కాల్చకుండానే పేలుతున్న క్రాకర్స్‌.. ఈ దీపావళి చాలా కాస్ట్‌లీ గురూ!

22 Oct, 2022 13:41 IST|Sakshi

ఎట్టికేలకు కరోనా వ్యాప్తి తగ్గింది. దీంతో ఆంక్షలు కూడా పక్కకు వెళ్లిపోయాయి. ఈ ఏడాది దీపావళి పండగను ఇంటిల్లపాదీ సంతోషంగా జరుపుకొనేందుకు సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలో ప్రజలకు బాణసంచా ధరలు గుండె గుబేల్‌మనిపించేలా ఉన్నాయి. డిమాండ్‌ను బట్టి వ్యాపారులు రెట్టింపు ధరలకు అమ్ముతున్నారు. సీజన్‌ కావడంతో హోల్‌సేల్‌ దుకాణాల వద్ద వారం రోజుల నుంచే సందడి నెలకొంది.

మరోవైపు తాత్కాలిక దుకాణాలకు అధికారికంగా అనుమతులు ఉన్న వాళ్లు, లేనివాళ్లు ఇప్పటికే అవసరమైన ఏర్పాట్లు చేసుకుంటున్నారు. వరుసగా రెండేళ్ల పాటు కరోనా నేపథ్యంలో దీపావళి బాణసంచా వ్యాపారం జరగని విషయం తెలిసిందే. ఈ ఏడాది కాస్త సొమ్ము చేసుకోవాలని వ్యాపారులు చూస్తున్నారు. దీంతో బాణాసంచాలు ధరలు ఆకాశాన్నంటుతున్నాయి.

రవాణా భారం వల్లే ఎక్కువ ధరలు..     
కోవిడ్‌ పరిస్థితుల నేపథ్యంలో గత రెండు సంవత్సరాలుగా అంతంత మాత్రమే జరుపుకోవాల్సి వచ్చింది. దీంతో అటు వ్యాపారులు ఇటు ప్రజలు గతేడాది పోలిస్తే ఈ ఏడాది వ్యాపారం బాగా జరుగుతుందని దుకాణదారులు అంచనా వేస్తున్నారు. ఈ క్రమంలో బాణసంచా దుకాణాలు కస్టమర్లతో కళకళలాడుతున్నాయి. గతంలో రూ.వెయ్యి పెడితే చిన్నా చితకా సామాగ్రి కలిపి 20 నుంచి 30 వరకు వచ్చేవి.

ఇప్పుడు ధరలను చూస్తే వాటిలో సగం కూడా రాని పరిస్థితి కనిపిస్తోంది. తమిళనాడులోని శివకాశీ తదితర ప్రాంతాల నుంచి హోల్‌సేల్‌గా తీసుకురావడానికి రవాణా చార్జీలు భారీగా పెరిగిపోయాయని వ్యాపారులు చెబుతున్నారు. డీజిల్‌ ధర అనూహ్యంగా పెరిగిన ప్రభావం దీపావళి బాణసంచా విక్రయాలపై కూడా కనిపిస్తోందని ఆందోళన చెందుతున్నారు. కొంతమంది వ్యాపారులు మాత్రం ఇదే అదనుగా ధరలు పెంచేసి కొనుగోలుదారుల నడ్డి విరగ్గొడుతున్నారు. 

చదవండి: భారీ షాక్‌.. దీపావళి తర్వాత ఈ ఫోన్లలో వాట్సాప్‌ బంద్‌!

మరిన్ని వార్తలు