రవీంద్రన్‌తో పరిచయం ఆమె జీవితాన్ని మలుపు తిప్పింది. అక్కడే  టీచింగ్‌ వృత్తిని ఎంచుకుంది. ఈ క్రమంలోనే బైజూ రవీంద్రన్‌తో ప్రేమ, పెళ్లి జరిగిపోయాయి. ఇద్దరుబిడ్డలకు జన్మనిచ్చింది. బోధనలో కొత్త పద్ధతులు అవలంబించాలనే కోరికతో 2011లో, దివ్య తన భర్తతో కలిసి బైజు ఆన్‌లైన్ ఎడ్యుకేషన్ ప్లాట్‌ఫామ్‌కు నాంది పలికింది. సింపుల్‌ లెర్నింగ్‌ టెక్నిక్స్‌తో విద్యార్థుల విపరీతంగా ఎట్రాక్ట్‌ చేస్తూ అంచెలంచెలుగా ఎదుగుతోంది. ప్రస్తుతం బైజూస్లో ఏడున్నర కోట్లకుపైగా సబ్‌స్క్రైబర్లున్నారంటే దీని ప్రాధాన్యతను అర్థం చేసుకోవచ్చు.

మరిన్ని వార్తలు