పండుగ వేళ .. తగ్గిన నోట్ల వినియోగం

5 Nov, 2022 04:37 IST|Sakshi

దీపావళి వారంలో రూ. 7,600 కోట్ల మేర ‘సీఐసీ’ తగ్గుదల

ముంబై: దీపావళి పండుగ వారంలో చలామణీలో ఉన్న నగదు (సీఐసీ) పరిమాణం రూ. 7,600 కోట్ల మేర తగ్గింది. రెండు దశాబ్దాల్లో ఇంత భారీ స్థాయిలో తగ్గడం జరగడం ఇదే ప్రథమం. డిజిటల్‌ చెల్లింపులపై ప్రజలు ఎక్కువగా ఆధారపడుతుండటం ఇందుకు దోహదపడిందని ఒక నివేదికలో ఎస్‌బీఐ ఆర్థికవేత్తలు పేర్కొన్నారు. 2009లో దీపావళి వారంలో కూడా సీఐసీ స్వల్పంగా రూ. 950 కోట్ల మేర తగ్గినప్పటికీ, అప్పట్లో తలెత్తిన అంతర్జాతీయ ఆర్థిక సంక్షోభ ప్రేరేపిత మందగమనం ఇందుకు కారణమని వారు తెలిపారు.

  టెక్నాలజీలో కొత్త ఆవిష్కరణలు భారత పేమెంట్‌ వ్యవస్థ రూపురేఖలను మార్చేశాయని ఆర్థికవేత్తలు చెప్పారు. నగదు ఆధారిత ఎకానమీ నుంచి స్మార్ట్‌ఫోన్‌ ఆధారిత పేమెంట్‌ వ్యవస్థగా భారత్‌ రూపాంతరం చెందిందని వివరించారు. చెల్లింపు విధానాల్లో సీఐసీ వాటా 2016 ఆర్థిక సంవత్సరంలో 88 శాతంగా ఉండగా, 2022 ఆర్థిక సంవత్సరంలో 20 శాతానికి తగ్గింది. 2027 ఆర్థిక సంవత్సరం నాటికి 11.15 శాతానికి తగ్గుతుందని అంచనా. అలాగే 2016 ఆర్థిక సంవత్సరంలో 11.26 శాతంగా ఉన్న డిజిటల్‌ లావాదేవీల వాటా 2022 ఆర్థిక సంవత్సరంలో 80.4 శాతానికి చేరగా, 2027 నాటికి 88 శాతానికి చేరవచ్చని ఎస్‌బీఐ నివేదిక పేర్కొంది.  

మరిన్ని వార్తలు