DMart Q2 Update: డీమార్ట్‌ దూకుడు..!

2 Oct, 2021 20:44 IST|Sakshi

దేశంలోని అతిపెద్ద రిటైల్ చైన్‌లలో ఒకటైన డీమార్ట్‌ 2021-22 ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో అదరగొడుతుంది. క్యూ2లో డీమార్ట్‌ రూ.  7,650 కోట్ల ఆదాయాన్ని గడించింది . గత ఏడాది ఇదే త్రైమాసికంతో పోలిస్తే 46 శాతం అధికంగా లాభాలను ఆర్జించింది. గత ఏడాది క్యూ2లో రూ. 5,218 కోట్ల డీమార్ట్‌ సొంతం చేసుకుంది. రెండో త్రైమాసికంలో కార్యకలాపాల నుంచి వచ్చే సంపూర్ణ ఆదాయం కంపెనీ చట్టబద్ధమైన ఆడిటర్ల పరిమిత సమీక్షకు లోబడి ఉంటుందని డీమార్ట్ ఒక ఫైలింగ్‌లో తెలిపింది. ఈ ఏడాది తొలి త్రైమాసికంలో కరోనావైరస్  ప్రభావం బాగా కన్పించింది. సెకండ్‌వేవ్‌ను దృష్టిలో ఉంచుకొని అనేక రాష్ట్ర ప్రభుత్వాలు ఆంక్షలను విధించాయి.  ఏదేమైనా దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాలు  క్రమంగా లాక్‌డౌన్లను ఎత్తివేయడం, టీకా వేగాన్ని పెంచడంతో, రిటైల్‌ మార్కెట్లు  వృద్ధిలో సానుకూల వేగాన్ని చూస్తున్నాయి.
చదవండి: అతి తక్కువ ధరలోనే..భారత మార్కెట్లలోకి అమెరికన్‌ బ్రాండ్‌ టీవీలు..!

దేశ వ్యాప్తంగా  2021 సెప్టెంబర్‌ 30 నాటికి మొత్తం డీమార్ట్‌ స్టోర్స్‌ సంఖ్య 246కు పెరిగింది. డీమార్ట్‌ షేర్లు రూ. 4242 వద్ద ముగిశాయి. ఈ ఏడాది ప్రారంభం నుంచి ఇప్పటివరకు డీమార్ట్‌ షేర్లు 50శాతం పైగా పెరిగాయి. స్టాక్‌ మార్కెట్‌లో అద్బుతర్యాలీను డీమార్ట్‌ నమోదుచేస్తోంది. డీమార్ట్‌ యాజమాని రాధాకిషన్‌ ఎస్‌ దమాని ఇటీవలే టాప్‌ -100 ప్రపంచ బిలియనీర్స్‌ ఎలైట్‌ క్లబ్‌లో ప్రవేశించారు. బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్‌ ప్రకారం దమాని నికర ఆస్తుల విలువ 22.5 బిలియన్ డాలర్లతో బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్‌లో 70 వ స్థానంలో కొనసాగుతున్నారు.

చదవండి: ఇంధన ధరల పెంపుపై 9 నెలల్లో కేంద్రం చెప్పిన 9 కారణాలు..!

మరిన్ని వార్తలు