బాబోయ్‌ అదిరిపోయే బంపరాఫర్‌.. పాత ఇళ్లు ఇచ్చి కొత్త ఇళ్లు తీసుకోండయ్యా!

14 Oct, 2022 17:31 IST|Sakshi

పెళ్లి చేసి చూడు, ఇళ్లు కట్టి చూడు అన్నారు పెద్దలు. ఎందుకంటే ఈ రెండు జీవితంలో చాలా ముఖ్యమైనవి, అలాగే కష్టంతో కూడుకున్నవి కాబ‍ట్టి. పెళ్లి టాపిక్‌ పక్కన్న పెట్టి ఇంటి విషయంలోకి వెళ్దాం. సమాజంలో ప్రతి ఒక్కరూ కనే కల తమకంటూ ఓ సొంతిళ్లు ఉండాలనుకోవడం. ఇందుకోసం కొన్నేళ్లు కష్టపడేవాళ్లు కూడా ఉన్నారు. ఈ క్రమంలో కొందరి కల కలగానే మిగిలిపోతే,  మరికొందరు కష్టపడి సాధించుకుంటున్నారు. ఇంతటి ప్రాముఖ్యత ఉన్న ఇంటిని పండుగ సీజన్‌లో ఓ బంపరాఫర్‌ ద్వారా మన సొంతం చేసుకోవచ్చండి. ఎలా అనుకుంటున్నారా!

ఈ ఆఫర్‌ ఎక్కడో తెలుసా!
కొత్త అపార్ట్‌మెంట్ల విక్రయాల జోరును కొనసాగించేందుకు, కాన్ఫెడరేషన్ ఆఫ్ రియల్ ఎస్టేట్ డెవలపర్స్ అసోసియేషన్స్ ఆఫ్ ఇండియా (CREDAI)- మహారాష్ట్ర చాంబర్ ఆఫ్ హౌసింగ్ ఇండస్ట్రీ (MCHI) ఓ ఆఫర్‌ని ప్రకటించాయి.

అయితే, ఈ ఆఫర్‌ ముంబైలోని వారికి మాత్రమే వర్తిస్తుంది. ముంబైలోని బాంద్రా-కుర్లా కాంప్లెక్స్ (BKC)లోని ఎంఎంఆర్‌డీఏ (MMRDA) గ్రౌండ్స్‌లో (CREDAI-MCHI) 30వ ప్రాపర్టీ ఎగ్జిబిషన్‌ నిర్వహిస్తోంది. ఇందులో 100 మందికి పైగా రియల్టీ డెవలపర్లు పాల్గొంటున్నారు. ఈ ఈవెంట్‌ అక్టోబర్ 13 నుంచి 16 వరకు జరుగుతుంది. ఈ ఎగ్జిబిషన్ విజయవంతంగా నిర్వహించడం కోసం, ప్రోప్‌టెక్ స్టార్టప్ జాప్‌కీ (Zapkey) CREDAI-MCHIతో జతకట్టింది. 

ఆఫర్‌ ఏంటంటే!
జాప్‌కీ పాత ఇళ్లు అమ్మాలనుకునే వారికి కొంత టోకన్‌ అమౌంట్‌ ఇస్తుంది. వారికి 90 రోజుల్లోగా ఆ ఇంటిని కచ్చితంగా అమ్మిపెడుతుంది.  ఆసక్తి గల కొనుగోలుదారులు తమ పాత ఇంటికి ఎక్స్చేంజ్‌గా కొత్త అపార్ట్‌మెంట్‌ని అక్కడే కొనుగోలు చేసుకోవచ్చు. ఈ ఆఫర్‌పై జాప్‌కీ కో వ్యవస్థాపకుడు మాట్లాడుతూ.. ‘‘మేము టోకెన్‌ డబ్బులు ఇచ్చి కస్టమర్ల ఇంటిని మార్కెట్‌ ధరకే అమ్ముతాము. అది కూడా 90 రోజుల్లోనే. ఒకవేళ ఆ ప్రాపర్టీని అమ్మలేకపోతే ఆ ఇంటిని మేమే కొనడం లేదా టోకెన్‌ అమౌంట్‌ను వదులుకుంటాం.

 ₹1 కోటి కంటే ఎక్కువ విలువ కలిగిన ఆస్తుల కోసం కస్టమర్లు ₹1 లక్ష,  ₹1 కోటి కంటే తక్కువ విలువ కలిగిన ఆస్తులకు ₹50,000 టోకెన్ అమౌంట్‌గా చెల్లిస్తాం. 20 సంవత్సరాల కంటే పాత ఆస్తిని తీసుకోము, కానీ కొన్ని సందర్భాల్లో భవనం మంచి స్థితిలో ఉంటే మార్కెట్లో డిమాండ్ ఉన్నట్లయితే, మేము దానిని తీసుకోవచ్చు. అది కూడా ఆస్తిని భౌతికంగా సందర్శించిన తర్వాత విక్రయిస్తామని," చెప్పారు. అలాగే పాత ప్రాపర్టీని అమ్మి పెడుతున్నందుకు బ్రోకరేజ్ ఛార్జీలుగా 2 శాతాన్ని తాము వసూలు చేయనున్నామని ఈ ప్రాప్‌టెక్ సంస్థ తెలిపింది. 

చదవండి: ఇది ఊహించలేదు.. యూజర్లకు భారీ షాకిచ్చిన జియో!

మరిన్ని వార్తలు