బీఎస్‌ఈలో ఎలక్ట్రానిక్‌ గోల్డ్‌ షురూ

26 Oct, 2022 10:02 IST|Sakshi

ఈజీఆర్‌ ప్లాట్‌ఫామ్‌ ద్వారా ట్రేడింగ్‌

న్యూఢిల్లీ: బంగారం ట్రేడింగ్‌లో పారదర్శకతకు తెరతీస్తూ దిగ్గజ స్టాక్‌ ఎక్స్ఛేంజీ బీఎస్‌ఈ.. ఎలక్ట్రానిక్‌ గోల్డ్‌ రిసీప్ట్స్‌(ఈజీఆర్‌) ప్లాట్‌ఫామ్‌ను ప్రవేశపెట్టింది. దీపావళి సందర్భంగా నిర్వహించిన ముహూరత్‌ ట్రేడింగ్‌ ద్వారా 995, 999 స్వచ్ఛత పేరుతో రెండు ప్రొడక్టులను ప్రారంభించింది. వీటిని 1 గ్రాము పరిమాణంతో ప్రారంభించడంతోపాటు 10 గ్రాములు, 100 గ్రాములలోనూ డెలివరీలకు వీలు కల్పించింది.

ఈజీఆర్‌ ప్లాట్‌ఫామ్‌ను ఆవిష్కరించేందుకు క్యాపిటల్‌ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ నుంచి గత నెలలో బీఎస్‌ఈకి తుది అనుమతి లభించిన సంగతి తెలిసిందే. ఈ ఏడాది ఫిబ్రవరిలో సూచనప్రాయ అనుమతి లభించాక సభ్యులు ట్రేడింగ్‌ చేసేందుకు వీలుగా బీఎస్‌ఈ పరీక్షార్థం పలుమార్లు మాక్‌ ట్రేడింగ్‌ను నిర్వహించింది. కాగా.. ఈజీఆర్‌లో వ్యక్తిగత ఇన్వెస్టర్లతోపాటు..బులియన్‌ ట్రేడర్లు, వాణిజ్య క్లయింట్లు తదితర సంస్థలు సైతం ట్రేడింగ్‌ను చేపట్టేందుకు వీలుంటుంది. దిగుమతిదారులు, బ్యాంకులు, రిఫైనరీలు, ఆభరణ తయారీదారులు, రిటైలర్లు ఈ ప్లాట్‌ఫామ్‌ను ఉపయోగించుకోవచ్చు. దీంతో స్పాట్‌ ధరల్లో మరింత పారదర్శకత వస్తుందని బులియన్‌ వర్గాలు అభిప్రాయపడ్డాయి.

చదవండి: షాపింగ్‌ బంద్‌, యూపీఐ లావాదేవీలు ఢమాల్‌.. ఏమయ్యా విరాట్‌ కోహ్లీ ఇదంతా నీ వల్లే!
 

మరిన్ని వార్తలు